Palamuru Rangareddy Lift | పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్‌, రేవంత్‌ దొందూ దొందే!!

పాలమూరు ప్రాజెక్టు ఆలస్యానికి మీరు కారణమంటే.. మీరే కారణమని అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆరెస్‌ వాదులాడుకుంటున్నాయి. నిజానికి ఈ రెండు పార్టీలూ ప్రాజెక్టును పడకేయించాయనే అభిప్రాయాలను సాగునీటి నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Palamuru Rangareddy Lift | పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్‌, రేవంత్‌ దొందూ దొందే!!
  • పదేళ్ల పాలనలో ప్రాజెక్టును పట్టించుకోని కేసీఆర్
  • 2015లో పనులు ప్రారంభం.. 2023 వరకు సా..గదీత
  • తొమ్మిది మోటర్లకు ఒక్కటి ప్రారంభించి సరిపెట్టారు
  • అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ప్రాజెక్టును పట్టించుకోని రేవంత్ సర్కార్
  • ప్రాజెక్టును కేసీఆర్‌ పట్టించుకోలేదని రేవంత్ ఆరోపణ
  • రెండేళ్లలో తట్టెడు మట్టి తీయలేదని రేవంత్ సర్కార్‌పై కేసీఆర్‌ గుస్సా
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పడావు పడిన ప్రాజెక్టు

(విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి)

Palamuru Rangareddy Lift | పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మళ్ళీ రాజకీయానికి తెర లేపారు. ఎనిమిదేళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పనులు కేసీఆర్‌ తన పదేళ్ల పాలనా కాలంలో సా..గదీశారు. మూడురోజుల క్రితం కేసీఆర్ నోటినుంచి మళ్లీ ఈ ప్రాజెక్టు మాట వినపడింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కాంగ్రెస్ సర్కార్ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని దుయ్యబట్టారు. పదేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టును పట్టించుకోని కేసీఆర్ అధికారం పోయాక ప్రాజెక్టుపై మాట్లాడటం విడ్డురంగా ఉన్నదని కాంగ్రెస్‌ నేతలు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. ప్రాజెక్టుపై కేసీఆర్‌ నిర్లక్ష్యం తెలంగాణ ప్రజలకు అంతా తెలుసంటూ ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు చివరి దశకు వచ్చి ఆగిపోయాయని, కాంగ్రెస్ సర్కార్ వచ్చి రెండేళ్లు అయినా ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. మొత్తం మీద అటు కేసీఆర్‌ ఇటు రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుతం పడావు పడిందనేది మాత్రం వాస్తవం. ఈ ఇద్దరు నేతల మాటలు ‘కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం ‘ లేదనే చందంగా మారింది.

ఇదీ ప్రాజెక్టు నేపథ్యం

హైదరాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీటి సరఫరా, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించే ఉద్దేశంతో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుంచి నీటిని పంపింగ్ చేసి, రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం లక్ష్మీదేవిపల్లి జలాశయానికి నీటిని పంపిచేందుకు ప్రణాళిక రూపొందించారు.

  • వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద జలాలను రోజుకు 1.5 టీఎంసీల చొప్పున.. మొత్తం 90 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనేది ప్రాజెక్టు లక్ష్యం.
  • శ్రీశైలం జలాశయం నుండి ఐదు అంచెల్లో నీటిని లిఫ్ట్‌ చేసి, సముద్ర మట్టానికి 670 మీటర్ల ఎత్తున ఉన్న లక్ష్మీదేవిపల్లి జలాశయానికి చేరుస్తారు.
  • ప్రాజెక్టులో భాగంగా మొత్తం 5 లిఫ్టులు, 6 జలాశయాలు నిర్మించాల్సి ఉన్నది.
  • 35,200 కోట్ల రూపాయల వ్యయం అంచనాతో ఈ ప్రాజెక్టుకు 2015లో తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
  • ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మిచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
  • మొదటి దశలో మొత్తం నీటిని తరలించడానికి పంపుహౌస్‌లు, జలాశయాలు, పైపులైన్లు, కాలువలు, సొరంగాలు నిర్మించి, తాగునీటి, పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తారు.
  • రెండవదశలో సాగునీటిని అందించేందుకు అవసరమైన కాలువలు, సొరంగాలు నిర్మిస్తారు. 

ఇంత వరకు జరిగిన పనుల వివరాలు :

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు 2015 జూన్ 11న ముఖ్యమంత్రి హోదాలో కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నీటిని తరలించేందుకు నార్లాపూర్ వద్ద తొమ్మిది మోటర్లు బిగించి వాటి ద్వారా పలు జలాశయాలకు నీటిని పంప్‌ చేస్తారు. నార్లాపూర్ వద్ద 8.51 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించారు. ఇక్కడి నుంచి ఏదుల వద్ద నిర్మించిన జలాశయానికి నీటిని కాలువల ద్వారా పంపిస్తారు. ఈ జలాశయంలో 6.55 టీఎంసీల నీటిని నిలువ ఉంచేందుకు నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడి నుంచి వట్టెం వద్ద నిర్మించిన జలాశయంలోకి నీటిని పంపిస్తారు. ఇక్కడ 16.74 టీఎంసీ నీరు నిలువ ఉండే జలాశయం నిర్మించారు. ఇక్కడి నుంచి కరివెన జలాశయానికి నీటిని పంపిస్తారు. దీనిలో 17.34 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉంది. చివరగా ఉద్ధండాపూర్ గ్రామం వద్ద నిర్మించిన జలాశయంలోకి నీటిని పంపిస్తారు. ఇందులో 16.03 టీఎంసీ నీరు నిలువ ఉంటుంది. ఈ జలశయాల పనులు పూర్తి అయినా నీటిని తరలించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వాదనలు ఉన్నాయి. నార్లాపూర్ వద్ద తొమ్మిది మోటర్లకుగాను 2023 సెప్టెంబర్ 16 న నాటి సీఎం కేసీఆర్‌ ఒక్క మోటర్‌ ఆన్‌ చేసి.. చేతులు దులుపుకొన్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు.

అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ప్రచారం చేసుకునేందుకే ముందు జాగ్రత్త చర్యగా కేసీఆర్‌ ఒక్క మోటర్‌ను ఆన్‌ చేసి.. పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ పూర్తి అయిందని ప్రకటించారని సాగునీటి నిపుణులు విమర్శిస్తున్నారు. ఆ ఒక్క మోటర్‌ను కూడా.. ఆన్ చేసిన గంటలోపే ఆఫ్ చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టువైపు కన్నెత్తి చూసింది లేదు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు పరాభవం తప్పలేదు. బీఆర్ఎస్‌ను ఓడించి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం కావడంతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు బుల్లెట్‌ వేగంతో దూసుకుపోతాయని ఇక్కడి రైతులు ఆనందపడ్డారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఈ ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఈ ప్రాజెక్టు పనులు కేసీఆర్‌ సర్కార్‌లో ఎంతో కొంత చేసినా రేవంత్ సర్కార్ మాత్రం ఆవగింజంత పని కూడా చేయలేదని పరిస్థితిని చూస్తే అర్థమవుతున్నది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయని కేసీఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం, దానికి కాంగ్రెస్‌ నేతలు ప్రతి విమర్శలు చేయడం జిల్లా ప్రజలు, రైతుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇద్దరూ ఆరోపణలు చేసుకోవడమే కానీ.. పనులు మాత్రం పూర్తి కావడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇకనైనా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్వరూపం:

మొత్తం ఆయకట్టు : 12.30 లక్షల ఎకరాలు
వినియోగించే జలాలు : 75.94 టీఎంసీలు
రిజర్వాయర్లు : 5
   1. అంజనగిరి రిజర్వాయర్‌ : 8 .51 టీఎంసీలు (నార్లాపూర్‌)
   2. వీరాంజనేయ : 6.55 టీఎంసీలు (ఏదుల)
   3. వెంకటాద్రి : 16.74 టీఎంసీలు (వట్టెం)
   4. కురుమూర్తిరాయ : 17.34 టీంఎసీలు (కరివెన)
   5. ఉద్ధండాపూర్‌ : 16.03 టీఎంసీలు

ఇవి కూడా చదవండి..

Uttam Kumar Reddy : పాలమూరు ఎత్తిపోతల కాలయాపన చేయమన్న ఘనులు
Check Power : బిగ్ బ్రేకింగ్..ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు..పునరుద్దరణ
Aliens Exist | గ్రహాంతరవాసుల జాడ తెలిసేది ‘ఆ సంవత్సరం’లోనే .. బ్రిటన్‌ శాస్త్రవేత్త ధీమా
Large Sinkhole In UK : భూమి బద్దలైందా ! కాలువ కింద భారీ హోల్..తప్పిన ప్రాణనష్టం