‘అంగన్వాడీ’ సెల్‌ఫోన్‌లకు అవినీతి మరక!?

అంగన్‌వాడీల కోసం కొనుగోలు చేసిన మొబైల్‌ ఫోన్లలో అవినీతి రింగ్‌టోన్‌లు వినిపిస్తున్నాయి. ఈ కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందని బీఆరెస్‌ నేతలు ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.

‘అంగన్వాడీ’ సెల్‌ఫోన్‌లకు అవినీతి మరక!?
  • ముదిరిన సెల్‌ఫోన్‌ ‘కొనుగోళ్ళ’ వ్యవహారం
  • అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్
  • దుష్ప్రచారం చేస్తే చెప్పు తెగుతుందన్న మంత్రి సీతక్క
  • బీఆర్ఎస్ నేత కేసీఆర్‌లకు సీతక్క లీగల్ నోటీసులు
  • సీబీఐ విచారణకు బీఆర్ఎస్ నేతల డిమాండ్
  • పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాజకీయ వేడి

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్ల కోసం చేపట్టిన సెల్‌ఫోన్‌ల కొనుగోలుకు అంటుకున్న అవినీతి మరకలు రాజకీయ మంటలను రగిలిస్తున్నాయి. చినికి చినికి గాలివానలా మారినట్లు ఈ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేకిస్తున్నది. రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరి పరస్పరం తీవ్ర విమర్శలు, సవాళ్ళు విసురుకునే స్థాయికి చేరింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుందంటూ మంత్రి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు జారీ చేశారు. 48 గంటల్లో బీఆర్ఎస్ హ్యాండిల్‌పై పెట్టిన తప్పుడు ఆరోపణలు తొలగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు చేపడుతామంటూ అల్టిమేటమ్ జారీ చేయడంతో రాజకీయ రచ్చ పతాక స్థాయికి చేరింది. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్, సతీశ్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ లీగల్ నోటీసులు, చెప్పుతో కొట్టడం కాకుండా అవినీతి ఆరోపణలపై సీబీఐకి ఉత్తరం రాస్తే విచారణ ద్వారా నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందన్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతానికి రాజకీయ అంగడి సరుకుగా మారి, ఇప్పుడిప్పుడే సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ సెల్‌ఫోన్‌ కొనుగోళ్ళ వ్యవహారంలో మంత్రి సీతక్క కాకుండా మూడవ వ్యక్తి, అది కూడా సీఎంకు దగ్గరి వ్యక్తి ప్రమేయం ఉందంటూ తనకు సమాచారం ఉందని, ఆ పేరు మంత్రి బయటపెడితే సమస్య తేలిపోతదంటూ బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించడం కొసమెరుపు.

సెల్‌ఫోన్‌ల కొనుగోలుపై నెల నుంచి ఆరోపణలు

రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్‌ల కొనుగోలు వ్యవహారంలో మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌ క్రిషాంక్ మార్చి 17వ తేదీ నుంచి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండిస్తూ, వివరాలను ప్రకటించారు. అయినప్పటికీ క్రిషాంక్ ఆరోపణలు నిలిపివేయకుండా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీనిపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

స్థూలంగా ఈ సెల్‌ఫోన్‌ల కొనుగోలు వ్యవహారం ఇదీ..

  • అంగన్‌వాడీ కేంద్రాలకు మొబైల్ ఫోన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో టెండర్లు పిలిచింది.
    నవంబర్ 2025న రాష్ట్రానికి అవసరమైన 38,130 మొబైల్ ఫోన్లకు రూ.44 కోట్లతో టెండర్ వేశారు.
  • కేంద్ర ప్రభుత్వానికి చెందిన జెమ్ పోర్టల్ ద్వారా ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ ఆధ్వర్యంలో గ్లోబల్ టెండర్ కోరారు.
  • వారి నిర్ణయం మేరకే ఈ టెండర్ TSTGTS ఆధ్వర్యంలో టెండర్ దక్కించుకున్నారు.
  • ఈ టెండర్ 44 కోట్లతో ప్రతి మొబైల్ ఫోన్ కోసం 11,650/- రూపాయలను వెచ్చించి ఫోన్లను కొనుగోలు చేసినట్లు మంత్రి ప్రకటించారు.
  • రూ. 54 కోట్లకు టెండర్ వేశారంటూ బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌

రూ. 8 కోట్లు సీతక్క జేబులో వేసుకున్నారని మొదట్లో ఆరోపించగా, ఇప్పుడు రూ. 30 కోట్ల అవినీతి జరిగిందంటూ విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు కౌంటర్‌ ఇస్తున్నాయి. పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిజాయితీగా టెండర్ పూర్తి అయిందని చెబుతున్నాయి. రూ. 44 కోట్ల టెండరును రూ. 54 కోట్లు అంటూ ఆరోపణలు చేస్తున్నారని, అప్పుడు మొబైల్ ఫోన్ ధర రూ. 11,999 అని ఇప్పుడేమో రూ. 8,249 అంటూ మాట మారుస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు.

కేంద్రం రాజస్థాన్, ఝార్ఖండ్, నాగాలాండ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక మొబైల్ ఫోన్ ధర రూ.11,800లకు కేంద్రం ఇచ్చిందని గుర్తుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ.11,200లకు కొనుగోలు చేస్తే, మన తెలంగాణ రాష్ట్రం రూ.11,650లకు కొనుగోలు చేయగా, మిగిలిన రాష్ట్రాలు రూ. 11,700లతో కొనుగోలు చేశారనేది మంత్రి, కాంగ్రెస్ వర్గాల వాదన.

సెల్‌ఫోన్‌ కొనుగోళ్ళ పై విచారణ జరిపించాలి: క్రిశాంక్

సెల్‌ఫోన్‌ల కోనుగోలులో అక్రమాలు జరిగాయని పబ్లిక్ డోమైన్ లో రూ. 54 కోట్ల టెండర్ అని ఉందని, మంత్రి సీతక్క రూ.44 కోట్లు అంటుందని క్రిశాంక్‌ విమర్శించారు. రూ.54 కోట్లను 38310తో విభజిస్తే ఫోన్ ధర రూ.14వేలు వస్తోందని, కానీ, సీతక్క రూ. 11, 650 కొనుగోలు చేశామని అంటున్నారంటూ అనుమానాలు లేవనెత్తారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిదంటూ సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెల్లించిన ధరకు 5 జీ ఫోన్లు వస్తుండగా అంగన్వాడీలకు 4 జీ ఫోన్ లు ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. తాము మొబైల్ ఫోన్ల స్కాం గురించి మాట్లాడుతుంటే, సీతక్క చెప్పుతో కొడతానని అంటున్నారని, ఫార్ములా ఈ రేసు ఎన్ని సార్లు ఏసీబీ దర్యాప్తులు చేయించి, గవర్నర్ వద్దకు వెళ్ళినా ఏరోజు కేటీఆర్ చెప్పుతో కొడతానని అనలేదు కదా! అంటూ విమర్శించారు.
ఇదిలా ఉండగా ఈ టెండర్ ఖరారులో మూడవ వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు తనకు సమాచారం ఉందని, సీఎంకు దగ్గరగా ఉండే ఆ వ్యక్తి పేరును మంత్రి బయటపెట్టాలంటూ క్రిషాంక్ డిమాండ్ చేయడం కొసమెరుపు.