Internal Fights | కాంగ్రెస్‌లో కలహాల కుంపట్లు! అందుకే క్యాబినెట్ విస్తరణ వాయిదాలు?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపురాజకీయాలను అరికట్టడంలో పార్టీ అధిష్ఠానం విఫలమైందా? అన్న చర్చ కూడా రాజకీయ పరిశీలకుల్లో జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఎందుకు కంట్రోల్ చేయలేక పోతున్నారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

- బజారుకెక్కిన కాంగ్రెస్ పరువు
- పార్టీ శ్రేణుల తీవ్ర ఆవేదనలు
- ఖాళీగా ఆరు మంత్రిత్వ శాఖలు
- వాటికోసం భారీగా ఆశావహులు
- క్యాబినెట్ బెర్త్ కోసం వార్నింగ్స్
- తమకే దక్కాలని హూంకరింపు
- గ్రూపు పాలిటిక్స్‌ను అరికట్టరా?
Internal Fights | హైదరాబాద్, ఏప్రిల్ 17 (విధాత): కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు రోజు రోజుకూ తీవ్రం అవుతున్నాయి. నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్టేట్‌మెంట్లు ఇస్తూ పార్టీ పరువును బజారు కీడుస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కలహాల కుంపట్లు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితి కనిపించడం లేదని ఆయన అంటున్నారు. కొంతమంది నేతలు గ్రూపులు కడుతూ సై అంటే సై అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు, తీవ్రమైన పోటీ కారణంగానే మంత్రి వర్గ విస్తరణ చేయలేక వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ క్యాబినెట్‌లో 18 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంది. అయితే.. ఈక్వేషన్స్ ఆధారంగా మంత్రివర్గ విస్తరణ చేయడానికి వీలుగా మొదట్లో రేవంత్‌రెడ్డి సీఎంగా, మరో 11 మంది మంత్రులుగా క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులపై అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశలు పెట్టుకున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావించినప్పుడల్లా అనేక మంది నేనున్నానంటూ మందుకు వస్తున్నారు. మంత్రి పదవి నాకు కాకుండా ఇంకొకరికి ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జిల్లాల వారీగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారి లిస్ట్ చాంతాడంత ఉండనే ఉన్నది.
ప్రేమ్‌సాగర్‌రావు వర్సెస్ వివేక్
ఆదిలాబాద్ జిల్లాలో నేతలు ప్రేమ్ సాగర్ రావు వర్సెస్ వివేక్, వినోద్‌ల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని వారి మాటల్లోనే అర్థమవుతున్నది. ప్రేమ్‌సాగర్ మాట్లాడుతూ ఒకే కుటుంబంలో ముగ్గురికి పదవులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. సోమవారం మంచిర్యాలలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటికే పార్టీలు మారి నిన్న మొన్న పార్టీలో వచ్చిన ఒకే కుటుంబం నుంచి వచ్చిన ముగ్గురికి ఎమ్మెల్యేలుగా, ఎంపీగా అవకాశం ఇచ్చారని, ఇప్పడు వాళ్లే పదవులు అడుగుతున్నారన్న ప్రేమ్‌సాగర్‌రావు.. వారికి పదవులు ఇస్తే పార్టీకి నష్టం తప్పదని ఎమ్మెల్యేలు వివేక్, వినద్, ఎంపీ వంశీలనుద్దేశించి అన్నారు. తనకు అన్యాయం చేస్తే సహించేది లేదని తీవ్ర స్వరంతో చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన వివేక్.. తాను బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రిని అయ్యేవాడినని చెప్పుకొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తేనే పార్టీలోకి వచ్చానని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే పరిస్థితి నెలకొన్నది.
ఉమ్మడి నల్లగొండలో ఓపెన్ వార్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డిల మధ్య రాజకీయ యుద్ధం బాహాటంగానే నడుస్తున్నది. జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా శకునిలా అడ్డు పడుతున్నాడని ఆరోపించారు రాజగోపాల్‌రెడ్డి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కూడా లేఖ రాశారు. అలాగే ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి మధ్య కూడా సఖ్యత లేదన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నేతలు కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య సఖ్యత లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాల వరకే పరిమితం అయ్యారన్న చర్చ జరుగుతున్నది.
ఖమ్మంలో ముగ్గురూ ముగ్గురే
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నారు. కానీ ముగ్గురికీ ఒకరంటే ఒకరికి పడదన్న చర్చలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు మంత్రుల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నడుస్తోందంటున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటారని రాజకీయ పరిశీలకుడొకరు అన్నారు. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదిరే అవకాశం కూడా లేదని జిల్లాకు చెందిన ఒక నేత అభిప్రాయపడ్డారు. అలాగే మెదక్ జిల్లాలో పటాన్ చెరువు నియోజకవర్గం కేంద్రంగా ఉన్న ఇద్దరు నేతలు కాట శ్రీనివాస్, నీలం మధుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది.
రేసులో వారు సైతం..
నేతల మధ్య ఆధిపత్య పోరుతోపాటు తెలంగాణ జనసమితి నేత, ఎమ్మెల్సీ కోదండరాం, ఇటీవల ఎమ్మెల్సీగా పదవి పొందిన విజయశాంతి, అద్దంకి దయాకర్ కూడా మంత్రి పదవులు కావాలని ఆశిస్తున్నారని వారి వర్గాలు చెబుతున్నాయి. ఇలా మంత్రి వర్గ విస్తరణలో ఆశావాహుల సంఖ్య చాంతాడంత ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపులు, ఆధిపత్య పోరు, ఎవరికి వారే అధిష్ఠానం వద్ద పైరవీలు చేసుకోవడం వంటి కారణాలతో మంత్రివర్గ విస్తరణను అధిష్ఠానం చేపట్టలేక పోతున్నదని సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
దక్షిణ తెలంగాణకు ప్రాధాన్యం
ఇప్పటికే కొలువుదీరిన మంత్రివర్గంలో దక్షిణ తెలంగాణ నుంచి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినట్టయింది. ఒక్క ఖమ్మం జిల్లా నుంచే డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుకు మంత్రి పదవులు దక్కాయి. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి ఇద్దరికి, మెదక్ నుంచి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి మంత్రి వర్గంలో ఏ ఒక్కరికీ చోటు లభించలేదు. రంగారెడ్డి జిల్లాకు స్పీకర్ పదవి రాగా, హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం లేక పోవడంతో ఎవ్వరికీ అవకాశం రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నగ్రూపు తగాదాల వల్లనే అక్కడ ఎవ్వరికీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది.
గ్రూపు రాజకీయాలను అరికట్టలేరా?
కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపురాజకీయాలను అరికట్టడంలో అధిష్ఠానం విఫలమైందా? అన్న చర్చ కూడా రాజకీయ పరిశీలకుల్లో జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఎందుకు కంట్రోల్ చేయలేక పోతున్నారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయి పర్యటనల తర్వాత కూడా నేతలు బహిరంగంగా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడాన్ని పరిశీలిస్తే ఈ కుంపట్లు ఇప్పట్లో ఆరేలా లేవనిసీనియర్ జర్నలిస్ట్ ఒకరు అన్నారు.