Pending Bills | ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాట తప్పిన డిప్యూటీ సీఎం భట్టి!

పెండింగ్‌ బిల్లులను దశలవారీగా క్లియర్‌ చేస్తామని, అందుకోసం నెలకు 700 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట తప్పారా?

Pending Bills | ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాట తప్పిన డిప్యూటీ సీఎం భట్టి!

హైదరాబాద్, సెప్టెంబర్‌ 30 (విధాత ప్రతినిధి) :

Pending Bills | ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ అనేక బిల్లులను చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిపోయింది. ఆ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్నటి వరకు చెల్లించకుండా సతాయించిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో చర్చలకు పిలిచి, ప్రతి నెలా రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులుకు చెల్లించి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

బతుకమ్మ పండుగతో పాటు దసరా పండుగను తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు. పండుగ వేళ పెండింగ్ బిల్లులు విడుదల అవుతాయని ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూశారు. కాని ఈ నెలలో విడుదల చేయాల్సిన రూ.700 కోట్లు ఇప్పటి వరకు విడుదల చేయకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. మల్లు భట్టి విక్రమార్క మాట తప్పడం ఇది రెండోసారి అని, ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పి నిధులు విడుదల చేయలేని అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.10వేల కోట్లకు పైగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అందులో జీపీఎఫ్, సరెండ్ లీవ్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, మెడికల్ రీయింబర్స్ మెంట్, టీజీఎల్, గ్రూపు ఇన్సూరెన్స్ కింద రూ.8వేల కోట్లు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ సర్వీసు (సీపీఎస్) ఉద్యోగులకు సంబంధించి మరో రూ.2వేల కోట్లు బిల్లులు బాకాయి పడింది. రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులు 3.6 లక్షల మంది వరకు ఉండగా, వీరికి వాటాను చెల్లించక పోగా ఏదో ఒక బిల్లును పెండింగ్ లో పెడుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల కోసం ట్రెజరీ లో దరఖాస్తు అందచేస్తే, 24 గంటల వ్యవధిలో డబ్బులు సదరు ఉద్యోగి ఖాతాలో వేసేవారని గుర్తు చేసుకుంటున్నారు.