Kotha Prabhakar Reddy | ఆయన.. కేసీఆర్‌ను ఇరుకునబెట్టాడా? రేవంత్‌ను సమర్థిస్తున్నాడా?
తొగుట మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రసవత్తర చర్చ నడుస్తున్నది. అసలు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు మాట్లాడుతున్నారా, బీఆర్ఎస్‌ను పరోక్షంగా బదనాం చేస్తున్నారా? అనేది తెలియక రెండు పార్టీల నేతలు తలలు పట్టుకున్నారు. ఏది ఏమైనా కొత్త నర్మగర్భ విమర్శలు అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో, ఇటు కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చనీయాంశమయ్యాయి.

- దుబ్బాక ఎమ్మెల్యే నర్మగర్భ వ్యాఖ్యల వెనుక!
- జుట్టు పీక్కుంటున్న బీఆర్ఎస్ పెద్దలు
(విధాత ప్రత్యేకం)
Kotha Prabhakar Reddy | దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్న తీరును గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్న చర్చలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన తొగుట మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావును ఇరుకునబెట్టేలా, రేవంత్ రెడ్డి సర్కార్‌ను నిలబెట్టేలా మాట్లాడారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తొగుట మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనతో విసుగుచెందిన రియల్టర్లు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కచ్చితంగా ప్రభుత్వాన్ని పడగొట్టాలని అంటున్నారని బాంబు పేల్చారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చునంతా తామే భరిస్తామంటున్నారని అన్నారు. ఇలా వ్యాఖ్యానించిన వెంటనే పిల్లల నుంచి పెద్దల వరకు కాంగ్రెస్ పాలనపై విసుగు చెందారని, గ్రాఫ్ అమాంతం పడిపోయిందని, బీఆర్ఎస్ దరిదాపుల్లో లేదని మాట్లాడటంతో కార్యకర్తలు సైతం కంగుతిన్నారు. అసలు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు మాట్లాడుతున్నారా, బీఆర్ఎస్‌ను పరోక్షంగా బదనాం చేస్తున్నారా? అనేది తెలియక తలలు పట్టుకున్నారు. ఏది ఏమైనా కొత్త నర్మగర్భ విమర్శలు అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో, ఇటు కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చనీయాంశమయ్యాయి.
గతంలో రేవంత్‌ను కీర్తించిన ప్రభాకర్
దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏ ముఖ్యమంత్రీ ఇవ్వని నిధులను రేవంత్ రెడ్డి ఇచ్చారని గతంలో కొత్త ప్రభాకర్ రెడ్డి.. ముఖ్యమంత్రిని అమాంతం పైకెత్తి కీర్తించారు. ఈ నెల మొదటి వారంలో నిధుల మంజూరుపై స్పందిస్తూ.. నియోజకవర్గానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఎక్కువ నిధులు ఇచ్చారని కితాబునిచ్చారు. దీంతో అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారా? అనే చర్చ జరిగింది. ఈ వ్యాఖ్యలతో పార్టీ పెద్ద కేసీఆర్ కంగుతిన్నారు. ఇలా మాట్లాడ్డమేంటని సన్నిహితుల వద్ద కేసీఆర్ ఆరా తీశారు తప్పితే పిలిపించి మందలించే సాహసం చేయలేకపోయారని గుసగుసలాడుకుంటున్నారు. రెండు వారాల వ్యవధిలోనే మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యేలా మాట్లాడడంపై కేసీఆర్ ఏ వైఖరి అవలంబిస్తారో వేచి చూడాలి. వాస్తవానికి కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి టీ హరీశ్‌రావుకు సన్నిహితుడనే ముద్ర ఉంది. ఇద్దరి మధ్య విడదీయలేని విధంగా సత్సంబంధాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. రాజకీయంగానే కాకుండా వ్యాపారపరంగా ఇద్దరూ భాగస్వాములు కూడా. వ్యాపార పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ప్రభాకర్ రెడ్డి నర్మగర్భంగా విమర్శలు చేస్తున్నారని, పార్టీ మారే ఆలోచన లేదని బీఆర్ఎస్ నాయకులు దిద్దుబాటుకు దిగారు.