Musi river । ఎఫ్‌టీఎల్‌ను గుర్తించకపోవడంలో ఆంతర్యం ఏమిటో?
ఓల్డ్ సిటీకి చెందిన బహదూర్‌పుర, కార్వాన్, నాంపల్లి, మలక్ పేట నియోజక వర్గాల పరిధిలో 70 శాతం అక్రమణలున్నాయని, అంబర్ పేట, గోషామహల్, ఎల్ బీనగర్, ఉప్పల్, గండిపేట, రాజేంద్రనగర్‌లలో మరో 30 శాతం ఆక్రమణలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిని తొలగించడానికి ముందుగా ప్రజల్లో అవగాహన కలిగించడంతో పాటు.. వారికి ప్రత్యామ్నాయంగా భూమికి భూమి కానీ, లేదా భూ సేకరణ చట్టం కింద పట్టా భూముల్లో ఉన్నవారికి నష్టపరిహారం భారీగా ఇవ్వడం కానీ చేయాలి.

(తిప్పన కోటిరెడ్డి)
Musi river । చెరువులు, మూసీ నది (Musi river) కబ్జాకు గురవుతున్నాయని గుర్తించినప్పుడే పాలకులు కఠిన చర్యలు (strict action) తీసుకుంటే నేడు ప్రస్తుత దుస్తితి వచ్చేది కాదు.. హైడ్రా (Hydra) ఉనికిలోకి వచ్చేది కాదు. కబ్జాల రోగం ముదిరి పాకాన పడింది. శస్త్ర చికిత్స తప్ప మరో మార్గం లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతల కార్యక్రమం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. గత పాలకులు చెరువులకు పూర్తి నీటి సామర్థ్యం ఫుల్ ట్యాంక్ లెవల్ (Full Tank Level) (ఎఫ్‌టీఎల్), మూసీ నదికి మాగ్జిమమ్ ఫ్లడ్ లెవల్ (MFL)లను గుర్తించలేదు. బఫర్ జోన్‌ను కూడ నిర్ధారించలేదు. దీనికి అనేక కారణాలు చెప్పొచ్చు కానీ. ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఫైనల్ గెజిట్ ఇవ్వకుండా కొంత మంది రాజకీయ నేతలు, అధికారులు కుమ్మక్కై అనుమతులు ఇచ్చే సమయంలో అడ్డగోలుగా మార్పులు చేర్పులు చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే చెరువుల ఎఫ్ టీఎల్ పరిధిలో, నాలాలపైన అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు, కాలనీలు, ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని అంటున్నారు. అందుకే హైడ్రా కూల్చివేతల సమయంలో నిర్వాసితులు తాము అన్ని అనుముతులు చూసుకొనే కొనుగోలు చేశామని, ఇప్పుడు వచ్చి కూల్చి వేస్తే ఎలా అని ప్రశ్నించారు.
శస్త్ర చికిత్సకు ఇష్టం లేని నాయకుడొకరు హైదరాబాద్‌లో చెరువులు ఉపయోగంలో లేవని (ponds are not in use) అంటాడు. పైగా మూసీ నిర్వాసితులను తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తాడు.. మీరెక్కడకు కదల కూడదని చెప్పాడు కూడా. అయితే నగరంలో చిన్న వర్షం వచ్చినా వరద నీరు వెళ్లే దారి లేక రోడ్లపై, కాలనీల్లోకి(colonies), బస్తీల్లోకి నీరు వస్తోంది. దీనిపై ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ నీళ్లు మన ఇండ్లలోకి రాలేదు… మనమే నీరు ఉంటే చోటుకు వెళ్లి నివాసం ఉంటున్నామని చెరువులు, నాలాల కబ్జా గురించి చెప్పాడు. ఇలా చెరువుల కబ్జాలపై రాజకీయం చేస్తున్నారు. నిర్వాసితుల భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, మూసీ నది కబ్జాలపై శస్త్ర చికిత్సకు ఉపక్రమించిన సీఎం రేవంత్ రెడ్డికి మొదట్లో మద్దతు వచ్చినా క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. పైగా హైకోర్టు కూడా పద్ధతులు పాటించడం లేదంటూ ఫైర్ అయింది. అయితే హైడ్రాపై మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. హైడ్రా అక్రమాలు తొలగించాలి కానీ పద్ధతి ఇది కాదని స్పష్టం చేసింది. ఏచర్య చేపట్టినా చట్ట ప్రకారమే వెళ్లాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కబ్జాలను తొలగించడంలో కఠినంగా ఉండాల్సిందే కానీ… ఇక్కడ బాదితులు ఎవరన్నదే అసలు ప్రశ్న. చెరువులు ఆక్రమించి(encroachment), అడ్డగోలుగా అనుమతులు తీసుకొని అపార్ట్ మెంట్లు, విల్లాలు నిర్మించి విక్రయించారు. వాటిని వేతన జీవులు, వ్యాపారస్థులు కొనుగోలు చేసుకున్నారు. తాజాగా హైడ్రా అధికారులు వచ్చి ఇవి చెరువులో ఉన్నాయి కూల్చివేస్తున్నామంటే నష్ట పోతున్నది కొనుగోలుదారులు. వాస్తవంగా దీనిపై లాభపడింది అనుమతులు ఇచ్చిన అవినీతి అధికారులు (corrupt officials), లంచాలు ఇచ్చి అనుమతులు తెచ్చుకొని భవనాలు నిర్మించిన బడా బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వారికి అండగా నిలిచిన రాజకీయ నేతలు. వీటికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా వారి నుంచి నష్టపరిహారం వసూలు చేయకుండా తమను నష్టపరచడం ఏమిటని కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు కారకులైన వారిని ముందు కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అవసరమైతే అధికారులను సర్వీసు నుంచి తొలగించి జైలు పాలు చేయాలని అంటున్నారు. రాజకీయ నేతలు, బిల్డర్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మను రీకవరీ చేయాలన్న డిమాండ్ బాధితుల నుంచి వ్యక్తమవుతోంది.
మూసీ ప్రక్షాళనలో విపక్షాలు రాద్ధాంతం చేయకుండా నిర్వాసితులకు మంచి ప్యాకేజీ అందించేలా చర్యలు తీసుకోవాలన్న వాదన వినిపిస్తోంది. వాస్తవంగా గండి పేట నుంచి నాగోల్ వరకు మూసీకి ఇరువైపులా రివర్ బెడ్, బఫర్ జోన్లలో 11 వేల వరకు నిర్మాణాలున్నాయని, వాటిల్లో అత్యధికంగా ఓల్డ్ సిటీకి చెందిన బహదూర్‌పుర, కార్వాన్, నాంపల్లి, మలక్ పేట నియోజక వర్గాల పరిధిలో 70 శాతం అక్రమణలున్నాయని, అంబర్ పేట, గోషామహల్, ఎల్ బీనగర్, ఉప్పల్, గండిపేట, రాజేంద్రనగర్‌లలో మరో 30 శాతం ఆక్రమణలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిని తొలగించడానికి ముందుగా ప్రజల్లో అవగాహన కలిగించడంతో పాటు.. వారికి ప్రత్యామ్నాయంగా భూమికి భూమి కానీ, లేదా భూ సేకరణ చట్టం కింద పట్టా భూముల్లో ఉన్నవారికి నష్టపరిహారం భారీగా ఇవ్వడం కానీ చేయాలి. ఈ దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను ఇన్వాల్ చేయాల్సి ఉండే.. ఈ మేరకు ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమావేశం నిర్వహించినట్లైతే నేడు ఈ నిరసనలు ఎదుర్కొనే అవసరం ఉండేది కాదు. అలా కాకుండా మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రకటించిన తరువాత నిర్వాసితులు తమను అవమానించారన్న భావనతో ఉన్నట్లు ఈ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఒక నాయకుడన్నారు.
మూసీ నిర్వాసితులకు తమను ఇక్కడి నుంచి తరలించి, తమ భూములపై వ్యాపారాలు చేస్తారన్న సందేహాలున్నాయి. అయితే తమ భూములలో చేసిన అభవృద్దిలో తమకు భాగస్వామ్యం కల్పించాలని కోరుతున్న వారున్నారు. తమకు సమీపంలోనే భూమికి భూమి కావాలనే వారున్నారు. మంచి పరిహారం అందించాలని కోరే వారున్నారు. ఇలా వివిధ రూపాలలో నిర్వాసితుల నుంచి డిమాండ్లు వస్తున్నప్పుడు వారందరితో చర్చించి మెరుగైన పరిహారం అందరి ఆమోద యోగ్యంతో అందిస్తే ఈ ప్రాజెక్ట్‌కు న్యాయ పరంగా కూడా సమస్యలు వచ్చేవి కావని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ మూసీ పరీవాహక ప్రాంతంలో నివశించే పేదలను తరలించ వద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పైగా మూసీ ప్రాజెక్ట్ అభివృద్ధిలో స్థానికులను భాగస్వామ్యం చేయాలని కోరారు. అశోక్ నగర్ నాలాకు కట్టిన విధంగా మూసీకి ఇరువైపు భారీ గోడలను నిర్మించాలని కోరారు. మూసీలో మురుగు జలాలు రాకుండా ఎస్టీపీలు నిర్మించాలన్నారు.
Read also
Musi River । కాలుష్యం బారి నుంచి మూసీ నదిని ప్రక్షాళన చేయడంలో ఎవరి బాధ్యత ఎంత?
Musi river । మూసీ ప్రక్షాళనపై పాలకుల చిత్తశుద్ధి ఎంత? మూసీ ప్రక్షాళన కథలు.. పార్ట్ 2
HYDRA । చెరువుల కబ్జాలు తొలగించాల్సిందే.. కానీ.. హైడ్రాలో అదే అసలు లోపం!