IRS Officers VRS | పదేళ్ల బీజేపీ పాలనలో ఐఆర్ఎస్‌ల వీఆర్ఎస్
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇండియన్ రెవెన్యూ సర్వీసు (ఐఆర్ఎస్) అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారు. పదేళ్ళ బీజేపీ పాలనలో సుమారు 853 మంది ఐఆర్ఎస్ అధికారులు వీఆర్ఎస్ తీసుకోవడం సంచలనం రేపుతోంది

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విధాత):
IRS Officers VRS | దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇండియన్ రెవెన్యూ సర్వీసు (ఐఆర్ఎస్) అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారు. పదేళ్ళ బీజేపీ పాలనలో సుమారు 853 మంది ఐఆర్ఎస్ అధికారులు వీఆర్ఎస్ తీసుకోవడం సంచలనం రేపుతోంది. కొందరు పని ఒత్తిడి, మరికొందరు పన్ను లక్ష్యాలు సాధించలేక తప్పుకుంటుండగా, మిగతావాళ్లు అవినీతి సొమ్మును కాపాడుకునేందుకు బయటకు వస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్‌ల కన్నా ఎక్కువగా ఐఆర్ఎస్‌లే వీఆర్ఎస్ తీసుకుని బయటకు వస్తుండటం గమనార్హం. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఐఏఎస్ ఉంటారు. ఈ పోస్టులో ఐఆర్ఎస్ అధికారిని నియమించాలని కొన్నేళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు. ఇలా బయటకు వచ్చిన వాళ్లలో సమర్థత ఉన్నవాళ్లు కార్పొరేట్ కంపెనీల్లో చేరి కొత్త శిఖరాలు అధిరోహిస్తున్నారు. మరికొందరు ట్యాక్స్ ప్రొఫెషనల్స్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. వీరిలో రెగ్యులర్ రిక్రూటీ, ప్రమోటీ అధికారులు ఉన్నారు.
పట్టణ ప్రాంతాల్లోనే విధులు
సాధారణంగా ఐఆర్ఎస్‌కు ఎంపికైన వారు ఇన్‌కం ట్యాక్స్‌తోపాటు కస్టమ్స్ లో పనిచేయవచ్చు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ, మంత్రుల కార్యాలయాల్లో డిప్యూటేషన్‌పై పనిచేసుకునే వెసులుబాటు కూడా ఉంది. వీరు సర్వీసులో చేరిన దగ్గర నుంచి ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే విధులు నిర్వర్తిస్తారు. పట్టణ ప్రాంతాలు, పోర్టు, ఎయిర్ పోర్టులలో ఎక్కువగా పనిచేస్తారు. రాజీనామాలు, వీఆర్ఎస్ కు ప్రధాన కారణాలు ఆదాయపు పన్ను లక్ష్యాలను సాధించలేకపోవడం అంటున్నారు. దీంతోపై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖలో ఎప్పుడు కూడా నిర్ధేశించుకున్న లక్ష్యాలలో యాభై శాతం ఎప్పుడు కూడా దాటిన సందర్భాలు లేవంటున్నారు. కస్టమ్స్ విభాగంలో పనిచేసే వారు కంపెనీల కేసుల్లో స్వయంగా వాదనలు విన్పించాల్సి ఉంటుంది. వాదనలలో ఏమాత్రం తప్పులు జరిగినా ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో నష్టం వస్తుంది. ఎనిమిది సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమల్లోకి తెచ్చిన తరువాత కార్పొరేట్ కంపెనీల్లో గందరగోళం నెలకొంది. కొత్త చట్టం పట్ల అవగాహన లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ట్యాక్స్ కన్సల్టెంట్లు ఉన్నప్పటికీ, ఆటోమేటెడ్ విధానంపై అవగాహన రావడానికి మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది. ప్రభుత్వంలో వేధింపులు, కార్పొరేట్ కంపెనీల నుంచి ఆఫర్లు రావడం వంటి కారణాల మూలంగా పలువురు స్వచ్ఛందంగా తప్పుకున్నారని అధికవర్గాలు చెబుతున్నాయి. చాలా మంది కార్పొరేట్ కంపెనీల్లో జీఎస్టీ కన్సల్టెంట్లుగా చేరి, మూడింతలకు పైగా జీతాన్ని పొందుతున్నారని అంటున్నారు. మరికొందరు ట్యాక్స్ కన్సల్టెంట్లుగా కార్యాలయాలు తెరుచుకుని సాఫీగా జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల వ్యవధిలో ఆదాయపు పన్ను (ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్)లో పనిచేసే వారు 383 మంది, పరోక్ష పన్నులు (ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్) లో పనిచేసే వారు 470 మంది వరకు వీఆర్ఎస్ తీసుకున్నారని తెలుస్తున్నది.
సీఆర్ఎస్ కూడా
నరేంద్ర మోదీ ప్రభుత్వం బలవంతపు పదవీ విరమణ (సీఆర్ఎస్)ను గట్టిగా అమలు చేస్తున్నది. 2019 సంవత్సరంలో అవినీతి ఆరోపణలు, లైంగిక వేధింపులు, మోసాలకు పాల్పడిన 12 మంది ఐఆర్ఎస్ అధికారులను తొలగిస్తూ అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో ఐటీ చీఫ్ కమిషనర్లు, కమిషనర్లు ఉన్నారు. ఇదే సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు వరకు 39 మంది ఐఆర్ఎస్ అధికారులకు సీఆర్ఎస్ ఇవ్వడం ఐటీ శాఖలో సంచలనం రేపింది. వీరిలో ఒక అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఎలాంటి ఉపశమనం లభించలేదు. గతంలో కేఫ్ కాఫీ డే యజమాని విజీ సిద్ధార్థ ఆత్మత్యకు పాల్పడటం వెనుక ఐటీ అధికారుల వేధింపులే కారణమన్న ఆరోపణలు వచ్చాయి.
122 మంది ఐఏఎస్‌లూ సీఆర్ఎస్
దేశంలో 2020 నుంచి 2023 వరకు 122 మంది ఐఏఎస్ అధికారులకు బలవంతపు పదవీ విరమణ (సీఆర్ఎస్)ను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. సమర్థవంతంగా పనిచేయకపోవడం, బంధుప్రీతి, అవినీతికి పాల్పడం, విజిలెన్స్ కేసులు వంటి కారణాలతో ప్రభుత్వమే సీఆర్ఎస్ అమలు చేస్తోంది. 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో ఒక ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గా (ఏజీఎంయూటీ 1994 బ్యాచ్) తన కుక్కల వాకింగ్ కోసం స్టేడియంలో ప్రాక్టీస్‌కు వచ్చే క్రీడాకారులను నిలిపివేసింది. ఇది కొన్ని నెలల పాటు జరగడం, మీడియాలో వార్త రావడంతో ఆమెకు సీఆర్ఎస్ ఇచ్చేసి ఇంటికి పంపించారు. 2007 నుంచి 2012 వరకు 44 మంది ఐఏఎస్‌లు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2022లో ముగ్గురు, 2023లో ఐదుగురు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వీరిలో కొందరు రాజకీయాలకు వెళ్లగా, మరికొందరు విదేశాలకు వెళ్లి కార్పొరేట్ కంపెనీల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కొందరు అనారోగ్యం కారణం చూపుతూ స్వంత వ్యాపారాలను ప్రారంభించారు.
మూడు నెలల ముందు నోటీసు
నూతన నిబంధనల ప్రకారం ప్రభుత్వ సర్వీసులో కనీసం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసిన వారే స్వచ్ఛంద పదవీ విరమణకు అర్హులు. మూడు నెలల ముందే తమ అధికారికి వీఆర్ఎస్ దరఖాస్తు అందచేయాలి. ఇరవై సంవత్సరాల సర్వీసు పూర్తి కానట్లయితే రాజీనామా సమర్పించాలి. వీఆర్ఎస్ పొందిన వారికి పెన్షన్ సౌకర్యంతో పాటు, కుటుంబ సభ్యులకు సీజీహెచ్ఎస్ ఇస్తారు. ఒక వేళ వీఆర్ఎస్ వద్దనుకుంటే మూడు నెలల వ్యవధిలో దరఖాస్తును వెనక్కి తీసుకునేందుకు అవకాశం కూడా ఉంది.