‘తెలంగాణ’ పండుగ పూట ‘పంచాయతీ’…

తెలంగాణ ప్రజల దశాబ్దాల సమిష్టి పోరాట ఫలితం… వందలాది మంది బిడ్డల బలిదానానికి ప్రతిరూపం ... ఆంధ్ర ఆధిపత్య శక్తులు, పెత్తందారుల కబంధ హస్తాల నుంచి విముక్తి లభించి ... స్వయం పాలన సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు. రాజకీయ భిన్నాభిప్రాయాలెన్ని ఉన్నా ... నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రతిఫలించిన రోజు... వేడుక నిర్వహించుకుని గతాన్ని బేరీజు వేసుకుని, భవిష్యత్తును తీర్చదిద్దుకునేందుకు ప్రణాళికలు రచించుకునే ప్రత్యేక రోజు. తెలంగాణ ప్రజలు ఆనందంతో నిర్వహించుకునే పర్వదినం. అంతటి ఉద్వేగ భరితమైన రోజున రాజకీయ రచ్చకోసం కుట్రలు చేశారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఏర్పాటైన సంతోషాన్ని దక్కకుండా చేయడమనే కుట్ర దాగి ఉందనే చర్చకు ఆస్కారాన్ని కలిగిస్తున్నారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 12 ఏళ్లు అవుతున్నది. ఇప్పుడు ప్రజాస్వామ్యం పేరుతో తెలంగాణపై ప్రత్యక్ష దాడికి కొన్ని శక్తులు దిగడం తెలంగాణ అస్తిత్వవాదుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. పుష్కరకాలం పాటు ఓపికపట్టామని, ఇంకెంత కాలం సహించాలంటూ పవన్ తన అక్రోశాన్ని వెళ్లగక్కడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు. పవన్ మాటలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ రాజకీయ పక్షాలు అండదండలందిస్తున్నాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. నిన్నటి వరకు ఏం జరిగినప్పటికీ మంగళవారం చకచకా జరిగిన పరిణామాలూ, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన రాజకీయ పక్షాల స్పందనలు, ప్రతిస్పందనలు చూసిన తర్వాత అమరుల త్యాగఫలం, ‘తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవం’ ‘ స్వయం పాలన’ అనే అంశాలను డొల్లగా మార్చేందుకు, అవసరార్ధం మాట్లాడే పడికట్టుపదాలుగా మార్చేందుకు సిద్ధమయ్యారంటున్నారు. తమ పార్టీ రాజకీయ ప్రయోజనం, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఈ ప్రాంత ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేందుకు సిద్ధమయ్యారనే చర్చకు ఊతమిస్తున్నారు. తామూ, తమ పార్టీ అధికారం ముందు ప్రజాకాంక్షలు, సెంటిమెంట్లూ అన్నీ దిగదుడిపేనని నేతల మాటలతో తేటతెల్లమైందంటున్నారు.

అంగట్లో ఆవిర్భావ ‘దినోత్సవం’

ఎంతోమంది విద్యార్ధి, యువకుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ ఉత్సవంగా నిర్వహించుకోవడం కనీస బాధ్యత. అధికారం ఆశించే పార్టీలు అవసరార్ధమైన దీనిని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంటోంది. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం, అందులో త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవడం అత్యంత ముఖ్యమైంది. ఈ సందర్భంగా రాజకీయాలను పక్కనబెట్టి తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిస్తూ ఐక్యతను ప్రదర్శిస్తూ వేడుక చేసుకోవాల్సిన రాజకీయ పక్షాలు ‘విమర్శల’కు, ఆరోపణలకూ అధికారానికి, తమ రాజకీయానికి వేదికలుగా మార్చారనే చర్చ సాగుతోంది. నిత్యం రాజకీయ విమర్శలు, ఆరోపణలతో ఢీకొట్టే నేతలు కనీసం ఆవిర్భావం దినోత్సవం రోజైన తెలంగాణ అస్తిత్వానికి ప్రాధాన్యతనివ్వకుండా, రోజువారీ తిట్ల పురణానికి ప్రాధాన్యతనివ్వడంతో ప్రత్యర్ధుల ముందు పలుచనయ్యారని భావిస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తే, తాజా కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ స్పూర్తిని నాశనం చేస్తూ, తమ రాజకీయ చదరంగంలో పావులుగా మారుస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఈ పరిణామాలతో ప్రత్యర్ధులకూ, పవన్ లాంటి వారికి ఊతమిచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంతకాలం ఆగి ఇప్పుడే… ఎందుకు?

తెలంగాణ ఉద్యమ వేడి, రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రాపార్టీలుగా, ఆంధ్ర నాయకత్వం కింద ఉన్న పార్టీలుగా ముద్ర ఉన్న పార్టీలు తెలంగాణలో ఉనికిని కొనసాగించినప్పటికీ నామ మాత్రమేనని చెప్పవచ్చు. ఈ క్రమంలో టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన తదితర పార్టీలు తెలంగాణలో నామ మాత్రంగా నిర్మాణం ఉన్నప్పటికీ ఆంధ్రకు మాత్రమే పరిమితమయ్యాయి. తెలంగాణ ఎన్నికల్లో అప్పుడప్పుడు పాల్గొంటూ తమ సానుకూలతను బట్టి వ్యవహరిస్తున్నారు. అయితే తెలంగాణలో తమ పట్టు సాధించేందుకు ప్రయత్నించడాన్ని మాత్రం ఆపలేదనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, వైఎస్సార్సీపీలు ఎన్నికలకు దూరంగా ఉండగా, పోయిన ఎన్నికల్లో జనసేన పోటీచేసిందీ, కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్ధులకు మద్ధతు ప్రకటించినప్పటికీ ఎక్కడ కనీస ప్రభావం చూపలేదు. పవన్కల్యాణ్ కూడా గత ఎన్నికల్లో ప్రచారం చేస్తూ, ఎన్నికల్లో పర్యటించారు. తాజాగా పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని గంభీరంగా ప్రకటించినప్పటికీ ఈ ప్రయత్నం గతంలోనూ చేశారనే గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారనేది మాత్రమే తేడాగా చెబుతున్నారు. గతంలోనూ ఆయన బీజేపీతో దోస్తీ చేశారు. ఇప్పుడు కూడా బీజేపీ ప్రోద్భలతంతోనే తెలంగాణలో రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో ప్రత్యేకంగా హైదరాబాద్ లో సమావేశమైన తర్వాత జరుగుతున్న పరిణామాలుగా వీటిని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం అనే అంశాల పై దాడి చేసేందుకు సిద్ధమయ్యారని భావిస్తున్నారు. దీనికి తెలంగాణ ప్రాంత పార్టీ నాయకులు కొందరు సహకరిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పండుగ పూట పంచాయతీ మర్మం?

పవన్ కల్యాణ్ తెలంగాణలో నవనిర్మాణం పేరుతో మీటింగ్ పెట్టుకోవడం, దానికి రాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరించడం, ఆయన కోర్టును ఆశ్రయించినప్పటికీ అనుమతి దక్కకపోవడంతో మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ పరిణామాలిప్పుడు తెలంగాణ ప్రజల్లో చర్చను రేపాయి. గతంలో పవన్ తెలంగాణ ఏర్పాటు సందర్భంలో ఇటీవల కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలు పక్కనపెడితే, మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. జాతీయ వాదం పేరుతో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వాన్ని ఆయన వేర్పాటువాదంగా అభివర్ణించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం ఆంధ్రవారిని ఎన్నో పర్యాయాలు తిట్టారని, ఇక సహించేది లేదంటూ, వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేస్తానంటూ ప్రకటించడం గమనార్హం. తెలంగాణ మీ జాగీరా? అంటూ ప్రాంతీయ ఆత్మగౌరవం పై ఆయన సూటిగానే దాడికి దిగారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పండుగవాతావరణాన్ని దెబ్బతీయడంగా తెలంగాణవాదులు భావిస్తున్నారు. ఇదంతా ప్రణాళిక ప్రకారమే చేశారనే విమర్శలు తెలంగాణవాదులు చేస్తుండగా, మంత్రి పొన్నం, అద్దంకి దయాకర్, అనిరుధ్రెడ్డి పవన్ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముమ్మాటికి తెలంగాణ మా అయ్యజాగీరే అంటూ తీవ్రంగా ప్రతిస్పందించారు. పవన్ వెనుక బీజేపీ, బీఆర్ఎస్ హస్తం ఉండి ఉంటుందని విమర్శించారు. పవన్ వ్యహరం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ మీటింగ్ కు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం అప్రజాస్వామికమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఎంపీ రఘునందన్రావులు విమర్శించారు. అర్బన్ నక్సలైట్లకు, వివిధ పార్టీలకు అనుమతినిస్తున్న ప్రభుత్వం పవన్ సభకు ఎందుకు పర్మిషన్ నిరాకరించరంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు పవన్ కు మద్ధతుగా నిలిచారనే అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తమవుతోంది. తెలంగాణలో నెలకొన్న సమస్యల నుంచి పక్కదోవపట్టించేందుకు కాంగ్రెస్, పవన్ కలిసి నాటకమాడుతున్నారంటూ బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎన్నో యేళ్ళ కల సాకారమైన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీలు తమ రాజకీయ రచ్చకు వేదికగా మార్చారనే ఆవేదన తెలంగాణవాదుల్లో వ్యక్తమవుతోంది.

Latest News