Srisailam Temple| శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Srisailam Temple| శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Srisailam Temple Sparsha Darshan:

సుప్రసిద్ద శైవ క్షేత్రం శ్రీశైలం శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనాలు ప్రారంభించడంతో భక్తులు ఆలయానికి బారులు తీరారు. రెండవ రోజు బుధవారం ఉచిత స్పర్శ దర్శనానికి సుమారు 5000 మంది భక్తులు తరలివచ్చారు. అంచనాకు మించి స్పర్శ దర్శనం కోసం భక్తులు రావడంతో అధికారులు, పోలీసులు,వారిని నియంత్రించడంతో ఇబ్బంది పడ్డారు. చివరకు ఆధార్ నమోదు లేకుండా కూపన్లు ఇచ్చి ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం 1.45 నుంచి 3.45 వరకు స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు.

అధికారులు రోజుకు 1000నుంచి 1200మంది వరకు దర్శనం కల్పిస్తామని చెప్పగా..పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులను నిరాశ పరచలేక 2000 మంది భక్తులను ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతి ఇచ్చారు. పోటెత్తిన భక్తులను కంట్రోల్ చేయలేక ఆలయ అధికారులు, పోలీసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పదేపదే మైక్ లలో పోలీసులు భక్తులు ఎక్కువ మంది వచ్చారని..ఈ రోజు అనుమతించాల్సిన కంటే ఎక్కువ మందిని స్పర్శ దర్శనానికి అనుమతించామని..మిగతా వారు రేపు రావాలని కోరారు. దీంతో స్పర్శ దర్శనం దొరకని వారు మరుసటి రోజు కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది సాధారణ దర్శనం చేసుకుని తిరుగు పయనమయ్యారు. శ్రీశైలానికి పెరిగిన రద్ధితో ఆలయానికి రాకపోకలు సాగించే రహదారులు, ఘాట్ రోడ్లు వాహనాల బారులతో కిక్కిరిసి కనిపించాయి.

సుమారుగా ఏడాది తరువాత శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం సేవలు ప్రారంభం కావడం విశేషం. గతంలో మాదిరిగా మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 3:45 గంటల వరకు భక్తులకు అనుమతిస్తున్నట్టు ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.