Rahul Gandhi | రాహుల్ చుట్టూ ‘కోట’రీ గోడ!.. ఆయన బయటకు రారు.. కోటరీ లోనికి పోనీయదు
పార్టీ ముఖ్యులు ఎవరైనా రాహుల్ గాంధీని కలిసేందుకు, ఆయన అపాయింట్‌మెంట్ పొందేందుకు ఆయన చుట్టూ ఉన్న కోటరీ కీలకంగా వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలతో సంబంధాల్లో లేని ఈ కోటరీ కారణంగా ముఖ్యమంత్రి స్థాయి నేతలకు సైతం రాహుల్‌ను కలుసుకొనే అవకాశం లభించడం లేదని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు.

- రాహుల్ గాంధీ దర్శనం కావాలంటే కోటరీ అనుమతి ఉండాల్సిందే!
- రాష్ట్రాల్లోని ముఖ్య నేతలకు దొరకని అపాయింట్‌మెంట్
- నాడు జనంలోనే నెహ్రూ, ఇందిర.. అందుకే ప్రజల్లో ఇప్పటికీ అభిమానం
- ఒకవైపు నిత్యం జనంలో మోదీ, షా
- వచ్చే ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌కు కీలకం
- కానీ.. లక్ష్యాలకు అనుగుణంగా పని ఏది?
Rahul Gandhi | రాహుల్ గాంధీ! జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు అనధికారిక అధ్యక్షుడు! దళితుడి చేతికి పార్టీ పగ్గాలు ఇచ్చామని చెప్పుకొంటున్నా.. అన్నీ తానై వ్యవహారాలు చూసుకునే నేత. ఇప్పటికే రాహుల్ వ్యవహార శైలిపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన విమర్శలే ఉన్నాయి. పదేళ్లుగా పాతుకుపోయిన బీజేపీని కేంద్రంలో అధికారం నుంచి తప్పించే క్రమంలో వ్యవహరించే తీరులో, అనుసరించే ఎత్తుగడల్లో అనేక తీవ్ర తప్పిదాలు ఉంటున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాటి వల్లే గత ఎన్నికల్లో బీజేపీ బొటాబొటీగా అయినా విజయం సాధించగలిగిందని చర్చలు జరిగాయి. ఇదే సమయంలో ఆయన చుట్టూ ఉన్న కోటరీ కూడా రాహుల్‌ను బందీ చేశారా? అన్న అనుమానాలను పలువురు రాజకీయ పరిశీలకులు, సీనియర్ జర్నలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.
కోటరీ వల్లే దర్శనాలు దుర్లభం!
ప్రజల సంగతి పక్కనపెడితే.. ఇతర రాష్ట్రాల పార్టీ నేతలకు, ఆఖరుకు ఉన్న ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులకు సైతం రాహుల్ దర్శనం దుర్లభంగా మారిందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన చుట్టూ ఉన్న కోటరీయేనని చర్చించుకుంటున్నారు. మల్లికార్జున ఖర్గే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ.. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలను పార్టీ అగ్రనాయకత్వంగా భావిస్తుంటారు. వారి చుట్టూ ఒక కోటరీ ఉంటుందని, ఆ కోటరీ వారిని బయటకు రానీయదని, పార్టీ అగ్రనేతలు కలిసేందుకు వస్తే లోనికి అనుమతించదని ఢిల్లీలో కాంగ్రెస్ వ్యవహారాలను దగ్గర నుంచి గమనించే ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజా బలం ఉన్న నేతలు అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు వచ్చినా.. వీరి అనుమతి వచ్చే వరకూ పడిగాపులు పడాల్సిందేనని తెలిపారు. కాంగ్రెస్‌కు రెండు పెద్ద రాష్ట్రాల్లోనే అధికారం ఉన్నది. అందులో ఒకటి కర్ణాటక అయితే.. మరోటి తెలంగాణ. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సైతం కోటరీ అనుమతితోనే పార్టీ అగ్రనాయకత్వం అపాయింట్‌మెంట్ లభించే పరిస్థితి ఉన్నదని చెప్పారు. పార్టీకి కీలకమైన ముఖ్యమంత్రులు వారి పార్టీలో నాయకులే అయినప్పటికీ.. వారు ఆయా రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న సంగతిని మర్చిపోతే ఎలాగని అయన విశ్లేషించారు. వారికి అపాయింట్‌మెంట్ నిరాకరించడం ఆయా రాష్ట్రాల ప్రజలను అవమానించడం కిందికే వస్తుందని చెప్పారు. ఈ కోటరీ కూడా ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు కాదని, మాజీ అధికారులు, కమ్యూనిటీ సంఘాల నాయకులు, మాజీ జర్నలిస్టులు అందులో ఉన్నారని అంటున్నారు. బీహార్ కు చెందిన మాజీ ఐసీఐసీఐ ఉద్యోగి అయిన అలంకార్ సవాయి రాహుల్ గాంధీ కి చెవులు, కళ్లు లాంటి వారని పార్టీ వర్గాలు అంటుంటాయి. అంబేద్కర్ భావజాలం, బుద్ధిజంపై బలమైన నమ్మకం ఉన్న ఈయన రాహుల్ కు దగ్గరగా ఉంటారు. రోజువారీ అప్పాయింట్ మెంట్లను, రాజకీయ పర్యటనలను చూస్తారని సమాచారం. బీహార్ కు చెందిన ఆక్స్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ కౌశల్ విద్యార్థి 2019 నుంచి రాహుల్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాహుల్‌కు, ముఖ్య నాయకులకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారని చెబుతారు. అందరి మాటలు విని, వాటిని రాహుల్‌కు చేరవేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక కర్ణాటకకు చెందిన బీ శ్రీవత్స రాహుల్ టీమ్‌లోకి 2021లో వచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తన మకాంను ఢిల్లీకి మార్చారు. వీరుకాకుండా.. జైరాం రమేశ్, కొప్పుల రాజు, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్ వంటి నేతల పేర్లను కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు. ఎప్పుడూ ప్రజలతో మేమేకం కాని ఈ కోటరీ.. ఇక్కడ కూడా అధికారుల్లానే వ్యవహరిస్తుంటారని ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పారు. ముఖ్యమైన నేతలను కలవనీయకుండా చేసి.. వారి కింది నాయకులతో తమ పనులు చేయించుకుంటారని అంటున్నారు. ఎలాంటి రాజకీయ అవగాహన, అనుభవం లేని ఒకరికి కోటరీ ఒత్తిడి కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారని, కానీ.. ఆ స్థానంలో కాంగ్రెస్ ఓడిపోయిందని గాంధీ భవన్ వర్గాలు సైతం గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రాల్లోని పార్టీ నాయకత్వంపై, రాష్ట్ర స్థాయి అగ్రనాయకులపై కోటరీ కర్రపెత్తనం చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్ర కార్యాలయానికి రాహుల్ రారా?
రాహుల్ గాంధీ.. ఏఐసీసీ కార్యాలయానికి రెగ్యులర్‌గా రారన్న విమర్శ ఉంది. ఢిల్లీలోనే ఉండే రాహుల్.. క్రమం తప్పకుండా ఏఐసీసీ కార్యాలయనికి వచ్చి, తన కోసం వచ్చే నాయకులు, కార్యకర్తలను కలిస్తే.. పార్టీలో జోష్ వస్తుందని రాజకీయ విశ్లేషకుడొకరు వ్యాఖ్యానించారు. వివిధ సమస్యలపై వచ్చే ప్రజలను కూడా కలువడంతో రాహుల్ గాంధీ వారికి మరింత చేరువ అవుతారని అంటున్నారు. పార్టీ కార్యాయానికి రాకపోవడం, ఇంటి వద్దకు వచ్చిన వారిని కలిసే అలవాటు లేక పోవడంతో అనేక మందికి ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదని చెబుతున్నారు. పైగా ప్రజాక్షేత్రంలో బలం ఉన్న నాయకులపై ఈ కోటరీ పకడ్బందీగా నెగెటివ్ ప్రచారం చేసి, అగ్రనేత వద్ద వ్యతిరేక ముద్ర పడేలా చేస్తున్నదనే చర్చ కూడా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. సందులో సడేమియా అన్నట్టు.. రాహుల్ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామనే పేరిట వసూళ్లకు కూడా పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ చేసిందీ ఇదే!
బీఆరెస్ అధినేత కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా కలువలేదన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. తమ ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడాన్ని తమను అవమానించినట్టుగానే ప్రజలు భావించారని, అదే గత ఎన్నికల్లో బీఆరెస్ కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకుడొకరు వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇదే దారిలో రాహుల్ నడుస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ పని మీద గతంలో అనేక మార్లు ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డికి రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం తమను అవమానించినట్టుగానే రాష్ట్ర ప్రజలు భావిస్తారని ఆయన చెప్పారు. రేవంత్‌రెడ్డి విషయంలో ఎలాంటి అభిప్రాయాలు అగ్రనాయకత్వానికి ఉన్నా.. తెలంగాణ ప్రజల ప్రతినిధిగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రధానిగా పనిచేసిన తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు చనిపోతే ఆయన పార్థివ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి కూడా రానివ్వని విషయం, ఆయన అంత్యక్రియలు అందరు మాజీ ప్రధానుల తరహాలో ఢిల్లీలో నిర్వహించకపోవడం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని ఆయన అన్నారు.
నాటి తిరుగుబాటు అందుకే!
కాంగ్రెస్ పార్టీ కొందరు వ్యక్తుల నియంత్రణలోకి వెళ్లిపోయిందనే గతంలో కీలక నేతలుగా ఉన్న శరద్‌పవార్, మమతా బెనర్జీ, తర్వాతి కాలంలో గులాం నబీ ఆజాద్ వంటి హేమాహేమీలు పార్టీని వీడిపోయిన విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించి, కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ ఉన్న కూటమి మళ్లీ అధికారంలోకి రావాలంటే.. పార్టీ అగ్రనాయకత్వం ఆలోచన ధోరణి సమూలంగా మారాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతున్నది. రాహుల్ గాంధీ జనంలోకి వచ్చి, కార్యకర్తలు, నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగిస్తేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. గతంలో రాహుల్ గాంధీ ముత్తాత నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, ఆఖరుకు రాహుల్ తండ్రి రాజీవ్‌గాంధీ నిత్యం ప్రజల్లోనే ఉండేవారని గుర్తు చేస్తున్నారు. రాహుల్ సైతం ఆ దిశగా జనంలోకి రావాలంటే.. కోటరీ గోడలు బద్దలు కావాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ కు సమస్య అధి నేత రాహులే..కాలం మారినా మారని కాంగ్రెస్ పెద్దలు
CM Revanth Reddy | విఫల ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిపై ముద్ర వేసేందుకు ప్రయత్నాలు?
Revanth Reddy Facing Trouble | రేవంత్ సర్కార్‌ను చుట్టుముడుతున్న సమస్యలు