MLC Elections : రాహుల్ ప్లానింగ్.. రేవంత్ యాక్షన్.. కారు, సీపీఐ ఫాలో..!!

ప్ర‌స్తుతం ఉన్న బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచేందుకు కేంద్ర ప్ర‌భుత్వానికి పంపిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన త‌రువాత స్థానిక సంస్థ‌లు, ప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌న‌లో అమ‌లుప‌ర్చ‌నున్నారు. బీసీ కులాల సంఖ్య తేల‌డంతో ప్ర‌ధాన పార్టీలు బీసీ పాట పాడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌ను కాంగ్రెస్ స‌ర్కార్ క‌ల్పించింది.

MLC Elections : రాహుల్ ప్లానింగ్.. రేవంత్ యాక్షన్.. కారు, సీపీఐ ఫాలో..!!

MLC Elections : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కార్ చేప‌ట్టిన స‌మ‌గ్ర కుల గ‌ణ‌న ప్ర‌భావం మొద‌లైంది. కాంగ్రెస్ పార్టీ బాట‌లో ప‌య‌నించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు క‌ల్పించారు. కుల గ‌ణ‌న పై నిన్న‌టి వ‌ర‌కు కూని రాగాలు తీసిన పార్టీలు సైతం కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ నిర్ణ‌యానికి జై కొడుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఐదు సీట్ల‌కు నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. నామినేష‌న్ దాఖ‌లుకు సోమ‌వారం తుది గ‌డువుగా నిర్ణ‌యించగా, ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాయి. సంఖ్యాబ‌లం ప్ర‌కారం కాంగ్రెస్ ముగ్గురు, సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్క‌క్క‌రు చొప్పున పేర్ల‌ను ప్ర‌క‌టించాయి. కాంగ్రెస్ నుంచి న‌టీమ‌ణి విజ‌య‌శాంతి, అద్దంకి ద‌యాక‌ర్‌, శంక‌ర్ నాయ‌క్ పేర్ల‌ను అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీ అధికారికంగా ప్ర‌క‌టించింది. సీపీఐ నుంచి నెల్లికంటి స‌త్యం యాద‌వ్‌, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ పేర్లు వెల్ల‌డించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేర‌కు ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి స‌మ‌గ్ర కుల గ‌ణ‌న పూర్తి చేసి, లెక్క‌లు తేల్చారు. ఇటీవ‌లి మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఆమోదం తెలిపారు. అయితే కుల గ‌ణ‌న‌లో బీఆర్ఎస్ అధినేత కే చంద్ర‌శేఖ‌ర్ రావు కుటుంబ స‌భ్యులు, ఎంపీ డీకే అరుణ‌ కూడా వివ‌రాల‌ను ఇవ్వ‌లేదు. అయిన‌ప్ప‌టికీ సర్వే పూర్తి చేసి వివ‌రాల‌ను స‌భ్యుల‌ ముందు పెట్టామ‌ని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. స‌మ‌గ్ర స‌ర్వేలో బీసీలు 51 శాతానికి పైగా ఉన్న‌ట్లు తేల్చారు. అయితే కులాల వారీగా వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఉన్న బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచేందుకు కేంద్ర ప్ర‌భుత్వానికి పంపిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన త‌రువాత స్థానిక సంస్థ‌లు, ప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌న‌లో అమ‌లుప‌ర్చ‌నున్నారు. బీసీ కులాల సంఖ్య తేల‌డంతో ప్ర‌ధాన పార్టీలు బీసీ పాట పాడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌ను కాంగ్రెస్ స‌ర్కార్ క‌ల్పించింది.

కాంగ్రెస్‌లో మూడు వ‌ర్గాల‌కు పెద్ద‌పీట‌
న‌టీమ‌ణి, తెలంగాణ త‌ల్లి పార్టీ మాజీ నాయ‌కురాలు విజ‌య‌శాంతిని ఎంపిక చేసి బీసీల‌పై త‌మ‌కున్న చిత్త‌శుద్ధిని నిరూపించుకున్న‌ది. క‌ళావంతుల‌ కులానికి చెందిన విజ‌య‌శాంతి కుటుంబం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఏటూరునాగారం ద‌గ్గ‌ర్లోని రామ‌న్న‌గూడెంలో స్థిర‌ప‌డింది. న‌టి, నిర్మాత విజ‌య‌ల‌లిత ఈమెకు స్వయానా పిన్ని అవుతుంది. బీసీల‌లో అత్యంత వెన‌క‌బ‌డిన కులానికి చెందిన ఆమెను ఎంపిక చేయ‌డం ద్వారా అన్ని వ‌ర్గాల‌కు న్యాయం చేస్తామ‌న్న సంకేతాల‌ను కాంగ్రెస్ పంపించింది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఆమె రాష్ట్రంలో క‌లియ‌తిరిగి కాంగ్రెస్‌కు ఓటు వేయాల‌ని ప్ర‌చారం చేశారు. గ‌త రెండున్న‌ర ద‌శాబ్ధాలుగా ఆమె తెలంగాణ రాష్ట్రం కోసం త‌న గొంతుకను విన్పిస్తున్నారు. టీపీసీసీ నాయ‌క‌త్వంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం విజ‌య‌శాంతిని ఎంపిక చేసి ఝ‌ల‌క్ ఇచ్చింది. ఆమె పేరు ప్ర‌క‌టన‌తో ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఇక అద్దంకి దయాక‌ర్ విష‌యానికి వ‌స్తే 2014 నుంచి ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో అధికార ప్ర‌తినిధిగా త‌న వాద‌న‌ను విన్పిస్తున్నారు. ప్ర‌తిప‌క్ష బీజెపీ, బీఆర్ఎస్ వైఖ‌రిని ప్ర‌శ్నిస్తున్నారు. మాల కులానికి చెందిన ద‌యాక‌ర్ గ‌డిచిన ఎన్నిక‌ల్లో తుంగతుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఆశించ‌గా, గెలుపు అవ‌కాశాలు లేవంటూ రేవంత్ రెడ్డి నిలువ‌రించారు. మాదిగ‌ కులానికి చెందిన మందుల సామేల్‌కు కేటాయించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న నిరాశ చెంద‌కుండా పార్టీని అంటిపెట్టుకుని పనిచేశారు. ఆయ‌న‌కు ఎలాంటి ఆర్థిక బ‌లం లేన‌ప్ప‌టికీ ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. ఇక శంక‌ర్ నాయ‌క్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న‌ నల్ల‌గొండ జిల్లా డీసీసీ అధ్య‌క్షుడిగా ప‌నిచేస్తున్నారు. దామ‌ర‌చ‌ర్ల మండలం కేతావ‌త్ తండాకు చెందిన ఆయ‌న మొద‌టి నుంచి మాజీ మంత్రి కే జానారెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా ముద్ర ఉన్న‌ది. నాగార్జున‌సాగ‌ర్‌, హుజూర్ న‌గ‌ర్‌, మునుగోడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎల‌క్ష‌న్ ఏజెంట్‌గా ప‌నిచేశారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఖ‌రారుకు మూడు రోజుల ముందు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బంజారాహిల్స్‌లోని జానారెడ్డి నివాసానికి వెళ్లారు. చ‌ర్చ‌ల సంద‌ర్భంగా శంక‌ర్ నాయ‌క్‌ను ఎంపిక చేయాల్సిందిగా ముఖ్య‌మంత్రిని కోరిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో బీసీకి బీఆర్ఎస్ జై
బీసీ నినాదం బ‌లంగా న‌డుస్తున్న స‌మ‌యంలో బీఆర్ఎస్ పార్టీ అదే బాట‌లో న‌డ‌వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గెలిచే ఒక్క సీటులో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ స‌త్య‌వ‌తి రాథోడ్‌ను ఎంపిక చేస్తార‌ని అంత‌ర్గ‌తంగా ప్ర‌చారం సాగింది. రెండో సీటుకు మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్‌, దాసోజు శ్ర‌వ‌ణ్ పేర్లు విన్పించాయి. మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్న‌క‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన స‌త్య‌వ‌తి లంబాడా కులం. రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన కే చంద్ర‌శేఖ‌ర్ రావు ఆమెకు గిరిజ‌న సంక్షేమ శాఖ‌ను క‌ట్ట‌బెట్టారు. మ‌ళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కు పాద‌ర‌క్ష‌లు వేయ‌న‌ని శ‌ప‌థం చేసిన‌ప్ప‌టీ మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేసీఆర్ మొండి చేయి ఇచ్చారు. పెద్ద‌ల స‌భ‌లో పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన వాద‌న విన్పించేందుకు మాజీ ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ పేరును తెర‌మీద‌కు తెచ్చారు. వెల‌మ కులానికి చెందిన వినోద్‌కు సీటు ఇచ్చేందుకు అనుభ‌వం అనే ప్ర‌చారం చేశారు. అయితే కుల గ‌ణ‌నను దాట‌వేసి నిర్ణ‌యం తీసుకునే ధైర్యం చేయ‌లేక‌పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఎట్ట‌కేల‌కు ఆదివారం రాత్రి దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ పేరును ప్ర‌క‌టించ‌క త‌ప్ప‌లేదు.

సీపీఐలో ల‌డాయి
సామాజిక న్యాయం, స‌మ‌స‌మాజ స్థాప‌న ప‌దాల‌ను వ‌ల్లెవేసే సీపీఐ పార్టీ స‌మ‌గ్ర‌ కుల గ‌ణ‌న‌కు జై కొట్టాల్సి వ‌చ్చింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వం ఇచ్చిన ఒక సీటు కోసం అభ్య‌ర్థిని ఎంపిక చేసేందుకు ఆదివారం సాయంత్రం తెలంగాణ సీపీఐ కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. ఈ స‌మావేశంలో వాడివేడిగా వాదులాట‌లు జ‌రిగాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే క‌మ్మ కులం నుంచి కూన‌మ‌నేని సాంబ‌శివ‌రావు కొత్త‌గూడెం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మారిన స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో బీసీ కులానికి చెందిన వ్య‌క్తిని ఎంపిక చేయాల‌న ప‌లువురు ప్ర‌తిపాదించారు. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై రాష్ట్ర పార్టీ మాజీ కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట‌రెడ్డి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం. పార్టీ కోసం అహర్నిశ‌లు ప‌నిచేసిన త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని వాదులాట‌కు దిగిన‌ట్లు స‌మాచారం. ఇదే అద‌నుగా త‌న‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని సీపీఐ జాతీయ స‌మితి స‌భ్యుడు ప‌ల్లా వెంక‌ట‌రెడ్డి, రాష్ట్ర స‌మితి కార్య‌వ‌ర్గ స‌భ్యులు తక్కెళ్ల‌ప‌ల్లి శ్రీనివాస్ రావు కోర‌గా, నాయ‌క‌త్వం స‌సేమిరా అన్న‌ట్లు పార్టీ నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. ఏకాభిప్రాయం లేన‌ప్ప‌టికీ న‌ల్ల‌గొండ జిల్లా సీపీఐ కార్య‌ద‌ర్శి నెల్లికంటి స‌త్యం యాద‌వ్ పేరును ఖ‌రారు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక‌, వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు స‌త్యానికే సీటు ఇవ్వాల‌ని రాష్ట్ర పార్టీ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ, ఆల‌స్యంగా పేరును ప్ర‌క‌టించారు.

బీసీ నినాదంతో మైనారిటీలు వెన‌క్కి
కుల గ‌ణ‌న‌తో ముస్లిం మైనారిటీ వాదాన్ని ప్ర‌ధాన పార్టీలు కొద్దికాలం పాటు ప్ర‌ధాన పార్టీలు ప‌క్క‌న‌పెట్ట‌ల్సిన ప‌రిస్థితి దాపురించింది. కాంగ్రెస్ నిర్ణ‌యించిన మూడింటిలో ఒక సీటును ముస్లిం మైనారిటీకి ఇవ్వాల‌ని సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యించారు. కుల గ‌ణ‌న చేశామ‌ని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీతో పాటు బీసీకి సీట్ల‌ను కేటాయించింది. దీంతో ముస్లిం మైనారిటీ నుంచి పోటీప‌డిన ప‌లువురు నిరాశ‌కు గుర‌య్యారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా ఉన్న మాజీ మంత్రి మ‌హ్మ‌ద్ ష‌బ్బీర్ అలీ ప్ర‌ధానంగా పోటీలో ఉన్నారు. త‌న‌కు ఎమ్మెల్సీ సీటు ద‌క్కుతుంద‌ని, త‌ద్వారా క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం ల‌భిస్తుంద‌ని గంపెడాశ‌తో ఉన్నారు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌నల్ ఇన్‌స్టిట్యూట్స్ చైర్మ‌న్ ఫ‌హీమ్ ఖురేషీ ఎమ్మెల్సీ కావ‌డ‌మే కాకుండా డిప్యూటీ సీఎంగా వ‌స్తున్నాన‌ని పార్టీలో ప్ర‌చారం చేసుకున్నారు. త‌న‌కు ఢిల్లీ నుంచి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ‌ద్ద ప‌లుకుబ‌డి ఉంద‌ని చెప్పుకొని తిరిగార‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు బీఆర్ఎస్‌లో ప‌నిచేసి, ఎమ్మెల్సీ కే క‌విత‌కు స‌న్నిహితంగా ఉన్న ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఎలా ఇస్తారంటూ ముస్లిం మైనారిటీ నాయ‌కులు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దల‌కు ఫిర్యాదు చేశారు. వీరిద్ద‌రే కాకుండా మ‌రికొంద‌రు త‌మ ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టీ బీసీ వాదం ముందు నిల‌బ‌డ‌లేక‌పోయారు.