Musi river । మూసీ ప్ర‌క్షాళ‌న‌పై పాల‌కుల చిత్తశుద్ధి ఎంత‌? మూసీ ప్రక్షాళన కథలు.. పార్ట్‌ 2

గూగుల్ మ్య‌ప్స్‌ ప‌రిశీలిస్తే 2014 త‌రువాత గండిపేట‌కు అతి స‌మీపంలో మూసీలో అనేక విల్లాలు, అపార్ట్ మెంట్లు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇవ‌న్నీ నేత‌ల అండ‌దండ‌ల‌తో జరిగిన అక్ర‌మాలేన‌నే విమర్శలు ఉన్నాయి. పైగా న‌దీ గ‌ర్భంలో మ‌ట్టి పోసి న‌దిని పూడుస్తున్న ఫోటోలు కూడా గూగుల్‌లో క‌నిపిస్తున్నాయంటే ఆక్ర‌మ‌ణ‌లు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. మూసీకి భారీ వ‌ర‌ద‌లు వ‌స్తే ఈ విల్లాల్లో, అపార్ట్ మెంట్ల‌లో నివ‌శించే వారి ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది వేయి డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Musi river । మూసీ ప్ర‌క్షాళ‌న‌పై పాల‌కుల చిత్తశుద్ధి ఎంత‌? మూసీ ప్రక్షాళన కథలు.. పార్ట్‌ 2

(తిప్పన కోటిరెడ్డి)

Musi river । హైద‌రాబాద్‌లో మూసీ (MUSI) ప్ర‌క్షాళ‌న‌, హుస్సేన్ సాగ‌ర్ (Hussain Sagar) ప్ర‌క్షాళ‌న ప్ర‌హాస‌నంగా మారాయి. 44 ఏళ్లుగా మూసీని ప‌రిర‌క్షించాల‌న్న సోయి పాల‌కుల‌కు లేకుండా పోయింది. ఫ‌లితంగా మూసీ క‌బ్జాల‌కు గురి కావ‌డ‌మే కాదు… కాలుష్యపు (pollution) కాసారంగా మారింది. ఇది ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ (Nallagonda) జిల్లా రైతాంగంపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో భూగ‌ర్భ జ‌లాలు (ground water) క‌లుషితమయ్యాయి. ఫ‌లితంగా ఇక్క‌డ పండించిన పంట‌లు ఎవ‌రూ కొన‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

చంద్రబాబు హయాంలో మూసీ నందనవనం ప్రాజెక్టు

కాలుష్య కాసారంగా మారిన మూసీ ప్రక్షాళ‌న కోసం మొద‌టిసారిగా 1997లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) మూసీ నంద‌న వ‌నం ప్రాజెక్టు (Moosi Nandanavanam) తీసుకువ‌చ్చారు. అప్ప‌ట్లో మూసీ నిర్వాసితులు 20 వేల వ‌ర‌కు ఉంటార‌ని అంచ‌నా వేశారు. ఈ మేర‌కు లెక్క‌లు కూడా త‌యారు చేశారు. ఆనాడు చంద్ర‌బాబు నాయుడు చిత్తశుద్ధితో ఆక్ర‌మ‌ణ‌లు (encroachments) తొల‌గించి, నిర్వాసితుల‌కు ప్ర‌త్యామ్నాయం ఏర్పాటు చేసి ఉంటే నేడు క‌బ్జాలు వ‌చ్చేవి కాదు.. అలా చేయ‌కుండా రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి ప‌ర్యావ‌ర‌ణ అంశాల‌ను పూర్తిగా విస్మ‌రించి మూసీని కుదించే విధంగా న‌దీ గ‌ర్భంలో ఒక కాంక్రీట్ కెనాల్ (సెంట్ర‌ల్ చాన‌ల్‌) ను నిర్మించారు. ఈ కాంక్రీట్ కాలువ కాస్త 2000 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌కు కొట్టుకు పోయింది. న‌దిలో ప్ర‌వ‌హించే నీటిని ఒక పిల్ల కాలువ ద్వారా త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించిన నాటి సీఎం చంద్ర‌బాబు తీరే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

వైఎస్‌ హయాంలో సేవ్‌ మూసీ క్యాంపెయిన్‌

2005లో అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి (YS Rajasekhar Reddy) సేవ్ మూసీ క్యాంపెయిన్ (Save MUSI campaign) చేప‌ట్టారు. నేష‌న‌ల్ రివ‌ర్ క‌న్జ‌ర్వేష‌న్ ప్లాన్‌ (ఎన్ ఆర్ సీపీ), జేఎన్ ఎన్ యూ ఆర్ ఎం ల‌నుంచి నిధుల‌ను స‌మీక‌రించి ఈ ప్రాజెక్ట్‌ను చేప‌ట్టింది. దీని కింద ఎస్ టీపీల నిర్మాణం, న‌ది వెంట ప‌ర్యావ‌ర‌ణ‌, వార‌స‌త్వ, అభివృద్ధి మండ‌లాలను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా మూసీలో ర‌బ్బ‌రు డ్యామ్‌(rubber dams)ల‌ను నిర్మించి, బోటింగ్ సౌక‌ర్యం ఏర్పాటు చేస్తామ‌న్నారు. కానీ అత్తాపూర్ వ‌ద్ద ఎస్టీపీ (STP) నిర్మించలేకపోయారు. దీంతో మురుగు నీరు య‌థావిధిగా మూసీలో ప్ర‌వ‌హించింది. ర‌బ్బ‌రు డ్యామ్ వ‌ర‌ద‌ల‌కు కొట్టుకు పోయింది. అలాగే వైఎస్ హ‌యాంలోనే జైకా నిధుల‌తో హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న పనులు చేప‌ట్టారు. కానీ హుస్సేన్ సాగ‌ర్ కూడా శుద్ధి కాలేదు. మురికి కూపంగానే నేటికీ మ‌న‌కు ద‌ర్శ‌నం ఇస్తున్న‌ది.

బీఆరెస్‌ వచ్చాక మూసీ రివర్‌ఫ్రంట్‌

2014లో తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించిన త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన బీఆరెస్ ప్ర‌భుత్వం (BRS government) 2017లో మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్పొరేష‌న్‌(Musi River Front Development Corporation)ను ఏర్పాటు చేసింది.2018లో డ్రోన్ స‌ర్వే పూర్తి చేసింది. 57.5 కిలోమీట‌ర్ల పొడ‌వున స్కైవే (skyway) నిర్మించాల‌ని నిర్ణ‌యించింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. మూసీ డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్పొరేష‌న్ కూడా రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మారింది.

కుదించుకుపోయిన మూసీ

ఆక్ర‌మ‌ణల‌ కార‌ణంగా నీటి వ‌న‌రుల కింద ఉన్న వైశాల్యం 2001 నుంచి 2015 వ‌ర‌కు 11.84 చ‌ద‌రపు కిలోమీట‌ర్ల‌కు త‌గ్గింది. అలాగే మూసీ న‌దీ ప్ర‌వాహం కింద 2001లో 16.62 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల ప్రాంతం 2015 నాటికి 15.32 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల‌కు త‌గ్గింద‌ని ఈపీటీఐఆర్‌ (EPTIR) తెలిపింది. మూసీలోకి ప్ర‌తి రోజు 482.49 ఎమ్ ఎల్ డీల మురుగు నీరు వ‌స్తోంది. కానీ శుద్ది అవుతున్న‌ది కేవ‌లం 94.01 ఎమ్ ఎల్‌డీ మాత్ర‌మేన‌ని, దీంతో మూసీ నీరు శుద్ది కావ‌డం లేద‌ని మ‌రిన్ని మురునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని 2017లోనే కాగ్ నివేదించింది. అయినా పాల‌కులు చిత్త శుద్దితో మూసీ ప్ర‌క్షాళ‌న చేయ‌డానికి ముందుకు రాలేద‌ని ప్ర‌స్తుత ప‌రిస్థితిని ప‌రిశీలిస్తే అర్థం అవుతోంది. మూసీ ప్ర‌క్షాళ‌న కోసం మ‌రో 10 ఎస్టీపీలు నిర్మిస్తేనే నీటిని శుద్ది చేసే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు అంటున్నారు.

80వ దశకం నుంచి పెరిగిన కబ్జాలు

1980 వ ద‌శ‌కం నుంచే హైద‌రాబాద్ లో క‌బ్జాలు పెరిగాయ‌ని తెలుస్తోంది. అప్ప‌టి నుంచి పాల‌కులు క‌బ్జాలను (encroachments) నిరోధించే చ‌ర్యలు తీసుకున్నది శూన్య‌మే.. అందుకే ఏటేటా ఈ క‌బ్జాలు పెరుగుతూనే ఉన్నాయి. వాస్త‌వంగా 1997లో మొద‌టి సారిగా మూసీని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని నిర్ణ‌యించిన‌ప్పుడు అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు క‌బ్జా దారుల‌పై వేటు వేసి ఉంటే నేడు మూసీ క‌బ్జా అయ్యేదే కాదు.. కానీ నాటి నుంచి నేటి వ‌ర‌కు హైద‌రాబాద్‌లో వ‌రుస‌గా రాజకీయ నేత‌లు, అధికారులు కుమ్మ‌క్కై ఆక్ర‌మ‌ణ‌లు ప్రోత్స‌హించిన వారే… అందుకే చెరువులు క‌నుమ‌రుగ‌య్యాయి. మూసీ న‌దిలా కాకుండా కాలువ‌లా త‌యారైంది. గూగుల్ మ్య‌ప్స్‌(Google Maps)ను ప‌రిశీలిస్తే 2014 త‌రువాత గండిపేట‌కు అతి స‌మీపంలో మూసీలో అనేక విల్లాలు, అపార్ట్ మెంట్లు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇవ‌న్నీ నేత‌ల అండ‌దండ‌ల‌తో జరిగిన అక్ర‌మాలేన‌నే విమర్శలు ఉన్నాయి. పైగా న‌దీ గ‌ర్భంలో మ‌ట్టి పోసి న‌దిని పూడుస్తున్న ఫోటోలు కూడా గూగుల్‌లో క‌నిపిస్తున్నాయంటే ఆక్ర‌మ‌ణ‌లు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. మూసీకి భారీ వ‌ర‌ద‌లు వ‌స్తే ఈ విల్లాల్లో, అపార్ట్ మెంట్ల‌లో నివ‌శించే వారి ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది వేయి డాల‌ర్ల ప్ర‌శ్న‌.

 

ఇవి కూడా చదవండి

కాలుష్యం బారి నుంచి మూసీ నదిని ప్రక్షాళన చేయడంలో ఎవరి బాధ్యత ఎంత?

హైడ్రాకు ఇక నుండి హై పవర్స్.. ఆమోదం తెలిపిన గవర్నర్

HYDRA । చెరువుల కబ్జాలు తొలగించాల్సిందే.. కానీ.. హైడ్రాలో అదే అసలు లోపం!