Tim Friede 200 Snakebites Antivenom | 200కుపైగా పాములతో కాట్లు వేయించుకున్న మనిషి.. ఎందుకు? ఏమిటి? ఎలా?

పాము విషానికి విరుగుడు కనుగొనే ప్రయత్నంలో ఒక ఔత్సాహికుడు రెండు దశాబ్దాల నుంచి 200కుపై విషపూరిత పాము కాట్లు వేయించుకున్నాడు. ఆయన రక్తం నుంచి సేకరించిన యాంటిబాడీస్‌ ప్రమాదకరమైన సర్పాల విషాలకు ఏకైక విరుగుడుగా పనికొస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Tim Friede 200 Snakebites Antivenom | 200కుపైగా పాములతో కాట్లు వేయించుకున్న మనిషి.. ఎందుకు? ఏమిటి? ఎలా?

Tim Friede 200 Snakebites Antivenom | పామును చూస్తేనే హడలెత్తిపోతాం. ఇక అది ఏ రక్త పింజరో, కింగ్‌ కోబ్రానో అయితే చెప్పనక్కర్లేదు! విషపూరితమైన పాము కరిస్తే తక్షణ వైద్యం అందకపోతే జీవుడు గోవింద! ప్రపంచవ్యాప్తంగా పాము కాట్లతో ఏటా 60 వేల నుంచి 80 వేల మంది చనిపోతున్నారు. అనేక మంది గాయపడుతున్నారు. ఈ మరణాలు లేదా, గాయాలు ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాంటివెనమ్‌ ఇంజెక్షన్లపై పెద్ద ఎత్తున పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన పాముల ప్రేమికుడు టిమ్‌ ఫ్రైడ్‌ కొత్త దారిలో వెళ్లాడు. కొన్నేళ్లుగా ఆయన పద్ధతి ప్రకారం 200కుపై వేర్వేరు విషపూరిత జాతుల పాములతో కాట్లు వేయించుకున్నాడు. అంతేకాదు.. ఇంజక్షన్స్‌ ద్వారా కూడా నియంత్రిత పద్దతిలో విషాన్ని తీసుకుని, తన శరీరాన్ని విషానికి అలవాటు చేశాడు. తద్వారా తన రక్తంలో అనేక రకాల పాము కాట్లకు ప్రతిరక్షకాలను (యాంటిబయాటిక్స్‌) పెంచుకున్నాడు. ఈ చర్యలతో ఆయన రక్తం యాంటివెనం ప్రత్యేకతను సంతరించుకుంది. శాస్త్రవేత్తలు టిమ్‌ ఫ్రైడ్‌ రక్తం నమూనాలు తీసుకుని, విషయాన్ని నిరోధించగల యాంటివెనం ప్రతిరక్షకాలను అభివృద్ధి చేశారు. ఫ్రైడ్ రక్తంలో హ్యూమన్‌ యాంటిబాడీస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ఎలాపిడ్‌ న్యూరోటాక్సిన్ల ఉమ్మడి లక్షణాలు లేదా మన శ్వాసను నిలిపివేయగల మాలిక్యూల్స్‌తో సరిపోలాయి. ఈ లక్షణాలు అనేక జాతులకు చెందిన పాములలో కనిపిస్తాయి. ఫ్రైడ్‌ రక్తంలోని యాంటిబాడీస్‌ కోబ్రా, మాంబా, క్రైట్‌ తదితర అత్యంత విషపూరితమైన పాము కాట్లను సైతం తటస్తం చేస్తాయి. సాధారణంగా ప్రతి పాము కాటుకు ప్రత్యేకమైన యాంటివెనమ్‌ వాడాల్సి ఉంటుంది. అయితే.. ఫ్రైడ్‌ రక్తాన్ని ఉపయోగించి అనేక రకాల పాముల విషంతో పోరాడే శక్తిమంతమైన ఒకే యాంటివెనమ్‌ను తయారు చేసేందుకు అవకాశం ఏర్పడింది.

శక్తిమంతమైన యాంటివెనమ్‌ తయారీకి మార్గం!

ఇప్పటికే శాస్త్రవేత్తలు రెండు మానవ ప్రతిరక్షకాలు, వారెస్‌ప్లాడిబ్‌ అనే ఎంజైమ్‌ నిరోధకాన్ని కలిపి, ప్రయోగాత్మకంగా కొత్త ఔషధాన్ని ఉత్పత్తి చేశారు. దీనిని ఎలుకలపై ప్రయోగించగా.. అనేక ప్రాణాంతక పాముల విషాన్ని అవి తట్టుకుని జీవించగలిగాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే మానవుల కోసం అత్యంత సురక్షితమైన, శక్తిమంతమైన యాంటివెనం తయారీకి ఆస్కారం లభించినట్టయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. సైన్స్‌, మెడిసిన్‌ రంగాల్లో అనేక విప్లవాత్మక పద్థతులు ప్రతిపాదనల దశకు వచ్చి ఆగిపోయినవి ఉన్నాయి. ఇది కూడా ఇంకా సార్వత్రికం కాలేదు. అభివృద్ధిలో ఉన్న ప్రస్తుత ఔషధం ఎలాపిడ్‌ విషాలను టార్గెట్‌ చేస్తుంది. ఇవి ప్రధానంగా న్యూరోటాక్సిన్లను కలిగి ఉంటాయి. అయితే.. చాలా విషపూరితమైన పాములు కణజాలం, రక్తాన్ని వేర్వేరు మార్గాల్లో మార్చే విధంగా విషాలను విడుదల చేస్తుంటాయి. దీనితో ఒకే యాంటివెనమ్‌ను ఉపయోగించే అవకాశాలు లేవు. అయితే భవిష్యత్తులో అనేక రకాల విషాలను న్యూట్రలైజ్‌ చేసే సార్వత్రిక (యూనివర్సల్‌) పరిష్కారం కనుగొనేందుకు ఇది దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో మరిన్ని యాంటిబాడీస్‌ను కనుగొనాల్సి ఉంటుంది. అదే సమయంలో వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. పైగా అవి ఆయా వాతావరణాలను తట్టుకుని నిల్వ చేయగలిగినవిగా ఉండాలి. ఒక్కొక్క కేసును పరీక్షిస్తూ పోవాలి.

సంప్రదాయ యాంటివెనమ్‌లతో ఇబ్బందులేంటి?

సంప్రదాయ యాంటివెనమ్‌లు భారీ జంతువులను నిర్దిష్ట విషాలకు ఇమ్యూనైజ్‌ చేసి, జంతు యాంటిబాడీస్‌ను శుద్ధి చేస్తారు. ఒక్కో నిర్దిష్ట యాంటివెనమ్‌ ఒక్కో పాముకు సంబంధించినది అయి ఉంటుంది. తరచూ ఇవి కొందరికి పనిచేయవు. దీంతో హాస్పిటళ్లలో అనేక రకాల యాంటివెనమ్‌ వయల్స్‌ను నిల్వ చేయాల్సి వస్తుంది. దేనికి ఏ విరుగుడు ఇవ్వాలో తక్షణమే గుర్తించాల్సి వస్తుంది. వైద్యులు పాము కాటుకు గురైన వ్యక్తి ప్రాణాలను కాపాడాల్సిన సమయంలో ఇన్ని రకాల యాంటివెనమ్స్‌ ఉండటం సంక్లిష్టంగా మారుతుంది. అయితే.. ఫ్రైడ్‌ నుంచి సేకరించిన యాంటిబాడీస్‌ ప్రపంచంలోని అనేక విషపూరిత సర్పాల కాట్లకు విరుగుడుగా పనిచేస్తుందని ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో తేలింది. అయితే.. వాస్తవానికి పాము కాటు వేసిందంటే.. శరీరంలోకి ఎంత విషం వెళ్లింది? అనే అంశంతోపాటు.. చికిత్సలో ఆలస్యం ఇలా అనేక అంశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

నైతిక ఆందోళనలు

మానవ రక్తం నుంచి యాంటివెనమ్‌ తయారీ విషయంలో నైతిక అంశాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఫ్రైడ్‌ అనుసరిస్తున్న మార్గం అత్యంత ప్రమాదకరమైనదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే మాలిక్యూలర్‌ బ్లూప్రింట్స్‌ ఉన్నందున రాబోయే రోజుల్లో చేసే కృషి లాబొరేటరీలలో తయారు చేసిన యాంటిబాడీస్‌ కాపీలపై ఆధారపడాలి కానీ.. మానవులు స్వయంగా పాముల విషాలకు గురైన వాటి నుంచి కాదని శాస్త్రీయ సమాజం నొక్కి చెబుతున్నది. ఫ్రైడ్‌ అనుసరించిన విజ్ఞానం అత్యంత విలువైనదే అయినప్పటికీ.. అది అతని జీవితానికి ముగింపు పలికే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నది.