Avocado Fruits | క‌రువు నేల‌పై ‘అవ‌కాడో’ సాగు.. ఎక‌రానికి రూ. 10 ల‌క్ష‌లు సంపాదిస్తున్న రైతు

Avocado Fruits | క‌రువు( Drought ) క‌రాళ నృత్యం చేస్తున్న నేల‌పై ఓ రైతు అవ‌కాడో( Avocado ) సాగు చేసి.. ఎక‌రానికి రూ. 10 ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు. ఇప్పుడా రైతు ఆ క‌రువు నేల‌( Dry Land )లో ప‌ది మందికి ప్రేర‌ణ‌గా నిలుస్తున్నారు. మ‌రి ఆ రైతు గురించి తెలుసుకోవాలంటే మ‌హారాష్ట్ర‌( Maharashtra ) లోని బీద్( Beed ) జిల్లాకు వెళ్లాల్సిందే.

  • By: raj    weeds    Apr 09, 2025 10:03 AM IST
Avocado Fruits | క‌రువు నేల‌పై ‘అవ‌కాడో’ సాగు.. ఎక‌రానికి రూ. 10 ల‌క్ష‌లు సంపాదిస్తున్న రైతు

Avocado Fruits | భార‌త‌దేశంలో 80 శాతం మంది వ్య‌వ‌సాయం( Agriculture ), దాని అనుబంధ రంగాల‌పైనే ఆధార‌ప‌డి జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. ఇక వ్య‌వ‌సాయం చేసే రైతుల్లో కొంద‌రు లాభాల‌ను పొందితే.. మ‌రికొంద‌రు న‌ష్ట‌పోతుంటారు. ఇందుకు కార‌ణాలు ప్ర‌కృతి విప‌త్తులు( Natural Calamities ) కావొచ్చు.. సాగు నీరంద‌క‌, క‌రెంట్ స‌ర‌ఫ‌రా లేక కావొచ్చు. కానీ కొంత‌మంది రైతులు( Farmers ) ఈ ప్ర‌కృతి విప‌త్తుల‌ను త‌ట్టుకుని లాభ‌సాటి వ్య‌వ‌వ‌సాయం వైపు అడుగులు వేస్తుంటారు. ఆ మాదిరిగానే క‌రువు( Drought ) క‌రాళ నృత్యం చేస్తున్న నేల‌పై ఓ రైతు అవ‌కాడో( Avocado ) సాగు చేసి.. ఎక‌రానికి రూ. 10 ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు. ఇప్పుడా రైతు ఆ క‌రువు నేల‌( Dry Land )లో ప‌ది మందికి ప్రేర‌ణ‌గా నిలుస్తున్నారు. ఆ అన్న‌దాత‌ను ఆద‌ర్శంగా తీసుకుని.. వ్య‌వ‌సాయం వైపు అడుగులు వేస్తున్నారు. మ‌రి ఆ రైతు గురించి తెలుసుకోవాలంటే మ‌హారాష్ట్ర‌( Maharashtra ) లోని బీద్( Beed ) జిల్లాకు వెళ్లాల్సిందే.

బీద్ జిల్లాలో క‌రువు క‌రాళ నృత్యం చేస్తుంటుంది. స‌రైన సాగునీరు లేక వ్య‌వ‌సాయం చేసేందుకు రైతులెవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. అధిక ఉష్ణోగ్ర‌త‌లు( Temperatures ) న‌మోదు కావ‌డం కూడా వ్య‌వ‌సాయం( Agriculture ) చేయ‌క‌పోవ‌డానికి ఒక కార‌ణం. కానీ బీద్ జిల్లాకు చెందిన ప‌ర‌మేశ్వ‌ర్ థోర‌త్( Parameshwar Thorat ).. మొండి ప‌ట్టుద‌ల‌తో క‌రువు నేల‌పై వ్య‌వ‌సాయం చేసి అద్భుతాలు సృష్టించాడు. ఆ ప్రాంతంలో ఎవ‌రూ పండించ‌ని అవ‌కాడో సాగు( Avocado Farming )పై ప‌ర‌మేశ్వ‌ర్ దృష్టి సారించాడు. ఇక త‌న‌కున్న పొలంలో అవ‌కాడో సాగు చేసి.. ఎక‌రానికి రూ. 10 ల‌క్ష‌లు సంపాదిస్తూ అంద‌రికీ ప్రేర‌ణ‌గా నిలిచాడు.

2018లో అవ‌కాడో సాగు ప్రారంభం

2018లో ప‌ర‌మేశ్వ‌ర్ బెంగ‌ళూరు సిటీలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా.. వేడి వాతావ‌ర‌ణంలోనూ సాగు చేయ‌గ‌లిగే అవ‌కాడో గురించి తెలుసుకున్నాడు. ఈ అవ‌కాడో సాగు 45 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ల‌ను కూడా త‌ట్టుకోగ‌ల‌ద‌ని తెలుసుకున్నాడు. బీద్‌లో ఉన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు ఈ సాగు స‌రైన‌ది అని భావించాడు. ఈ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అధిక దిగుబ‌డి కూడా సాధించొచ్చ‌ని భావించి.. అవ‌కాడో సాగుకు శ్రీకారం చుట్టాడు.

నిరుత్సాహ ప‌డ‌కుండా..

బీద్‌లో నేల నాణ్య‌త కూడా అంతంత మాత్ర‌మే. సాగు నీటి కొర‌త కూడా పెద్ద స‌వాల్. అయినా ప‌ర‌మేశ్వ‌ర్ నిరుత్సాహ ప‌డ‌లేదు. త‌న‌కున్న 0.75 ఎక‌రాల‌లో రెండు అడుగుల‌కు ఒక గుంత త‌వ్వాడు. ఆ గుంత‌ల‌ను ఆవు పేడ‌తో నింపాడు. అనంత‌రం అవ‌కాడో మొక్క‌ల‌ను ఆ గుంత‌ల్లో నాటాడు. ఆవు పేడ వ‌ల్ల మొక్క‌లు త్వ‌ర‌గా పెరుగుతాయ‌ని ప‌ర‌మేశ్వ‌ర్ వివ‌రించాడు.

సాగునీటి కొర‌త‌ను అధిగ‌మించి..

సాగు నీటి కొర‌త నేప‌థ్యంలో ప‌ర‌మేశ్వ‌ర్ బిందు సేద్యం(డ్రిప్ ఇరిగేష‌న్) వైపు దృష్టి సారించాడు. నీటి సంర‌క్ష‌ణ కోసం.. దీన్ని ఎంచుకున్నాడు. ఇక మొక్క‌ల వేర్ల‌కు నేరుగా నీటిని అందించేందుకు డ్రిప్ ఇరిగేష‌న్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక వ‌ర్ష‌పు నీటిని నిల్వ చేసేందుకు త‌న‌కున్న పొలంలోనే ఒక చెరువును తవ్వాడు. ఆ నీటిని నిల్వ చేసి ఎండాకాలంలో సాగుకు ఉప‌యోగించాడు. ఇలా నీటిని ఆదా చేయ‌డంతో పాటు ఏడాది పొడ‌వునా సాగునీటికి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేసుకున్న‌ట్లు ప‌ర‌మేశ్వ‌ర్ వివ‌రించాడు.

సేంద్రీయ వ్య‌వ‌సాయం వైపు..

అవ‌కాడో సాగుకు సేంద్రీయ ప‌ద్ధ‌తిని ఎంచుకున్నాడు ప‌ర‌మేశ్వ‌ర్. మొదట్లో ఎరువుల‌ను వినియోగించిన‌ప్ప‌టికీ.. త‌ర్వాత సేంద్రీయ వ్య‌వ‌సాయ ప‌ద్ధతుల‌ను తెలుసుకుని అటువైపు అడుగులేశాడు. సాగు సార‌వంతం కోసం.. పంట దిగుబ‌డి కోసం.. ఆవు పేడ‌ను ఎరువుగా వినియోగించాడు. స‌హ‌జ ప‌ద్ధ‌తుల‌ను ఉప‌యోగించి.. అధిక దిగుబ‌డి సాధించ‌డ‌మే కాకుండా నాణ్య‌త‌తో కూడిన పంట‌ను పండించి విజ‌య‌వంతం అయ్యాడు.

అంటుక‌ట్టే ప్ర‌క్రియ‌తో..

ప‌ర‌మేశ్వ‌ర్ త‌న అవ‌కాడో మొక్క‌ల జీవిత‌కాలాన్ని, దిగుబ‌డిని మెరుగుప‌ర‌చ‌డానికి అంటుక‌ట్ట‌డం ప్రారంభించాడు. అంటుక‌ట్ట‌డంతో మొక్క‌ల జీవిత‌కాలం కూడా పెరుగుతుంది. 2022లో 250 కొత్త మొక్క‌ల‌ను అంటుక‌ట్ట‌డం ద్వారా ఉత్పాద‌క‌త‌ను కూడా పెంపొందించుకోగ‌లిగాడు. అంటుక‌ట్టే ప్ర‌క్రియ‌లో ఒక మొక్క యొక్క వేర్ల‌ను మ‌రో మొక్క యొక్క రెమ్మ‌తో క‌లుపుతారు. దీంతో ఎక్కువ ఫ‌లాల‌ను ఇచ్చే బ‌ల‌మైన మొక్క‌లుగా రూపాంత‌రం చెందుతాయి.

నాలుగేండ్ల త‌ర్వాత ద‌క్కిన ఫ‌లితం..

ఇక ప‌ర‌మేశ్వ‌ర్‌కు తొలిసారిగా 2021 అవ‌కాడో పంట చేతికొచ్చింది. దాదాపు నాలుగేండ్ల త‌ర్వాత తాను ప‌డిన క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కింది. 2022 నాటికి 50 మొక్క‌లు అవ‌కాడో ఫ‌లాల‌ను ఇవ్వ‌డం ప్రారంభించాయి. 2023 నాటికి ప‌ర‌మేశ్వ‌ర్ 1200 కిలోల‌కు పైగా అవ‌కాడో పండ్ల‌ను పండించి.. లాభాలు గ‌డించాడు. ఎక‌రాకు రూ. 10 ల‌క్ష‌లు సంపాదించాడు ప‌ర‌మేశ్వ‌ర్ థోర‌త్. అవ‌కాడో పండ్ల ప్ర‌యోజ‌నాలు తెలుసుకున్న స్థానికులు.. ప‌ర‌మేశ్వ‌ర్ వ‌ద్ద‌నే కొనుగోలు చేయ‌డం ప్రారంభించారు.