Phone Tapping Case | హీరోయిన్లకు నోటీసులిస్తారా..? సిట్ భావి చర్యలపై ఆసక్తికర చర్చ

Phone Tapping Case | హీరోయిన్లకు నోటీసులిస్తారా..? సిట్ భావి చర్యలపై ఆసక్తికర చర్చ

Phone Tapping Case | తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముందుకెళుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ చీఫ్‌గా పనిచేసిన టీ ప్రభాకర్ రావు బృందం తమ రాజకీయ బాసుల కోసం నిర్వహించారని ఆరోపణలు వస్తున్న ఫోన్ ట్యాపింగ్ బాధితుల సంఖ్య వేలల్లో ఉంది. ప్రతిపక్ష, స్వపక్ష రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, రియల్, జ్యువెలరీ వ్యాపారులు, ఫార్మా ఇండస్ట్రీ, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు, సినీ సెలబ్రిటీలు, జడ్జీల ఫోన్లను వదలకుండా దాదాపు 4,200మంది ఫోన్లను ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు, ప్రణిత్ రావు టీమ్ అరాచకాలు అన్ని ఇన్ని కావు. బీఆర్ఎస్ పెద్దల రాజకీయ అవసరాల కోసం మొదలైనట్టు చెబుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ చివరకు అడ్డదారులు తొక్కి, భార్యభర్తల, సినిమా హీరోయిన్ల ఫోన్ల ట్యాపింగ్ వరకు వెళ్లింది. అయితే ప్రస్తుతం సిట్ వద్ద ఉన్న 2023 నవంబర్ నుంచి జరిగిన 615 ఫోన్ ట్యాపింగ్ నంబర్లలో హీరోయిన్లు ఎవరెవరు ఉన్నారు? వారిని సిట్ విచారణకు పిలుస్తుందా? అన్నది తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా మారింది.

ట్యాపింగ్ బాధితుల్లో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు

2018నుంచి సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రముఖ నటి సమంత తన భర్త నాగచైతన్యతో విడిపోవడానికి ఓ కారణమని ఊహాగానాలు చెలరేగాయి. మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సైతం బాహాటంగానే తీవ్ర ఆరోపణలు చేశారు. పలుమార్లు రకుల్ రావు అంటూ కేటీఆర్‌పై విమర్శలు కూడా చేశారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ జాబితాలో మరో హీరోయిన్ హెబ్బా పటేల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఓ టీవి చానల్ ఇంటర్వ్యూలో హెబ్బా పటేల్ ఫోన్ ట్యాప్ చేసినట్లు తనకు సమాచారం వచ్చిందని, అయితే అది నిజమో కాదో తెలియదన్నారు.

హీరోయిన్లను సిట్ పిలుస్తుందా..?

ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులకు నోటీసులు, సమాచారం ఇచ్చి సాక్షులుగా పిలుస్తు వాంగ్మూలం (స్టేట్‌మెంట్‌) సేకరిస్తున్న సిట్ అధికారులు సినీ హీరోయిన్లను కూడా విచారణకు పిలుస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ డేటాలో 90శాతం వరకూ ధ్వంసం చేసినట్లుగా సిట్‌ గుర్తించింది. ప్రస్తుతం సిట్‌ వద్ద 2023 నవంబర్‌కు సంబంధించి 618 ఫోన్ల డేటా మాత్రమే ఉంది. ఈ ఫోన్‌ నంబర్లకు చెందిన బాధితుల నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుంటామని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 267 మంది నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. సాక్షులుగా మరికొంత మందిని పిలిచే అవకాశాలు లేకపోలేదన్న చర్చ నడుస్తున్నది. వీరిలో సినీ హీరోయిన్లు కూడా ఉంటారా? లేక వారి ఆంతరంగిక గోప్యతకు భంగం కలుగనీయకుండా వేరే ఇతర మార్గాల్లో ప్రయత్నిస్తారా? అనేది చూడాల్సి ఉంది.