కాళేశ్వరం ఇంజినీర్లను… తప్పించారా? పైరవీలతో తప్పించుకున్నారా?

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అక్షరాలా లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అధికారంలోకి రాగానే నాయకులను, ఇంజినీర్లను బొక్కలో వేసి ప్రభుత్వ సొమ్మును కక్కిస్తామని కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు వాగ్దానాలు గుప్పించారు. ఆ వాగ్దానాల సంగతేమోగానీ.. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు కాంగ్రెస్‌ హయాంలో దర్జాగా బయటపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాళేశ్వరం ఇంజినీర్లను… తప్పించారా? పైరవీలతో తప్పించుకున్నారా?
  • నీటిపాలైన విజిలెన్స్, ఘోష్ కమిషన్ నివేదికలు
  • కాలయాపనతో కాలం చెల్లేలా చేశారా
  • నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ చేతులెత్తేశారా!

విధాత, హైదరాబాద్:

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడి పదవీ విరమణ చేసిన, పనిచేస్తున్న 57 మంది ఇంజినీరింగ్ అధికారులపై చర్యలకు గతేడాది మార్చి నెలలో తెలంగాణ విజిలెన్స్ కమిషన్ పలు సిఫారసులు చేసింది. కాన.. ఇప్పటి వరకు ఒక్క ఇంజినీరుపై కూడా చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. చర్యలు తీసుకోకుండా నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించారా? ఇంజినీర్లే పైరవీలు చేసుకుని తప్పించుకున్నారా? అనే చర్చలు సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా రాజకీయ నాయకులు కూడా హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా పలువురు అభివర్ణిస్తున్నారు.

ఇదీ విజిలెన్స్ కమిషన్ నివేదిక

తెలంగాణ విజిలెన్స్ కమిషన్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ జరిపింది. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై చర్యలకు పలు సిఫారసులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి గతేడాది మార్చి నెలలో నివేదిక పంపించగా, దానిని నాలుగు నెలల తరువాత.. జూన్ నెలలో నీటిపారుదల శాఖ బహిర్గతం చేసింది. ప్రధానంగా కాళేశ్వరం నిర్మాణంలో ఏమాత్రం అనుభవం లేని, కొత్త వారిని నియమించి తప్పులు చేశారని నివేదిక స్పష్టం చేసింది. వీరి పనితీరు మూలంగా మేడిగడ్డ బారాజ్ కుంగిపోవడంతో ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నది. కాంట్రాక్ట్ పొందిన ఎల్‌అండ్‌టీ –పీఈఎస్ జాయింట్ వెంచర్ సంస్థ ప్రతిపాదించిన డాక్యుమెంట్లు, మ్యాపులను వీరు పరిశీలించకుండానే గుడ్డిగా సంతకాలు చేశారని పేర్కొన్నది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజినీరింగ్ అధికారులపై క్రిమినల్ విచారణ జరపాలని ఆదేశించింది. 33 మంది ఇంజినీర్లపై జరిమానా విధించాలని కూడా సూచించింది. పదవీ విరమణ చేసిన అధికారులపై కూడా ఇదే విధమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖకు స్పష్టం చేసింది. ఇందులో సంబంధం ఉన్న ఇద్దరు ఆర్థిక అధికారులపై జరిమానా విధించడంతో పాటు క్రిమినల్ విచారణ చేపట్టాలని కమిషన్ సిఫారసు చేసింది. పోలీసు దర్యాప్తు, క్రిమినల్ కేసులతో పాటు ఏకకాలంలో క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడానికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని కమిషన్ తన నివేదికలో నీటి పారుదల శాఖకు గుర్తు చేసింది కూడా.

నీటిపారుదల శాఖ మంత్రి కాలయాపన

ఈ సిఫారసులను నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యయనం చేశారు. ముఖ్య కార్యదర్శితో కలిసి సమీక్షించారు. కానీ.. ఇంత వరకూ ఎలాంటి చర్యలూ లేవు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై మాజీ ఈఎన్సీ భూక్యా హరిరామ్, సీహెచ్ మురళీధర్, ఈఈ నూనె శ్రీధర్ నివాసాల్లో గతేడాది డిసెంబర్ నెలలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. వీరి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.400 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.

విజిలెన్స్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కించిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక అందిన తరువాతే చర్యలు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జూలై చివరలో ఘోష్ తన నివేదికను నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందచేశారు. ఆగస్టు నెలలో సమావేశమైన మంత్రి మండలి ఘోష్ కమిషన్ నివేదికను ఆమోదించింది. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని, కమిషన్ సూచనను ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ తరువాత సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీబీఐకి అప్పగిస్తూ తీర్మానం చేసింది. 9 నెలలు గడుస్తున్నా ఉలుకు పలుకు లేకపోవడంతో సీబీఐ విచారణపై మరోసారి కేంద్రానికి సీఎం రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు.

ఈ వరుస పరిణామాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, బాధ్యులైన ఇంజినీర్లకు కలిసి వచ్చాయంటున్నారు. బారాజ్ కుంగిన ఘటనలో గతేడాది విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా 38 మంది ఇంజినీర్లకు నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంది. విజిలెన్స్ కమిషన్ నివేదిక, పీసీ ఘోష్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఏ ఒక్క అధికారిపై చర్యలు తీసుకునే సాహసాన్ని మంత్రి ఉత్తమ్ చేయలేదంటున్నారు.

చర్యలు తీసుకుంటే ఇంజినీర్లు పనులు చేయరంట!

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడిన ఇంజినీర్లపై చర్యలు తీసుకునే విషయమై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లు సచివాలయంలో ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ విజలెన్స్ కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ నివేదికల ప్రకారం బాధ్యులైన ఇంజినీరింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నట్లయితే శాఖలో పనిచేస్తున్న ఇంజినీర్లు ఒకింత వెనకడుగు వేస్తారని ఉత్తమ్‌ చెప్పారని తెలుస్తున్నది. ‘గత ప్రభుత్వ అధినేత కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్ రావు ఆదేశాల మేరకు పనిచేశాం. ఇప్పుడు మీరు చెప్పిన విధంగా పనిచేస్తున్నాం’ అని ఇంజినీర్లు తనతో చెబుతున్నారని సీఎం దృష్టికి ఉత్తమ్‌ తీసుకువెళ్లినట్టు సమాచారం. ఏ ప్రభుత్వం అయినా చెప్పినట్లుగా పని చేయాల్సిన బాధ్యత తమపై ఉందని, చర్యలు తీసుకుంటే మున్ముందు పనులు చేయలేమని అంటున్నారని మంత్రి వివరించారని తెలుస్తోంది. చర్యలకు ఉపక్రమిస్తే ఇంజినీర్ల నుంచి సహాయ నిరాకరణ వస్తుందని, పనులు సాఫీగా సాగవని ఉత్తమ్ వివరించారని సమాచారం. మొత్తానికి తర్జనభర్జన అనంతరం విజిలెన్స్ కమిషన్, వీసీ ఘోష్ కమిషన్ సిఫారసులు అటకెక్కాయి.

ఇంజినీర్లపై చర్యలు తీసుకునేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వరీస్‌కు సిఫారసు చేయాలని కొద్ది రోజులు కాలయాపన చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కమిషనర్ ఆఫ్ ఎంక్వరీస్‌ను నియమించలేదు. ఆ తరువాత పీసీ ఘోష్ కమిషన్ అంటూ మరికొన్ని నెలలు కాలయాపన చేశారు. చివరకు తేల్చింది ఏమంటే కాళేశ్వరం నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం ఉన్నందున, సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలకు పాల్పడిన ఇంజినీర్లు కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి మూలంగానే ఏ రకమైన చర్యలు లేకుండానే సురక్షితంగా తప్పించుకున్నారని కొందరు అంటుంటే.. ఉద్దేశపూర్వకంగానే వారిని తప్పించారని మరికొందరు సచివాలయంలో చర్చించుకుంటున్నారు. వెరసి.. ప్రజాధనం వృథాలో భాగస్వాములైన ఇంజినీర్లు.. ప్రభుత్వ కాలయాపన పుణ్యాన ఎప్పటిలానే దర్జాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని అంటున్నారు.