Donald Trump| భారత్‌పై ట్రంప్ ‘ఫ్రెండ్లీ టారిఫ్’
తమకు మిత్ర దేశమేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నెత్తిన భారం మోపారు. ఆగస్ట్ 1 డెడ్‌లైన్ నుంచి భారతదేశం 25 శాతం టారిఫ్ పరిధిలోకి వస్తుందని బుధవారం ప్రకటించారు. భారత్‌పై టారిఫ్‌ల విషయంలో రెండు దేశాల మధ్య ఆగస్ట్‌లో ఆరో రౌండ్ ద్వైపాక్షిక చర్చలు భారత్‌లోనే జరుగనున్నాయి

- స్నేహితుడంటూనే బాదేశారు
- ఆగస్ట్ 1 నుంచి 25% సుకాలు
- వాటితోపాటే జరిమానా కూడా
- రష్యా నుంచి ఆయుధాలు
- కొనుగోలు చేస్తున్న భారత్
- చమురునూ కొంటున్నారు
Donald Trump| తమకు మిత్ర దేశమేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నెత్తిన భారం మోపారు. ఆగస్ట్ 1 డెడ్‌లైన్ నుంచి భారతదేశం 25 శాతం టారిఫ్ పరిధిలోకి వస్తుందని బుధవారం ప్రకటించారు. భారత్‌పై టారిఫ్‌ల విషయంలో రెండు దేశాల మధ్య ఆగస్ట్‌లో ఆరో రౌండ్ ద్వైపాక్షిక చర్చలు భారత్‌లోనే జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన వెలువడం గమనార్హం. ట్రూత్‌లో చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లో తన చర్యను ట్రంప్ సమర్థించుకున్నారు. సుంకాలతోపాటు పెనాల్టీ కూడా ఉంటుందని తెలిపారు.
‘గుర్తుంచుకోండి.. భారత్ మా స్నేహితుడే. కొన్నేళ్లుగా మేం వారితో చాలా తక్కువ వ్యాపారమే చేస్తున్నాం. ఎందుకంటే.. ప్రపంచంలోని టారిఫ్‌లలో వారి టారిఫ్‌లు చాలా అధికంగా ఉన్నాయి. ఏ దేశంలోనూ లేనంత కఠిన, చెత్త ద్రవ్యేతర వాణిజ్య అడ్డంకులు ఉన్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు రష్యా నుంచి చమురు కొంటున్నాయని, అందులో అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ ఉన్నదని ట్రంప్ పేర్కొన్నారు. తాము ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపాలని కోరుతుంటే.. చైనా, భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయని ఆరోపించారు. రష్యా నుంచి భారత దేశం భారీగా ఆయుధాలు కూడా కొనుగోలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణాలను చూపుతూ 25 శాతం టారిఫ్, దానిపై ఇంకా ప్రకటించని జరిమానాలను ట్రంప్ ప్రకటించారు. భారత్‌తో అమెరికా తీవ్ర వాణిజ్య లోటును కలిగి ఉన్నదని వేరొక పోస్ట్‌లో ట్రంప్ పునరుద్ఘాటించారు.
ఇటీవల అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం.. రష్యా ఎగుమతులను (ప్రత్యేకించి చమురు) కొనుగోలు చేస్తున్న దేశాలను హెచ్చరించిన కొన్ని వారాల వ్యవధిలోనే 25 శాతం టారిఫ్, జరిమానా ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ కొనుగోళ్లు రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్ పుతిన్ తన యుద్ధ యంత్రాంగానికి నిధులు సమకూర్చుకొనేందుకు ఉపయోగపడుతున్నాయని గ్రాహం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో రష్యా పైన, దాని ఎగుమతులను కొనుగోలు చేస్తున్న దేశాలపైన వంద శాతం టారిఫ్ విధిస్తామని కూడా గ్రాహం హెచ్చరించారు. నాటో చీఫ్ మార్క్ రూట్ సైతం ఇదే తరహా హెచ్చరిక చేశారు.
ఆగస్ట్‌లో నిర్వహించే ఆరో రౌండ్ సమావేశాల్లో భారత్‌పై టారిఫ్ విధింపు అంశం ఉన్నది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా ప్రతినిధి బృందం న్యూఢిల్లీకి రానున్నది. అమెరికాతో వాణిజ్య చర్చలు వేగంగా సాగుతున్నాయని శనివారమే పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. సెప్టెంబర్, అక్టోబర్ నాటికల్లా రెండు దేశాలు ఒక ఒప్పందానికి రానున్నాయని కూడా చెప్పారు. కానీ.. ఈలోపే అమెరికా అధ్యక్షుడు తన నిర్ణయం ప్రకటించడం చర్చనీయాంశమైంది.