BJP State Chief | బీసీల చెవిలో ‘కమలం’ పువ్వు?
బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికలో సైతం బీసీలను పక్కనపెట్టి మహేశ్వర్ రెడ్డికి పట్టం కట్టారు. బీసీ రాజాసింగ్‌కు ఇక్కడ కూడా అన్యాయమే జరిగిందంటున్నారు. తొలిసారి గెలిచిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చినట్లే పాయల్ శంకర్ కు అవకాశమివ్వొచ్చుకదా? అంటూ లాజిక్ లేవనెత్తుతున్నారు.

BJP State Chief | విధాత, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో బీసీలను బీజేపీ అధిష్ఠానం ఫక్తు ఓటు బ్యాంకుగా భావిస్తోంది. ఎన్నికలొస్తేనే ఆ పార్టీ నేతలకు బీసీలు గుర్తుకు వస్తారు.. ఏకంగా సీఎం అభ్యర్థిగా మారుతారూ..మిగిలిన సమయంలో వెనుకబడిన వారిని పట్టించుకోవడం లేదు. అందివచ్చిన అవకాశాలను కల్పించకుండా… ప్రధానమైన పదవులను అగ్రకులాలకు అప్పగిస్తున్నారు.. ఇదీ రాష్ట్ర బీజేపీలోని బీసీ నేతల మనోగతం. ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాదిరి అందరూ బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్గతంగా ఆ పార్టీలో ప్రస్తుతం బీసీ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక బీసీ సంఘాలు మాత్రం బీజేపీ తీరుపైన బహిరంగంగా మండిపడుతున్నాయి. బీజేపీని బీసీ వ్యతిరేక పార్టీగా అభివర్ణిస్తున్నాయి. బీసీ సంఘాల విమర్శలను పక్కనపెడితే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు సైతం ఆరోపణలకు ఊతమిస్తున్నాయి. గతంలో ఆ పార్టీ శాసనసభ పక్షనేత ఎంపికతోపాటు తాజాగా రాష్ట్ర బీజేపీ సారథి నియామకంలో కూడా పార్టీ అధిష్ఠానం ఇదే తీరుగా వ్యవహరించింది. నూతన అధ్యక్షుడి బ్రాహ్మణకులానికి చెందిన రామచందర్ రావును ఎంపిక చేసింది. పార్టీ విధేయుడిగా, సీనియర్‌గా రామచందర్ రావును ఎంపిక చేశారని చెబుతున్నారు. పార్టీ పరంగా ఈ ఎంపిక కరెక్టా? కాదా? అనేది చూస్తే.. గత ఆరు నెలలుగా బీసీ నాయకునికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ఆ పార్టీ వర్గాలే పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. తీరా ఎంపిక దగ్గరికి వచ్చే సరికి బీసీలను కాదని, అగ్రకులానికి పెద్దపీట వేశారు. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతోందనే ప్రచారం ఇంటా బయట సాగుతోంది.
గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదం
తెలంగాణలో ఏడాదిన్నర క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపిన విషయం విధితమే. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే రెడ్డి, బీఆర్ఎస్ గెలిస్తే వెలమ సామాజికవర్గం వ్యక్తులు సీఎం అయ్యే అవకాశం ఉందని పసిగట్టి వ్యూహాత్మకంగా బీసీ సీఎం పాచికను బీజేపీ ప్రయోగించింది. తాము అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎంగా చేస్తామంటూ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. మోదీ, అమిత్ షా, నడ్డా తదితరులు ఇదే అంశానికి ప్రాధాన్యత నిచ్చారు. ఎట్లాగూ తాము అధికారంలోకి వచ్చేదిలేదూ… బీసీని ముఖ్యమంత్రిని చేసేది లేదనుకున్నారా? లేక మెజార్టీ స్థానాలు సాధించేందుకు బీసీ ఓటు బ్యాంకు మీద కన్నేశారా? మొత్తానికి బీసీ నినాదాన్ని హోరెత్తించారు. ఈ మేరకు ఓటు బ్యాంకును పెంచుకున్నారు. బీసీ సీఎం నినాదం ముందుకు రాగానే బీజేపీలో ఈటల, లక్ష్మణ్, బండి సంజయ్, అర్వింద్ పేర్లు చర్చకొచ్చాయి. ఈటల పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ క్రమంలో ఈటల తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్ తో పాటు అప్పటి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు స్థానాల్లో ఓటమిపాలయ్యారు.
బీజేపీలో అర్హులైన బీసీ నేతలు లేరా?
బీసీ నేతగా, ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ ను బీజేపీ అధ్యక్షునిగా పోటీచేసేందుకు కనీసం నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని స్వయంగా ఆయనే పార్టీ నాయకత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ నాయకత్వం రాజాసింగ్ వ్యవహరాన్ని సీరియస్ గా తీసుకోకపోయినప్పటికీ నూతన అధ్యక్షుని ఎన్నికవేళ ఈ అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా బీసీలను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలకు బలంచేకూరుతోంది. బీజేపీలో అర్హులైన బీసీ నేతలు లేరా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ అధ్యక్షునిగా ఈటలకు అవకాశాలున్నట్లు భారీ ప్రచారాన్ని సాగించారు. ఇప్పుడు ఆయనను పక్కనపెట్టారు. ఈటల కాకుంటే ఎంపీ ధర్మపురి అర్వింద్, సీనియర్ నేత తల్లోజుల ఆచారి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితర బీసీ నాయకులున్నారు.
బీసీ నేతల చెవిలో పువ్వు
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం స్థానానికి అర్హులైన బీసీ నాయకులు ఇతర పదవులకు అర్హులుగా ఆ పార్టీ అధిష్ఠానానికి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేవలం సీఎం స్థానం మాత్రమే బీసీలకు రిజర్వు చేసిపెట్టారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికలో సైతం బీసీలను పక్కనపెట్టి మహేశ్వర్ రెడ్డికి పట్టం కట్టారు. బీసీ రాజాసింగ్‌కు ఇక్కడ కూడా అన్యాయమే జరిగిందంటున్నారు. తొలిసారి గెలిచిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చినట్లే పాయల్ శంకర్ కు అవకాశమివ్వొచ్చుకదా? అంటూ లాజిక్ లేవనెత్తుతున్నారు. తాజాగా రాష్ట్ర అధ్యక్షుని ఎంపికలో కూడా బీసీలకు ఛాన్స్ ఇవ్వలేదనే చర్చ ఊపందుకున్నది. బీసీ సంఘం నేత ఒకరు మాట్లాడుతూ బీజేపీ అంటే బ్రాహ్మణ బనియా పార్టీ అంటూ విమర్శించారు. ప్రధానిగా బీసీ నేత మోదీకి బీజేపీ మూడు పర్యాయాలు అవకాశం కల్పించిందనీ, పార్టీ కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు పెద్ద పీట వేశారని చెప్పుకునే ఆ పార్టీ అధిష్ఠానం తెలంగాణకొచ్చేసరికి బీసీలకు అన్యాయం చేస్తున్నారనే అపవాదును ఎదుర్కొంటోంది. రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి కంటే ముందు కరీంనగర్ ఎంపీగా గెలిచిన బీసీ నాయకుడు బండి సంజయ్ కు అవకాశం కల్పించారు. ఎన్నికలకు ముందు సంజయ్ ను తప్పించి కేంద్రమంత్రిగా ఉన్నకిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. తాజాగా బీసీకి కాకుండా అగ్రకులానికి చెందిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించడమంటే బీసీల చెవిలో బీజేపీ పువ్వు పెడుతోందంటున్నారు. ఎన్నికలొస్తే ఓట్ల కోసం మాత్రమే బీసీలు కావాలనీ, పదవులకు బీసీలకు అర్హులు కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ పరిణామం బీజేపీపై ప్రభావం కనబరస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.