Telangana Local Elections | స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్ల మెలిక! ఎన్నికలు పాత విధానంలోనా? కొత్త కోటాపైనా?
ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జూలై 25 లోపు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తేలనందున స్థానిక సంస్థలకు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక స్పష్టతకు రాలేదు. ఢిల్లీలో పరిణామాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కోర్టులో తమ వాదనను తెలిపే అవకాశం ఉందని అంటున్నారు.

Telangana Local Elections | హైదరాబాద్, జూలై 31 (విధాత): తెలంగాణ హైకోర్టు (high court) తీర్పు మేరకు స్థానిక సంస్థల ఎన్నికల (Telangana Local Elections) నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. కానీ, కీలకమైన రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాలేదు. రిజర్వేషన్ల ప్రక్రియ తేలగానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎస్‌ఈసీ సిద్ధంగా ఉంది. రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయాలి. బీసీలకు 42 రిజర్వేషన్ (42 percent bc reservation) అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఆగస్టు మొదటివారంలో ఢిల్లీలో రేవంత్ నేతృత్వంలో నిరసన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆగస్టు 7 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఉందని తెలుస్తున్నది.
స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల అవసరమైన సిబ్బందిని సిద్దం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. వార్డులవారీగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. రెండుదశల్లో స్థానిక ఎన్నికలను నిర్వహించనున్నారు. వీటికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, వార్డులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల వివరాలు, రిజర్వేషన్లను ఇవ్వాల్సి ఉన్నది. రాష్ట్రంలో 5,773 ఎంపీటీసీ, 566 జెడ్పీటీసీ, 31 జిల్లా పరిషత్, 12,778 గ్రామ పంచాయతీలు, 1 లక్షా 12 వేల వార్డులను పంచాయితీరాజ్ శాఖ ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి జాబితాను కూడా పంపింది. వీటికి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. 2019లో 5,773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 44 స్థానాలు తగ్గి.. 5,773కు చేరాయి. అప్పట్లో 570 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలుండేవి. ఇప్పుడు వాటిని 566కు కుదించారు. గతంలో 12,848 గ్రామ పంచాయతీలుంటే ఇప్పుడు 12,778కు తగ్గాయి. వార్డులు యథావిధిగా ఉన్నాయి.
రిజర్వేషన్లపై ఎందుకీ జాప్యం?
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లులు ఆమోదింపజేసుకున్నది. ఇవి ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ గవర్నర్‌కు పంపారు. దీనిపై లీగల్ ఓపినియన్ తీసుకున్న గవర్నర్.. దానిని కేంద్ర హోం శాఖకు పంపారు. మూడు రోజుల క్రితం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఫైనల్ చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులను ఆమోదించాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లి ద్రౌపది ముర్మును కలవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆగస్ట్ 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నది. ముందురోజు ఆగస్టు 5న పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ అంశానికి సంబంధించి పార్టీ తరఫున వాయిదా తీర్మానాలు ఇవ్వడంతో పాటు చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 7న రాష్ట్రపతిని కలవనున్నారు.
నెక్స్ట్ స్టెప్ ఏంటి?
ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జూలై 25 లోపు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తేలనందున స్థానిక సంస్థలకు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక స్పష్టతకు రాలేదు. ఢిల్లీలో పరిణామాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కోర్టులో తమ వాదనను తెలిపే అవకాశం ఉందని అంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా ఎన్నికల నిర్వహణకు మరింత సమయం కోరుతూ లోకల్ బాడీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఆప్షన్‌కు కోర్టు సానుకూలంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ సెప్టెంబర్ 30 లోపుగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని న్యాయస్థానం ఆదేశిస్తే పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చ. ఒకవేళ అలా జరిగితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉండబోదు. పాత పద్దతిలోనే రిజర్వేషన్లు అమలు చేస్తారు. పాత విధానం ప్రకారం 23 శాతం రిజర్వేషన్లు మాత్రమే బీసీలకు వర్తిస్తాయి. ఇదే పరిస్థితి తలెత్తితే తన రాజకీయ అస్త్రాన్ని కాంగ్రెస్ బయటకు తీస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే అధికారికంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధ్యం కాని పక్షంలో తాము పార్టీ పరంగా బీసీలకు అంతే మొత్తంలో రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇతర పార్టీలు సైతం ఇలా చేయాలని కోరుతున్నది. సాధారణంగా అధికారపక్షం విసిరే వలలో ప్రతిపక్షాలు పడటానికి సిద్ధంగా ఉండవు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించలేకే ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారంటూ ప్రతిపక్షాలు కౌంటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అదే సమయంలో తాము సుదీర్ఘ ప్రయత్నాలు చేసినా బీజేపీ విముఖత, బీఆరెస్ సహాయ నిరాకరణతో రిజర్వేషన్లు ఇవ్వలేక పోయామని కాంగ్రెస్ చెప్పుకొనే అవకాశాలూ ఉంటాయని పరిశీలకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Donald Trump| భారత్‌పై ట్రంప్ ‘ఫ్రెండ్లీ టారిఫ్’
Kaleshwaram Commission| కాళేశ్వరం కమిషన్ గడువు మళ్లీ పెంపు
Top 5 Cobras | కోబ్రాలందు కొన్ని కోబ్రాలు వేరయా! కాటేస్తే.. కాటికే!
Anasuya Bharadwaj | మా ఆయన చేతకాని వాడు.. అనసూయ సంచలన వ్యాఖ్యలు