ఏడాదిగా దిక్కుమొక్కు లేని 18,500 కోట్ల శ్రీశైలం ఘాట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదన

శ్రీశైలం వెళ్లాలంటే ప్రస్తుతం ఘాట్‌ రోడ్డు ఒకటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. నల్లమల అరణ్యంలో నుంచి వెళుతున్న కారణంగా.. ఆ రోడ్డుపై రాత్రిళ్లు ప్రయాణాలు నిషిద్ధం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణలను కలుపుతూ శ్రీశైలం మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కానీ.. ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి జీవో విడుదల కాకపోవడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే చర్చలు సాగుతున్నది.

srisailam-corridor-delay- ai generated image

విధాత, హైదరాబాద్:

మల్లన్నదర్శనానికి శరవేగంగా వెళ్లే అవకాశం ఇప్పట్లో కలిగేలా లేదు. ఏలిన వారు శ్రీశైలం మ‌ల్ల‌న్న భ‌క్తుల కోసం ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేసి ఏడాది దాటినా క‌నీసం ఉత్త‌ర్వులు కూడా ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. హిందూ ర‌క్ష‌క్షుడిన‌ని చెప్పుకొనే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఆయ‌న నాయ‌క‌త్వం వ‌హిస్తున్న బీజేపీ పార్టీ హిందూ సంప్ర‌దాయంలోని 12 జ్యోతిర్లింగాల‌లో రెండ‌వ‌దిగా ప్ర‌సిద్ధి చెందిన శ్రీశైలం మ‌ల్లికార్జున స్వామి ఆల‌యంలోనే దేశంలోనే 18 శ‌క్తి పీఠాల‌లో ఒక‌టి ఉన్న‌ది. ఇలా దేశంలోనే జ్యోతిర్లింగం, శ‌క్తి పీఠం రెండూ ఒకే చోట కోలువైన చోటు ఒక్క శ్రీశైల‌మే. న‌ల్ల‌మ‌ల్ల అడ‌వుల్లో కొలువైన శ్రీభ్రమ‌రాంబికా మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ఘాట్ రోడ్డు ఒక్క‌టే మార్గం.

దట్టమైన అరణ్యంలో ఘాట్‌ రోడ్‌

ఈ మార్గం అనేక మ‌లుపుల‌తో ఉండటంతోపాటు.. పులులు సంచ‌రించే ద‌ట్ట‌మైన న‌ల్ల‌మ‌ల అభ‌యార‌ణ్యం కూడా ఉంది. అభ‌యార‌ణ్యంలో పులులు, ఇత‌ర అడ‌వి జంతువులు స్వేచ్ఛగా సంచ‌రించ‌డం కోసం రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌రకు అట‌వీ ప్రాంతం గుండా ప్ర‌యాణాలు నిషేధించారు. మ‌రో వైపు అనేక మూల‌మ‌లుపులు ఉన్న‌ఘాట్ రోడ్‌లో ర‌హ‌దారి ప్ర‌మాదాలు జ‌రిగి అనేక మంది తీవ్ర గాయాల పాలు అవుతున్నారు. కొంత మంది దైవ ద‌ర్శ‌నం కోసం వ‌చ్చి ఈ రోడ్డు ప్ర‌మాదాల్లో చ‌నిపోయిన ఘటనలూ ఉన్నాయి.

87 కిలోమీటర్ల మేర ప్రతిపాదిత ఎలివేటెడ్‌ కారిడార్‌

శ్రీశైలం ఘాట్‌లో తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణపల్లి నుంచి ఏపీలోని దోర్నాల వరకు 86.74 కిలోమీటర్ల దూరం రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని 2025 మార్చిలో కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు అనుమ‌తుల కోసం ప్ర‌తిపాద‌న‌లు వెళ్లినట్టు తెలిసింది. అచ్చంపేట ఎమ్మెల్ల్యే చిక్కుడు వంశీకృష్ణ ఎలివేటెడ్ కారిడార్‌ను భూమి నుంచి 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తార‌ని, దీంతో వ‌న్య ప్రాణుల‌కు ఎలాంటి అంత‌రాయం ఉండ‌ద‌ని, వాహ‌నాల రాక‌పోక‌లు సాఫీగా సాగుతాయ‌ని చెప్పడం గమనార్హం. 2025 మార్చిలో సూత్ర ప్రాయంగా అంగీక‌రించిన ఈ ప్రాజెక్ట్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఆమోదం తెలుపుతూ ఎలాంటి జీవోలు ఇవ్వలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా? అన్న సందేహాలు కూడా వెలువ‌డుతున్నాయి.

కారిడార్‌తో మల్లన్న దర్శనం మరింత సులభం

ఈ ప్రాజెక్ట్‌కు అనుమ‌తులు వ‌చ్చి కార్య‌రూపం దాల్చితే హైద‌రాబాద్ నుంచి, అటు ఏపీలోని విజ‌య‌వాడ‌, గుంటూరు, విశాఖ  నుంచి నేరుగా శ్రీశైలం వ‌చ్చి ద‌ర్శ‌నం చేసుకోని తిరిగి వెళ్లే అవ‌కాశం ఏర్ప‌డుతుంది. ఎలివేటెడ్ కారిడార్‌తో ఏపీలోని కొన్ని కీల‌క‌మైన ప్రాంతాల‌కు స‌రుకు ర‌వాణా కూడా సులువు అవుతుంది. అట‌వీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఇత‌ర ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయి. అయితే తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు రేవంత్ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు ఇద్ద‌రు కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలు ఎక్కే అవ‌కాశం ఉంటుంద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వెలువ‌డుతున్న‌ది.

ప్రతిపాదిత శ్రీశైలం ఘాట్ ఎలివేటెడ్ కారిడార్ వెళ్లే ప్రాంతాలు

తెలంగాణ రాష్ట్రంలోని బొమ్మెన ప‌ల్లి నుంచి ఏపీలోని దోర్నాల వ‌ర‌కు 86.74 కిలో మీట‌ర్ల మేర‌కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఈ కారిడార్ తెలంగాణ‌లో 41.39 కిలో మీట‌ర్లు, ఏపీలో 45.35 కిలోమీట‌ర్లు ఉంటుంది. తెలంగాణ‌లో మ‌న్న‌నూర్ చెక్ పోస్ట్ దాటిన త‌రువాత బొమ్మ‌న‌ప‌ల్లిలో ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభ‌మ‌వుతుంది. అక్క‌డి నుంచి దోమ‌ల పెంట‌, కృష్ణాన‌దిలోయ‌, శ్రీశైలం మ‌ల్లిఖార్జున స్వామి దేవ‌స్థానం నుంచి ఏపీలోని పెద్ద దోర్నాల వ‌ర‌కు నిర్మిస్తారు. అయితే డీపీ ఆర్ ఖరారు అయితేనే ఏ గ్రామాల మీదుగా కారిడార్ వెళుతుంది. ఎన్నిఎకరాల భూమి అవసరం అవుతుందనే ఖచ్చితమైన లెక్కలు వస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ దీనిని అమలుకు కార్యాచరణ సిద్ధం చేయలేదని అవగతం అవుతున్నది.

Latest News