BRS Silver Jubilee | బీఆరెస్‌ సభ కోసం ఎల్కతుర్తి ఎంపిక వెనుక అసలు కారణాలు అవేనా?

గతంలో బీఆర్ఎస్ భారీ సభలను వరంగల్ పట్టణ ప్రాంత పరిధిలో నిర్వహించేది. ఈసారి కూడా పట్టణంతోపాటు పట్టణ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించినప్పటికీ గతానికి భిన్నంగా వరంగల్ పట్టణ శివారు ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు నిర్ణయించారు.

BRS Silver Jubilee | బీఆరెస్‌ సభ కోసం ఎల్కతుర్తి ఎంపిక వెనుక అసలు కారణాలు అవేనా?

BRS Silver Jubilee | బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తొలి నుంచి గులాబీలకు అన్ని విధాలుగా, అటు పోట్ల మధ్య అండగా నిలిచిన వరంగల్ కేంద్రంగా భారీ సభ నిర్వహించాలని పార్టీ అధినేత కేసిఆర్ నిర్ణయించారు. ఇప్పటివరకు ఆ పార్టీ నిర్వహించిన అత్యంత భారీ సభలకు వరంగల్ కేంద్రంగా ఉండటం కూడా మరోసారి ఈ జిల్లాను ఎంచుకోవడానికి కారణమైంది. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నిర్వహించే రెండవ అతిపెద్ద బహిరంగ సభ కావడంతో ఈ సభకు అత్యంత ప్రాధాన్యం లభిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకు నల్లగొండలో తొలి సభ నిర్వహించారు. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పాల్గొన్నారు. ఆ తర్వాత ఎక్కడా బీఆర్ఎస్ భారీ సభ నిర్వహించిన దాఖలాలు లేవు. అప్పటినుంచి కేసీఆర్‌ ఎక్కువగా ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ రజతోత్సవాల వేళ మరోసారి వరంగల్ కేంద్రంగా భారీ సభ ఏర్పాటుకు నిర్ణయించి, రాష్ట్రంలో రాజకీయ చర్చకు పునాదులు వేయాలని ఆ పార్టీ సీరియస్‌గా భావిస్తున్నది.

అనేక ఎత్తుపల్లాలు
బీఆర్ఎస్ ఆవిర్భవించిన ఈ 25 సంవత్సరాల కాలంలో ఆ పార్టీ అనేక ఎత్తు పల్లాలను చవిచూసింది. రాజకీయ ఆటుపోట్లను ఎదుర్కొన్నది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే వజ్రోత్సవ సభ నిర్వహణతో పాటు సక్సెస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ మేరకు ఎల్కతుర్తిలో భారీ సభ నిర్వహించేందుకు నిర్ణయించారు.

వాస్తు, సెంటిమెంటుకు కేసీఆర్‌ ప్రాధాన్యం
గతంలో బీఆర్ఎస్ భారీ సభలను వరంగల్ పట్టణ ప్రాంత పరిధిలో నిర్వహించేది. ఈసారి కూడా పట్టణంతోపాటు పట్టణ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించినప్పటికీ గతానికి భిన్నంగా వరంగల్ పట్టణ శివారు ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు నిర్ణయించారు. గతంలో పార్టీ సభలను నగర పరిధిలో నిర్వహించినప్పటికీ కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని మాత్రం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధి నుంచి ప్రారంభించేవారు. ఈసారి పార్టీ సభ కూడా ఎన్నికల ప్రచారం కొనసాగించే హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉండటం గమనార్హం. దీనికి వరంగల్ నగర పరిధిలో అనుకూలమైన గ్రౌండ్ లభించకపోవడం కారణమా? లేక కేసీఆర్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించే హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం కారణమా అనే చర్చ సాగుతున్నది.

ముందు జాగ్రత్తతో ఎల్కతుర్తి ఎంపిక
కేసీఆర్ ఈ దఫా పార్టీ సభను ఎల్కతుర్తిలో నిర్వహించడానికి వాస్తు కారణమనే చర్చ కొనసాగుతోంది. వాస్తును, జ్యోతిష్యాన్ని కేసీఆర్‌ సీరియస్‌గా నమ్ముతారనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతోపాటు సిద్దిపేట, హుజూరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించేందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎంపిక చేసినట్లు మరో అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేనందువల్ల సభ సక్సెస్‌కు ఎలాంటి ఆటంకాలు తలెత్తకూడదని భావించినట్లు చెబుతున్నారు. సభ విజయవంతానికి ఉన్న మెజారిటీ అవకాశాలను ఆలోచించి వాస్తు ప్రకారం, జన సమీకరణకు అనుకూలంగా ఉన్నందున ముందు జాగ్రత్తగా ఎల్కతుర్తిని ఎంపిక చేసినట్లు చర్చించుకుంటున్నారు.