కాంగ్రెస్ కు సమస్య అధి నేత రాహులే..కాలం మారినా మారని కాంగ్రెస్ పెద్దలు
కాంగ్రెస్ కు సమస్య అధి నేత రాహులే ? మూడు రాష్ట్రాలను కాపాడుకోలేని దైన్యం నేతలను సమన్వయం చేయలేని దుస్థితి, ఏఐసీసీ కి వెళ్లరు... ఇంటి నుంచే ఆదేశాలు, తెలంగాణలో గ్రూపు తగాదాలకు ఆజ్యం, కాలం మారినా మారని కాంగ్రెస్ పెద్దలు, సంస్థాగత నిర్మాణం గాలికి.. సైద్ధాంతిక శూన్యత

-
- కాంగ్రెస్ కు సమస్య అధి నేత రాహులే ?
- మూడు రాష్ట్రాలను కాపాడుకోలేని దైన్యం
- నేతలను సమన్వయం చేయలేని దుస్థితి
- ఏఐసీసీ కి వెళ్లరు… ఇంటి నుంచే ఆదేశాలు
- తెలంగాణలో గ్రూపు తగాదాలకు ఆజ్యం
- కాలం మారినా మారని కాంగ్రెస్ పెద్దలు
- సంస్థాగత నిర్మాణం గాలికి.. సైద్ధాంతిక శూన్యత
హైదరాబాద్, మే 31(విధాత): పదేండ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో ఉద్యమించలేకపోతున్నది. వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు నిత్యం ప్రజా సమస్యలపైనే పాలకులను నిలదీస్తాయి. ప్రజల మనసులను గెలుచుకుంటేనే తిరిగి అధికారంలోకి వస్తాయి. కానీ కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకదాని తరువాత ఒకటి ప్రధాన ప్రతిపక్షానికి అప్పగించింది. రాను రాను కేవలం మూడు రాష్ట్రాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితం కాక తప్పడం లేదు. . అయితే ఈ మూడు రాష్ట్రాల్లో గెలిచిన ఏడాది వ్యవధిలోనే ప్రజల నుంచి కావాల్సినంత వ్యతిరేకతను మూట కట్టుకున్నట్లు అర్థమవుతున్నది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలకు ప్రకటించిన సంక్షేమ పథకాలను సంపూర్ణంగా అమలు చేయకపోవడం వల్లనే వ్యతిరేకత వచ్చిందన్న చర్చ జరుగుతున్నది.. కానీ పార్టీ నిర్ణయాల అమలు, సమన్వయం సరిగ్గా లేని కారణంగానే ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుందన్న దిశగా పార్టీ అధినాయకత్వం ఆలోచన చేయడం లేదన్నచర్చ జరుగుతున్నది.
ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రత్మకమైన బీసీ బిల్లును ఆమోదించడమే కాకుండా నాలుగు దశాబ్దాలుగా నలుగుతున్న ఎస్సీ కులాల వర్గీకరణ చిక్కు ముడులు తొలగించి పక్కాగా ఉప వర్గీకరణ అమలుచేస్తున్నది. రైతులకు ఒకే విడతలో రుణమాఫీతో పాటు, ఆర్థిక సాయం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇలా వివిధ రకాల స్కీమ్‌లను అమలు చేస్తున్నది. దొరల గడిగా ముద్ర పడిన ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మార్చి, ఇనుప కంచెలను బద్దలు కొట్టి తమది ప్రజాస్వామ్య పాలన అని నిరూపించారు. ఈ ప్రజా భవన్‌లో ఒక దళిత, గిరిజన మంత్రులు నివసించే విధంగా చేసి, మిగతా ప్రాంగణమంతా
ప్రజాసమస్యల పరిష్కారం కోసం వేదికగా మార్చారు.
ఎవరికి వారే యమునా తీరే ..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేతలు గ్రూపులుగా విడిపోయారు. నేతలు ఒకరిపై మరొకరు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి, అధినేత్రి సోనియా గాంధీకి వరుసబెట్టి ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఫ్యాక్స్ మిషన్లు 24గంటలు పనిచేసేలా, ఈ మెయిల్ బాక్స్ లు నిండిపోయేలా కట్టలకొద్దీ ఫిర్యాదులు పంపిస్తున్నారు. ఇది పార్టీకే, ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమంత్రికి మరింత నష్టం చేకూరుస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంతటితో ఆగని ఒకరిద్దరు మంత్రులు అసెంబ్లీలో ప్రతిపక్షఎమ్మెల్యేలు సీఎంను విమర్శిస్తే లోలోపల చంకలు గుద్దుకున్నారని టాక్. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు గ్రూపు రాజకీయాలు చేస్తుంటే వారించాల్సిన అధిష్ఠానం ఎవరో ఒక ఇంచార్జీని పంపించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అన్న విమర్శలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నవారి నుంచే వ్యక్తం అవుతున్నాయి.
రేవంత్ అంటే అంత చులకనా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ దొరకకుండా చేశామని కొంతమంది నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని సమాచారం. ఇదేదో తమ ఘనత అని చెప్పుకుంటున్నారట. రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ దొరకకుండా చేశాను కాబట్టి రాహుల్ గాంధీ వద్ద తనమాటే చెల్లుతుందని తమ అత్యంత సన్నిహితుల వద్ద చెప్పుకునే నేతలు కూడా ఉన్నారని గాంధీ భవన్ వర్గాలలో టాక్. తాజాగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం పై చర్చించేందుకు రేవంత్ రెడ్డి తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ లు ఢిల్లీలో మకాం వేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చించిన తరువాత రాహుల్ తో చర్చించాల్సి ఉండగా ముఖ్యమంత్రికి అప్పాయింట్ మెంట్ లభించలేదు. కాని పీసీసీ అధ్యక్షుడు తన కుటుంబ సభ్యులతో రాహుల్ ను
కలవడం ముఖ్యమంత్రి ని పలుచన చేసినట్లు అయ్యిందని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి 44 సార్లు ఢిల్లీకి వెళ్లినా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం పార్టీ అధినేత రాహుల్ గాంధీ గొప్పతనమా లేక నిర్లక్ష్యమా అన్న చర్చ కూడా రాజకీయ విశ్లేషకుల్లో నడుస్తున్నది.
బీజేపీ ట్రాప్ లో కాంగ్రెస్
కాంగ్రెస్ అధిష్ఠానం బీజేపీ ట్రాప్ లో పడిపోతుంది తప్ప సొంత ఎజెండాతో ముందుకు వెళ్లడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకున పెట్టాల్సిన కాంగ్రెస్ పార్టీ .. కాషాయపార్టీ వ్యూహంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. బీజేపీ ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక బిక్కుబిక్కు మంటున్నది. పరిస్థితి ఇలాగే ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ పుంజుకోగలదా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు
మంత్రి వర్గవిస్తరణ ఆలస్యమా?
ఇక తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఒక రాష్ట్రంలో ఆరుగురు కొత్త మంత్రులను నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు లెక్కించడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. కులాల సమీకరణాలు, జిల్లాల సర్దుబాటు అన్న సాకులు చెప్పి ఇంకా ఎంతకాలం కాలం గడుపుతారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
సీఎంకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడమా?
నాలుగైదు దశాబ్దాలుగా అమలు చేస్తున్న నచ్చని వారికి నో అప్పాయింట్ మెంట్ విధానాన్నే ఇప్పటికీ పాటించడం ప్రతిపక్ష పార్టీలకు విమర్శనాస్త్రాలుగా మారాయి. సరైన సమయంలో సమస్యలను పరిష్కరించని వారే ఇలా మొఖం చాటేస్తారన్న సామెతను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ చెప్పడు మాటలు విని నేతలపై అభిప్రాయాలు ఏర్పరుచుకుంటారా? అవి నిజమా లేదా అనేది విచారణ చేయకుండా ఒంటెత్తుపోకడలకు పోతున్నారా.. అని కూడా అంటున్నారు.
రాహుల్ ఎందుకిలా..
ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తనకున్న మూడు రాష్ట్రాలలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు… ఈ మూడు రాష్ట్రాలు పాలనను ప్రచారం చేసుకుని దేశ వ్యాప్తంగా ప్రజల తరపున నిలబడాలి.. అందుకు ఈ మూడు రాష్ట్రాలలో ఉన్న పార్టీని ఏకతాటిపై నడపగలగాలి.. కానీ దీనికి విరుద్దంగా రాహుల్ గాంధీ తనకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నది. వాస్తవంగా రాహుల్ కనుసైగ చేస్తే పార్టీలో నొరెత్తే వారుండరని, కానీ నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్లలేకపోతున్నాడన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నది.
ఇప్పటికీ సీల్డ్ కవర్ నియామకాలే
పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు ఇస్తామని వేదికల మీదుగా ప్రకటిస్తారు కాని ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా సీల్డ్ కవర్ నియామకాలు జరుగుతున్నాయి. పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన ఏఐసీసీ అధ్యక్ష పదవికి మల్లిఖార్జున్ ఖర్గే ను తొలిసారి ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రులు మొదలు మిగతా ముఖ్య పదవుల నియామకాలన్నీ ఇంకా సీల్డ్ కవర్ విధానంలో జరుగుతున్నాయి. పార్టీకి విధేయత కనబర్చే వారికి పదవులు ఇవ్వడంలో తప్పు లేదు కాని ప్రజల్లో ఏమాత్రం పలుకుబడి నేతలకు పెద్ద పీట వేయడమే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు మింగుడుపడడం లేదు. పదవుల కోసమే పార్టీలో చేరుతున్నారు తప్పితే, పార్టీ విధానాలను తూచా తప్పకుండా పాటించే నాయకుల కొరత స్పష్టంగా ఉంది.
అప్పాయింట్ మెంట్ ఇవ్వని నేతగా కీర్తి
రాహుల్ గాంధీ అనుచరులకు, మద్దతు దారులకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండడం లేదని ప్రముఖ విద్యావేత్త సందీప్ మనుదానే పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి సంబంధించిన లోపాలపై ఆయన ట్విట్ చేశారు కూడా. పార్టీలో ఇష్టారాజ్యంగా మాట్లాడేవాళ్లను కంట్రోల్ చేయలేకపోవడం.. వారిని హద్దుల్లో పెట్టలేక పోవడం. క్షేత్ర స్థాయిలో పార్టీని నిర్మాణం చేయడంలో విఫలం కావడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు చేరువయ్యేలా పనిచేయడం లేదని.. ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లడం లేదన్న అభిప్రాయాన్ని సందీప్ మనుధానే వ్యక్తం చేశారు. ఒక వ్యూహం లేకుండా, సైద్ధాంతిక బలం లేకుండా, ఒక నినాదం లేకుండా ఏవిధంగా ముందుకు వెళతారని అంటున్నారు. పార్టీని నడిపించే నాయకుడికి వ్యూహాత్మకమైన అంచనాలు కూడా ఉండాలని అంటున్నారు. ఇంతే కాకుంగా పార్టీ నాయకులు కాలానుగుణంగా మారకుండా1990ల నాటి పద్దతులనే పట్టుకు కూర్చుంటే ఎలా అని అడుగుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ అధినేతలు మారాలంటున్నారు.
కాంగ్రెస్ లో సైద్ధాంతిక వైఫల్యం
బీజేపీ హిందుత్వ నినాదంతో ప్రజల్లోకి వెళ్తుండగా, ప్రజాస్వామ్యం తమ సిద్ధాంతం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా శ్రేణులను నడిపించడంలో సఫలం కావడం లేదు. ప్రజాస్వామ్యం కాపాడే పార్టీ తమదేనని చెబుతున్న పెద్దలు, ఆ ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవడం లేదనేదన్న చర్చ జరుగుతోంది. బీజేపీలో ఈ రోజుకు సిద్ధాంత బలం ఉంది కాని కాంగ్రెస్ లో అది కన్పించడం లేదు. ఈ రోజుకు కూడా పార్టీ అధినాయకత్వం సైద్ధాంతిక విధానంపై శ్రేణులను నడిపించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ దిశగా చర్యలు తీసుకోనట్లయితే మరింతగా దిగజారి రాష్ట్రాల చట్ట సభల్లో సింగిల్ డిజిట్ కు పరిమితం అయ్యే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.