Vice President Election BRS Strategy | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆరెస్ మద్దతు ఎన్డీయే అభ్యర్థికేనా? కేటీఆర్ వ్యాఖ్యల వెనుక!
తెలంగాణకు చెందిన అభ్యర్ధి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి బరిలోకి దింపినా బీసీ అంశాన్ని లేవనెత్తి రాజకీయంగా ఇండియా కూటమిని ప్రత్యేకించి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి అభ్యర్థికి బీఆరెస్ మద్దతు ఇచ్చే అవకాశాలు లేవని తేలిపోతున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల నాటికి తమ వైఖరిని ప్రకటిస్తామని చెప్పినప్పటికీ.. ఎన్డీయేకు మద్దతు ఇచ్చినట్టయితే.. రెండు పార్టీల అంతర్గత ఒప్పందాలు బయటపడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఓటింగ్‌కు దూరంగా ఉండటమే బీఆరెస్ చేయగల పనిగా ఇప్పటికైతే కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్, ఆగస్ట్ 21 (విధాత) :
Vice President Election BRS Strategy | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆరెస్ వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదంటూనే.. తమ మద్దతు ఎన్డీయే అభ్యర్థికేనని కేటీఆర్ సంకేతాలు ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.. తెలంగాణ రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేసేందుకు సిద్దమని ప్రకటించినవారికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీ బీసీ జపం చేస్తున్నదని వ్యాఖ్యానించిన కేటీఆర్.. ఆ పార్టీకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దింపేందుకు బీసీ అభ్యర్ధి దొరకలేదా? అని ప్రశ్నించారు. ఈ రెండు అంశాలను గమనిస్తే.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ పార్టీ వైఖరిని చెప్పకనే చెప్పిందనే చర్చలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయం నాటికి ఓటింగ్‌కు దూరంగా ఉంటుందా? లేక ఎన్డీయేకు మద్దతు ఇస్తుందా? అనేది బీఆరెస్ తేల్చాల్సి ఉంది. ఒకవేళ ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టయితే.. ఇప్పటి వరకూ బీజేపీపై ఒంటికాలిపై లేస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్న బీఆరెస్.. ఆ పార్టీతో లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకుందనే అప్రదిష్ఠను మూటగట్టుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు రైతుల సమస్యలను లింక్ చేసిన బీఆర్ఎస్
తెలంగాణలో యూరియా అందటం లేదని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రానికి తక్షణంగా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో కేంద్రం నుంచి సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాలేదు. దీంతో రైతులు యూరియా కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సోమ, మంగళవారాల్లో పార్లమెంట్ ఆవరణల్లో కాంగ్రెస్ ఎంపీలు ఇదే అంశంపై ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి తమ రాష్ట్ర కోటా మేరకు యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం ప్రకటించారు. యూరియా సమస్యపై రైతుల ఆందోళనలకు బీఆర్ఎస్ మద్దతిస్తోంది. కేసీఆర్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏళ్లు యూరియా కొరత లేదని కారు పార్టీ గుర్తు చేస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతును యూరియా సరఫరాకు గులాబీ పార్టీ లింక్ చేసింది. రాష్ట్రానికి అవసరమైన 2 లక్షల మెట్రికట్ టన్నుల యూరియాను ఏ పార్టీ సరఫరా చేస్తామని హామీ ఇస్తోందో వారికే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదా కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ యూరియా విషయంలో ఎవరు హామీ ఇస్తే ఆ కూటమి అభ్యర్ధికి తాము మద్దతిస్తామని కేటీఆర్ ప్రకటించారు. వాస్తవానికి యూరియా సరఫరా కేంద్రం చేతుల్లో ఉంది. రాష్ట్రానికి కేటాయించిన యూరియా కూడా సరఫరా చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. కేంద్రంవైపే రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. యూరియా విషయంలో స్పష్టత ఇవ్వాల్సింది కేంద్రమేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ విషయం కేటీఆర్‌కు తెలియదని అనుకోలేమని అంటున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్దీఏ కూటమికి బీఆర్ఎస్ అనుకూలమనే భావన వచ్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీసీ అంశాన్ని తెరపైకి తెచ్చిన కేటీఆర్
తెలంగాణకు చెందిన రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి బీ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఒక విధంగా తెలంగాణ పార్టీగా చెప్పుకొనే బీఆరెస్.. తెలంగాణ బిడ్డ, న్యాయ కోవిదుడు అయిన రిటైర్డ్ జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డికి మద్దతు పలకడానికి అభ్యంతరాలు ఏమీ ఉండాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ.. ఆ ప్రతిపాదన తాను భాగస్వామిగా లేని ఇండియా కూటమి చేయడంతోనే.. తెలంగాణ వ్యక్తి అభ్యర్థిత్వాన్ని సైతం కేటీఆర్ ప్రశ్నించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆయన బదులు బీసీ మేధావి కంచ ఐలయ్యను ఉప రాష్ట్రపతిగా నిలపాల్సిందని కేటీఆర్ మెలిక పెట్టడం విశేషం. బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర కులానికి చెందిన బీ సుదర్శన్ రెడ్డిని ఎందుకు బరిలోకి దింపడమేంటని నిలదీశారు. అదే సమయంలో ఇండియా కూటమి అభ్యర్థిని రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తే తాము కచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు చెందిన అభ్యర్ధి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి బరిలోకి దింపినా బీసీ అంశాన్ని లేవనెత్తి రాజకీయంగా ఇండియా కూటమిని ప్రత్యేకించి కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి అభ్యర్థికి బీఆరెస్ మద్దతు ఇచ్చే అవకాశాలు లేవని తేలిపోతున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల నాటికి తమ వైఖరిని ప్రకటిస్తామని చెప్పినప్పటికీ.. ఎన్డీయేకు మద్దతు ఇచ్చినట్టయితే.. రెండు పార్టీల అంతర్గత ఒప్పందాలు బయటపడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఓటింగ్‌కు దూరంగా ఉండటమే బీఆరెస్ చేయగల పనిగా ఇప్పటికైతే కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Mahesh Babu SSMB 29| టాంజానీయ అడవుల్లో మహేశ్ బాబు మూవీ ఎస్‌ఎస్‌ఎంబీ 29
Viral Video | పెళ్లివేడుకలో నృత్యం చేస్తూ కుప్పకూలిన మహిళ..
GHMC Deputation Corruption | జీహెచ్ఎంసీలో తిష్ఠ వేసిన ‘డిప్యూటేషన్’