Panipuri Vendor | ‘మైండ్ బ్లోయింగ్’ – పానీపూరీ విక్రేత నైపుణ్యం సోషల్ మీడియాలో వైరల్

ఒక పానీపూరీ విక్రేత చేసే అసాధారణ లెక్కలు, మల్టీటాస్కింగ్ నైపుణ్యం సోషల్ మీడియాలో చర్చనీయాంశం. సాధారణ పని వెనక దాగిన ప్రతిభపై నెటిజన్ల ప్రశంసలు.

Panipuri Vendor | ‘మైండ్ బ్లోయింగ్’ – పానీపూరీ విక్రేత నైపుణ్యం సోషల్ మీడియాలో వైరల్

Mind-Blowing Skills: Viral Post Explains Genius of Pani Puri Vendor

హైదరాబాద్, అక్టోబర్ 1: పానీపూరీ అంటే మనందరికీ చిన్ననాటి నుంచి ఇష్టమైన వీధి వంటకం. బండి వద్ద గోలగోలగా గప్​చుప్​లు తింటూ ఆనందిస్తాం కానీ, వేసే అతని నైపుణ్యాన్ని ఎప్పుడైనా గమనించామా? ఇదే ప్రశ్నను ఎక్స్ (X) వేదికపై ముకుల్ దేఖనే అనే వినియోగదారు లేవనెత్తి చేసిన విశ్లేషణ ఇప్పుడు వైరల్‌గా మారింది. “ఒక పానీపూరీ విక్రేత చేసే క్లిష్టమైన ఆలోచన మనల్ని ఆశ్చర్యపరుస్తుంది” అని ఆయన రాసిన మాటలు లక్షలాది మందిని ఆలోచింపజేశాయి.

పానీపూరీ విక్రేత సాధారణ పని వెనకున్న అసాధారణ నైపుణ్యం

ఒక సాయంత్రం పానీపూరీ బండి ముందు ఆరుగురు కస్టమర్లు తమ ఐదో లేదా ఆరో పూరీ తింటూ ఉంటే, కొందరు రెండో ప్లేట్ కోసం అడుగుతారు. ఇదే సమయంలో కొత్త కస్టమర్ వస్తే, విక్రేత ఎప్పుడూ “వెయిట్ చేయండి” అని చెప్పడు. వెంటనే అతన్ని అదే రౌండ్​లోకి కలుపుకుంటాడు. ఈ క్రమంలో,

  • ఎవరు ఎన్ని పూరీలు తిన్నారో గుర్తుంచుకోవాలి
  • ఎవరి తర్వాత ఎవరో వెంటనే గుర్తించాలి
  • కొత్త ప్లేట్లు, రెండో ప్లేట్లు, షేర్డ్ ప్లేట్లు అన్నింటినీ కలగలిపి హ్యాండిల్ చేయాలి
  • “ఎక్కువ కారం కావాలి, తీపి పెంచండి, ఉల్లిపాయ వేయండి, బంగాళదుంప వద్దు, జైన్ స్టైల్, స్వామినారాయణ్ స్టైల్” అన్న రిక్వెస్టులు గుర్తుపెట్టుకోవాలి
  • చట్నీలు, బంగాళదుంప, పానీ అయిపోకుండా సరి చూసుకోవాలి.
  • తక్షణ చెల్లింపులు, ఆలస్యం లేదా ఉద్దెర బాకీలు కూడా మరిచిపోకూడదు
  • రోజు గడవడానికి ఎన్ని ప్లేట్లు అమ్మాలో ముందే లెక్కపెట్టుకోవాలి

ఇది అంతా ఎలాంటి సాంకేతిక సహాయం లేకుండా, ఒక మెదడు  – రెండు చేతులతోనే జరుగుతుందనేది ముకుల్ విశ్లేషణ.

టెక్నాలజీ లేకుండా మనసులోనే లెక్కలు

ముకుల్ రాసినట్టు, “ఇది అంతా ఎక్సెల్ షీట్ లేకుండా, CRM లేకుండా, రిమైండర్ యాప్ లేకుండా జరుగుతోంది. ఒక్క తప్పు జరిగినా, కస్టమర్ వెంటనే గుర్తిస్తాడు.” వైట్ కాలర్ ఉద్యోగాల్లో మనం ఎన్ని టూల్స్, రిమైండర్స్, మీటింగ్స్ మీద ఆధారపడతామో చెపుతూ, పానీపూరీ విక్రేతకు అలాంటి సౌకర్యాలేవీ ఉండవని ఆయన గుర్తు చేశారు. “అతనికి ఇది బయోడాటాలోని నైపుణ్యం కాదు, బతుకుదెరువు” అని ఆయన రాశారు.

సోషల్ మీడియాలో చర్చ

ఈ విశ్లేషణపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.

  • “ఆర్డర్లు తీసుకోవడానికి కాగితం కూడా అవసరం లేని వాళ్లు నిజంగా అద్భుతం” అని ఒకరు రాశారు.
  • “కిరాణా షాపుల్లో కూడా ఇలాగే జరుగుతుంది. బ్లింకిట్, స్విగ్గీ, జేప్టో ఉన్నా, స్థానిక దుకాణాలు ఇంకా నడుస్తున్నాయి” అని మరొకరు వ్యాఖ్యానించారు.
  • “ఎక్స్‌ట్రా పూరీ, ఎక్స్‌ట్రా పానీ కూడా కస్టమర్లకు ఇవ్వాల్సిందే. ఇది ఒక ఆర్ట్” అని ఒక వినియోగదారు రాశారు.
  • కొందరు మాత్రం, “విక్రేతలు తప్పులు చేస్తారు, కారం-తీపి నిష్పత్తి గుర్తుపెట్టుకోలేరు” అని విభేదించారు.
  • ఇంకొకరు హాస్యాస్పదంగా, “అసలు ఒత్తిడి కస్టమర్ పూరీ తినడంలోనే ఉంటుంది. నోట్లో ఒకటి, కటోరీలో ఒకటి, విక్రేత చేతిలో ఇంకొకటి” అని రాశారు.

సాధారణంగా కనిపించే వీధి వృత్తుల వెనక కూడా అసాధారణమైన లెక్కలుంటాయి. multitasking, చురుకుదనం ఉంటుందని ఈ వైరల్ పోస్ట్ మనకు గుర్తు చేసింది. తదుపరి సారి పానీపూరీ తినేటప్పుడు కేవలం రుచిని మాత్రమే కాదు, దాని వెనక ఉన్న మేధస్సును కూడా గుర్తించమని ముకుల్ దేఖనే సందేశం ఇచ్చారు.

ఈ చర్చతో, ఒక సాధారణ పానీపూరీ విక్రేత కూడా తన నైపుణ్యంతో లక్షలాది మందిని ఆలోచింపజేశాడనేది సత్యం.