LPG Shortage | ఆయిల్ కంపెనీలపై అంతులేని ప్రేమ… నిద్రపోతున్న పౌర సరఫరాల విభాగం

వినియోగదారులు ఎల్పీజీ కోసం అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకోని తెలంగాణ పౌర సరఫరాల విభాగం.. ఆయిల్‌ కంపెనీలపై మాత్రం అంతులేని ప్రేమను చూపిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

fuel-shortage-telangana

విధాత, హైదరాబాద్:

LPG Shortage | డొమెస్టిక్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఎల్పీజీ ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు కొడుతున్నారు. సిలిండర్‌ బుక్‌ చేసుకున్నవారికి ఈకేవైసీ కంప్లీట్ కాలేదంటూ గ్యాస్‌ డెలివరీ చేయకుండా సతాయిస్తున్నారు. పలు బంకుల మందు ఆటోలు, కార్లు ఎల్పీజీ కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూ కడుతున్నాయి. సీఎన్జీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. దీనికంతటికీ కారణం.. రాష్ట్రంలోని ఆయిల్ కంపెనీలు ఇరాన్ యుద్దం ప్రారంభం అయిన తరువాత క్రెడిట్ సౌకర్యం నిలిపివేశాయి. దీంతో ఎల్పీజీ, పెట్రోల్ బంకు డీలర్లు నగదు చెల్లింపులు చేస్తే కానీ పెట్రోలియం ఉత్పత్తులను డెలివరీ చేయడం లేదు. దీనికంతటికీ కారణం పెట్రోలియం కంపెనీల ప్రతినిధులపై పౌర సరఫరాల విభాగానికి పట్టు లేకపోవడమేనన్న కారణాలు విన్పిస్తున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో ప్రతినిత్యం వారితో సమీక్షలు నిర్వహించకపోవడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులను వారికి తెలియచేయకపోవడమేనని మాజీ పౌర సరఫరాల అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్రంలో గడచిన వారం రోజులుగా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ కోసం వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయిల్ నిల్వలు కరిగిపోతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమనడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. దీంతో నాలుగైదు రోజుల క్రితం వరకు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. ఎప్పుడూ ఒక వంద రూపాయలకు మించి టూ వీలర్ ట్యాంక్‌లో పెట్రోల్ వేయించుకోని వారు ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్న సంఘటనలు చూశాం. మూడు నాలుగు రోజులు ఏ బంకుకు వెళ్లినా టూ వీలర్లు, ఫోర్ వీలర్లతో కిటకిటలాడుతూ కన్పించాయి. మధ్యాహ్నం సమయానికే కొన్ని బంకులలో పెట్రోల్ విక్రయాలు ఆగిపోగా, మరికొన్ని బంకులలో డీజిల్ విక్రయాలు నిలిపివేశారు. తాకిడిని తట్టుకోలేక యజమానులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనదారులను నియంత్రించేందుకు కొన్ని బంకుల ముందు ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు పనిచేసి నియంత్రించారు.

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు రాష్ట్రంలో ఆయిల్ కంపెనీలు అయిన హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండేన్ ఆయిల్ కార్పొరేషన్లు పెట్రోల్ బంక్ యజమానులకు క్రెడిట్ సౌకర్యం కల్పించాయి. కంపెనీలు ఇస్తున్న ఈ సౌకర్యాన్ని అకస్మాత్తుగా నిలిపివేశాయి. పెట్రోల్‌ బంకు యాజమాన్యాలు కోరిన విధంగా ట్యాంకర్లు పంపించాల్సి ఉంటుందని గమనించి, డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు యాజమాన్యాలు కుట్రకు తెరలేపాయని అంటున్నారు.

ఒక్కసారిగా క్రెడిట్ సౌకర్యం నిలిపివేయడంతో బంకు యజమానులకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. డీడీ అందచేస్తే తప్ప ట్యాంకర్లు కొనుగోలు చేయలేని పరిస్థితికి తీసుకువచ్చారని యజమానులు గగ్గోలు పెట్టారు. అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన తెలంగాణ పౌరసరఫరాల విభాగం ఏమీ తెలియనట్లుగా చేష్టలుడిగి చూస్తున్నదని యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు కూడా డొమెస్టిక్ సిలిండర్లను దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంజాగుట్ట స్మశాన వాటికలో నాలుగు వందల కమర్షియల్ సిలిండర్లు లభ్యమయ్యాయంటే ఏ మేరకు దారి మళ్ళిస్తున్నారో అర్థమవుతున్నది. ఆన్‌లైన్‌లో బుక్ చేసినా ఇంటికి సిలిండర్లు పంపించడం లేదంటూ పలువురు ఎల్పీజీ ఎజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈకేవైసీ పూర్తి చేయలేదని, 35 రోజులు తరువాత బుక్ చేయాలని, అడ్రస్ సక్రమంగా లేదని, వివరాలు లేవంటూ ఇలా పలు సాకులు ఏజెన్సీ సిబ్బంది చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఈ కేవైసీ చేయించుకుందామంటే గంటల కొద్దీ కార్యాలయం ముందు నిల్చోబెడుతున్నారని, అదేమని ప్రశ్నిస్తే ఆన్‌లైన్‌లో ఈకేవైసీ చేసుకుని రావాలంటూ హుంకరిస్తున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు తెలంగాణ పౌర సరఫరాల విభాగం సీరియస్ గా రంగంలోకి దిగాలని పలువురు కోరుతున్నారు.

హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండేన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులతో ప్రతినిత్యం పౌరసరఫరాల భవన్‌లో సమీక్షలు నిర్వహిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రావడం కష్టమని రిటైర్డు పౌర సరఫరాల అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ మూడు కంపెనీలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయని, వీరికి లాభాలు, వ్యాపారం తప్ప వినియోగదారుల కష్టాలు ఏమాత్రం కన్పించవన్నారు. ఏ రోజు ఎంత సరఫరా చేశారు, మార్కెట్ లో కొరత ఎంత ఉంది, డిమాండ్ అండ్ సప్లయి మధ్య వ్యత్యాసం ఎంత ఉందనే దానిపై ప్రతినిత్యం సమీక్షించడం మూలంగా సరఫరా పెరిగి, వినియోగదారులకు సత్వర సేవలు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాగే వదిలేస్తే మున్ముందు మరింత సమస్య తీవ్రమై, ఏజెన్సీల వద్ద పెండింగ్ చాంతాడంత పెరుగుతుందన్నారు. బుకింగ్ చేసుకున్న తరువాత వారం పదిరోజులకు సిలిండర్లు డెలీవరీ చేసే దుస్థితి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బదనాం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా గతంలో మాదిరి ప్రతి బంకు యజమానికి క్రెడిట్ లో పెట్రోల్, డీజిల్ లభ్యమయ్యే విధంగా ఆయిల్ కంపెనీలను ఒప్పించాలని, వినని పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని రిటైర్డు పౌర సరఫరాల అధికారి పేర్కొన్నారు.

ఏపీలో వ్యాపార వర్గాలకు ఊరట.. 70 శాతం అదనపు గ్యాస్‌ కోటా పెంచిన కేంద్రం

అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యంలో వాణిజ్య అవసరాలకు సంబంధించిన కమర్షియల్ గ్యాస్ బుకింగ్ విషయంలో ఇబ్బందులు పడుతున్న వ్యాపారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేంద్రం శుభవార్త చెప్పిందని, 70 శాతం మేర గ్యాస్ అదనపు కోటాను వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునే వెసులుబాటును కేంద్రం కల్పించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖమాత్యులు నాదెండ్ల మనోహర్ తెలిపారు. వ్యాపారులు తమ అసోసియేషన్ పరిధిలో గ్యాస్ ఎంత మేర అవసరమో జిల్లా జాయింట్ కలెక్టర్లకు చెబితే, ప్రాధాన్యత ప్రకారం గ్యాస్ బండలను కేటాయించడం జరుగుతందని చెప్పారు. రాష్ట్రంలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరా తీరు, వాస్తవ పరిస్థితి, అందుబాటులో ఉన్న నిల్వలపై మంగళవారం మంత్రి… ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీలు, స్టేట్ కోఆర్డినేటర్లతో ప్రత్యేకంగా రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకొని, తదుపరి చర్యలపై దిశానిర్దేశం చేశారు.

Latest News