Formula E Race case | కేటీఆర్‌ అరెస్టు తథ్యం! ఇక తేలాల్సింది తేదీయేనా?

తమ విచారణలో సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లారు. తాజాగా కేటీఆర్‌ను ప్రశ్నించడం కూడా ముగియడంతో కేసు తుది దశకు చేరుకున్నది. మూడు రోజుల క్రితం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ బీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తనను అరెస్టు చేయవచ్చని అనుమానం కూడా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Formula E Race case | కేటీఆర్‌ అరెస్టు తథ్యం! ఇక తేలాల్సింది తేదీయేనా?
  • జూలైలో స్థానిక నోటిఫికేషన్‌.. ఆలోపే బీఆరెస్‌ నేత అరెస్ట్‌?
  • ఫార్ములా ఈ రేసు కేసులో పక్కాగా పథకం రచించిన ఏసీబీ!
  • కేటీఆర్‌ ఆదేశంతోనే ఎఫ్‌ఈవోకు నిధుల బదలాయింపు
  • అరవింద్‌కుమార్‌ స్టేట్‌మెంట్‌.. దాని ఆధారంగానే విచారణ
  • బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు మూసుకుపోయిన దారులు!

Formula E Race case | భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కే తారక రామారావు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నదా? ఫార్ములా ఈ రేసు కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో తదుపరి చర్యలపై విచారణ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల మొదటి వారంలో ఇవ్వనున్నందున ఈ లోపే కేటీఆర్‌ను అరెస్టు చేస్తారా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఏది ఏమైనా కేటీఆర్‌ను అరెస్టు చేసి, చర్లపల్లి జైలుకు తరలించడం ఖాయమని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఫార్ములా ఈ రేసులోనే?

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సచివాలయం ఎదురుగా ఫార్ములా ఈ రేసు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రేసు కోసం అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసిందని, ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు నిధులు మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం, నిధుల దుర్వినియోగంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మునిసిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రత్యక్ష పాత్ర ఉందనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్థారణకు వచ్చిన తరువాతే విచారణ జరపాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేసుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు ఆదేశించారు. ఆ తరువాత మునిసిపల్ శాఖ నుంచి అర్వింద్ కుమార్‌ను తప్పించి, ఏమాత్రం ప్రాధాన్యం లేని విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ప్రైవేటు ఏజెన్సీ ప్రతినిధులతో పాటు హెచ్ఎండీఏ కాంట్రాక్టు సీఈ బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్, కేటీఆర్‌లపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఏసీబీతో పాటు ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. రేసు నిర్వహణ అవకాశం దక్కించుకున్న యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్‌కు హెచ్ఎండీఏ నుంచి నిధుల బదలాయింపుపై ఈడీ వివరాలు తీసుకున్నది. ముందస్తు రాష్ట్ర మంత్రి మండలి అనుమతి లేకుండా, ఐటీ శాఖ ఆమోదం లేకుండా విదేశాలకు హెచ్ఎండీఏ నిధులు తరలించినట్లు ప్రాథమిక విచారణలో సుస్పష్టమైంది.

తుది దశకు విచారణ

తమ విచారణలో సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లారు. తాజాగా కేటీఆర్‌ను ప్రశ్నించడం కూడా ముగియడంతో కేసు తుది దశకు చేరుకున్నది. మూడు రోజుల క్రితం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ బీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తనను అరెస్టు చేయవచ్చని అనుమానం కూడా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు పోలీసు కమాండ్ కంట్రోల్ పరిసర ప్రాంతంలో బందోబస్తు పెంచడంతో పాటు నిలోఫర్ కేఫ్‌ను కూడా మూసివేయించడంతో అరెస్టు తథ్యం అని ఊహాగానాలు చెలరేగాయి. అయితే.. 8 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు.. ఆయనను ఇంటికి పంపించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్య నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సమయంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్, ల్యాపీని బుధవారం సాయంత్రం కల్లా (18వ తేదీ జూన్ 2025) తమకు అందచేయాల్సిందిగా ఏసీబీ అధికారులు విచారణ సందర్భంగా కేటీఆర్‌ను ఆదేశించారు. అయితే దీనిపై తన పార్టీ న్యాయ విభాగం ప్రతినిధులతో చర్చించిన తరువాత, ఏసీబీకి మొబైల్ ఫోన్, ల్యాపీ ఇవ్వాల్సిన అవసరం లేదని మంగళవారం మీడియాకు లీకులు ఇచ్చిన విషయం తెలిసిందే. న్యాయ విభాగం సూచనలు పాటిస్తారా? లేదా ఏసీబీ కోరిన విధంగా నిర్ణీత గడువులోపు అందచేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

సెలవు ఎందుకు ఇచ్చారు?

ఇదే కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ విదేశీ పర్యటన వెళ్లేందుకు సెలవు దరఖాస్తును అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపించారు. సెలవు పెట్టిన విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియచేసి, అనుమతి తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదంటున్నారు. కేటీఆర్ విచారణ తరువాత అర్వింద్ కుమార్‌ను విచారణకు పిలవాలని అనుకుంటున్న తరుణంలో, ఆయన విదేశాల్లో ఉన్నారని తెలియడంతో కంగుతిన్నారు. విచారణ జరుగుతున్న తరుణంలో కేసు తీవ్రతను పట్టించుకోకుండా సెలవు ఎలా మంజూరు చేస్తారంటూ ఏసీబీ అధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు సచివాలయంలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న అర్వింద్ కుమార్ ఈ నెల 21వ తేదీన తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. ఇంతకు ముందు జరిగిన విచారణలో అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకే ఎఫ్ఈవోకు నిధులు బదలాయించినట్లు అర్వింద్ కుమార్ ఏసీబీ అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ మేరకు కేటీఆర్ తో జరిగిన చాటింగ్, కాల్ రికార్డును అందచేశారని విశ్వసనీయంగా తెలిసింది. అర్వింద్ కుమార్ స్టేట్ మెంట్ ఆధారంగానే మూడు రోజుల క్రితం జరిగిన విచారణలో సుమారు 8 గంటల పాటు విచారణ జరిపి, పూర్తి వివరాలు సేకరించారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందే ఈడీ అధికారులు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి నిధుల అక్రమ బదిలీపై కేటీఆర్‌ను విచారించిన విషయం తెలిసిందే.

కోర్టులోనూ ఉపశమనం దక్కలేదు

ఇప్పటికే తన విచారణపై, క్రిమినల్ కేసు నమోదుపై సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ కేటీఆర్‌కు ఉపశమనం లభించలేదు. ఆయనకు దారులన్నీ దాదాపు మూసుకుపోయాయని, ఏ క్షణమైనా ఏసీబీ అధికారులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి కేటీఆర్‌ను అదుపులోకి తీసుకోవచ్చని అంటున్నారు. ఆయనతో పాటు అర్వింద్ కుమార్ అరెస్టు కూడా అనివార్యంగా కనిపిస్తున్నదని చెబుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం జూన్ నెలాఖరు లోపు పూర్తి చేయనున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఆ తరువాత జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారని అంటున్నారు.