Revanth Rahul gap | రాహుల్‌, రేవంత్‌ మధ్య గ్యాప్‌ తొలగిందా? ఢిల్లీ ‘ప్రజెంటేషన్‌’ చెబుతున్నదేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్‌ ఏర్పడిందన్న చర్చకు గురువారం నాటి ఢిల్లీ ప్రజెంటేషన్‌లో చెక్‌ పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Revanth Rahul gap | రాహుల్‌, రేవంత్‌ మధ్య గ్యాప్‌ తొలగిందా? ఢిల్లీ ‘ప్రజెంటేషన్‌’ చెబుతున్నదేంటి?

Revanth Rahul gap | హైదరాబాద్‌, జూలై 26 (విధాత) : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉందని కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్నది. అయితే.. గురువారం నాటి పరిణామాలతో ఆ గ్యాప్‌ తొలగిపోయిందనే వాదన వినిపిస్తున్నది. తెలంగాణలో చేపట్టని కుల గణనను రాహుల్‌ అభినందించడం, ఈ ప్రజెంటేషన్‌ సందర్భంగా సుహృద్భావ వాతావరణం కనిపించడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీ భేటీతో వదంతులను రేవంత్‌ పటాపంచలు చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలపై మరింత దూకుడు పెంచేందుకు అధిష్ఠానం కూడా అండగా ఉందనే మానసిక స్థైర్యం రేవంత్ రెడ్డికి ఈ సమావేశం ద్వారా అందిందని అంటున్నారు. గత కొంతకాలంగా రాహుల్, రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో అదానీ పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడం రాహుల్‌కు నచ్చలేదని గతంలోనే వార్తలు వచ్చాయి. ఒకవైపు మోదీ, అదానీ లింకులపై రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అదానీని ఆహ్వానించడాన్ని అప్పట్లో ప్రతిపక్ష బీఆరెస్‌ కూడా తప్పుపట్టింది. తర్వాత ఆ తప్పును దిద్దుకున్నప్పటికీ.. అప్పటికే నష్టం జరిగిపోయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో ఢిల్లీకి వెళ్లినా రేవంత్‌ రెడ్డికి రాహుల్‌ గాంధీ అపాయింట్‌మెంట్‌ లభించలేదని ప్రచారం జరిగింది. వారిద్దరి మధ్య నెలకొన్న గ్యాప్‌ ఇందుకు కారణమని మీడియాలో కథనాలు వచ్చాయి. రాహుల్ వరంగల్‌ పర్యటన రద్దు కావడం కూడా గ్యాప్‌ ప్రచారానికి ఊతమిచ్చింది. అయితే.. రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామాన్ని ఎప్పటికప్పుడు రాహుల్‌ గాంధీకి రేవంత్‌ రెడ్డి ఫోన్‌ ద్వారా తెలియజేస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఢిల్లీ వెళ్లినప్పుడు అపాయింట్‌మెంట్‌ ఎందుకు లభించడం లేదన్న విషయంలో సంతృప్తికర సమాధానాలు మాత్రం రేవంత్‌ సన్నిహిత వర్గాల నుంచి రావడం లేదు. ఇన్ని ప్రచారాల నేపథ్యంలో తాజాగా గురువారం ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీలకు కుల గణనపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దీనికి సోనియా మినహా పార్టీ అగ్రనాయత్వం హాజరైంది. ఈ సమావేశంలో మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. రేవంత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కులగణన చేయాలని రేవంత్‌కు చెప్పానని, రేవంత్‌ను తక్కువ అంచనా వేసినప్పటికీ.. కుల గణన విషయంలో అంచనాలకు మించి పనిచేశారని ప్రశంసించారు. పవర్ పాయింట్ ప్రజేంటేషన్ సందర్భంగా ప్రసంగం ముగించుకుని కిందికి వస్తున్న రేవంత్‌ కోసం రాహుల్‌ తన కుర్చీ నుంచి లేచి నిలబడ్డారు. అది గమనించిన సీఎం.. ఆయన వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్నారు. పక్కనే ఉన్న ఖర్గే సైతం రేవంత్‌తో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా సుహృద్భావ వాతావరణం చూస్తే.. ఇద్దరి మధ్య గ్యాప్‌ ఏమీ లేనట్టేనని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక విధంగా ఈ సమావేశం రేవంత్‌రెడ్డికి బూస్ట్‌ ఇచ్చినట్టయిందని అంటున్నారు.

డబుల్ ధమాకానా?

కులగణన సర్వే అంశం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్‌ వద్ద మైలేజీ పెంచిందని అంటున్నారు. భారత్ జోడో యాత్రలో కులగణన సర్వే గురించి రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దానిని పునరుద్ఘాటించారు. ఆ మేరకు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేశారు. ఈ విషయమై రేవంత్ పై ఒత్తిడి తెచ్చినట్టు రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కులగణనకు సంబంధించి 88 కోట్ల పేజీల డేటా ఉందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కులగణనతో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణలో ఏం చేశామో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలకు వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ కుల గణన విషయంలో రాహుల్‌ దారికి వచ్చారని వ్యాఖ్యానించారు. గురువారం రోజంతా పార్టీ అగ్రనాయకులతో రేవంత్ రెడ్డి కలిసే ఉన్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారని సమాచారం. రేవంత్ కలిసినప్పుడు రాహుల్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫోటోలను రేవంత్ వర్గీయులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కులగణన, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీని అమలు చేయడం ఒకటైతే, కాంగ్రెస్ నాయకత్వం వద్ద మైలేజీ సంపాదించడం ఇక రెండో అంశంగా చెబుతున్నారు. సోనియా గాంధీ తనకు రాసిన లేఖ గురించి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవే సూచిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వం తన పట్ల అంటీముట్టనట్టు ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదనే చెప్పుకొనేందుకు ప్రయత్నించారు. సోనియాగాంధీ రాసిన లేఖ తనకు ఆస్కార్ వంటిదని రేవంత్ చేసిన వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ లో లేకున్నా కాంగ్రెస్ లో చేరిన తర్వాత రాహుల్ ఆత్మ తనకు తెలుసునని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రాహుల్ ఆలోచనలకు అనుగుణంగా తాను పనిచేస్తున్నానని ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో ఆయన ప్రకటించారు.

రాజకీయంగా పైచేయేనా?

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్‌తో తరచూ సమావేశమైన రేవంత్ రెడ్డి చాలాకాలం తర్వాత గురువారం మాత్రమే న్యూఢిల్లీలో రాహుల్‌తో భేటీ అయ్యారు. రాహుల్‌తో తనకు ఎలాంటి గ్యాప్‌ లేదని ఈ ఏడాది ఫిబ్రవరిలో మీడియాతో చిట్ చాట్‌లో వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత దానిపై స్పందించలేదు. రాహుల్‌తో తన సంబంధాలు ఎలా ఉన్నాయనే దానిపై గురువారం మీటింగ్ ద్వారా తేటతెల్లమైందనేది రేవంత్ భావనగా కన్పిస్తోంది. ఈ అంశాన్ని పెద్దగా చేసి రాజకీయంగా లబ్దిపొందాలని ప్రయత్నం చేసిన ప్రత్యర్థి పార్టీలకు ఢిల్లీ మీటింగ్ ఆ అవకాశం మిస్‌ అయిపోయిందని అంటున్నారు.