Cobra Capital of India | భారతదేశపు కింగ్‌ కోబ్రాల రాజధాని ఎక్కడుందో తెలుసా? చివరి వీడియో చూస్తే చుక్కలే!

అక్కడ రోడ్డుపై నడుస్తూ వెళుతుంటే కింగ్‌ కోబ్రాలు పక్కనే పాకుతూ వెళుతుంటాయి. పొదల్లో నక్కి ఉంటాయి. ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. వైశాల్యం రీత్యా చిన్న ప్రాంతమే అయినప్పటికీ ఇక్కడ పాముల సంఖ్య విపరీతంగా ఉంటుంది. ప్రత్యేకించి కింగ్‌ కోబ్రాల సంఖ్య అత్యధికం. పశ్చిమ కనుమల్లోని అగుంబే గ్రామం.. భారతదేశపు కింగ్‌ కోబ్రా రాజధానిగా ప్రఖ్యాతి పొందుతున్నది.

Cobra Capital of India | భారతదేశపు కింగ్‌ కోబ్రాల రాజధాని ఎక్కడుందో తెలుసా? చివరి వీడియో చూస్తే చుక్కలే!

Cobra Capital of India | పాము! చూస్తే భయపడతాం! వెంటనే నాగరాజా.. ప్రశాతంగా వెళ్లిపో అని దండం పెడతాం. పాములంటే ప్రజల్లో ఉండే భయభక్తులకు ఇది నిదర్శనం. పాములను చంపి, వాటి చర్మాలతో వ్యాపారాలు చేసేవారు కూడా ఉంటారు. సాధారణంగా ఎక్కువ శాతం పాములు విషరహితాలేనని నిపుణులు చెబుతున్నారు. కానీ.. కొందరు భయంతో వాటిని చంపుతుంటారు. కొందరు విషరహితాలని తెలియక చంపుతుంటారు. వాస్తవానికి పాములు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. పంట పొలాలను ఎలుకలు, పందికొక్కుల బారి నుంచి కాపాడుతుంటాయి. అంతేకాదు.. పాములు భారతీయ సంస్కృతిలో ఒక భాగం. పురాణేతిహాసాల్లో పాముల పాత్ర ప్రముఖంగా చెప్పారు. ఇలాంటి పాములకు దేశంలో ఒక రాజధాని ఉందంటే ఆశ్చర్యమే. అందులోనూ అక్కడ కింగ్‌ కోబ్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందుకే దీనిని ఇండియన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ కోబ్రాస్‌ అని పిలుస్తారు.

దీని గురించి తెలుసుకోవాలంటే మనం పశ్చిమ కనుమల్లో పర్వాతాలు, దట్టమైన అడవుల మధ్య భారీ వర్షాలు పడే ఒక చిన్న గ్రామానికి వెళ్లాలి. ఇక్కడ పాములు మనుషుల రోజువారీ నిత్యకృత్యాల్లో ఒకటి. వారు ఆ పాములను గౌరవిస్తారు. వాటితో కలిసిమెలిసి జీవిస్తుంటారు. దాదాపు 71 రకాల జాతుల పాములు ఇక్కడ ఉన్నాయని అంచనా. ఇటీవల శాస్త్రీయ పరిశోధకులు ఇక్కడికి వచ్చి ఆ పాములను దగ్గర నుంచి గమనించారు. స్థానిక నమ్మకాల్లో, జీవావరణంలో ప్రత్యేకించి కింగ్‌ కోబ్రాకు ఉన్న ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తించారు.

ఆ గ్రామం పేరు అగుంబే. దట్టమైన అడవులు, ఎత్తయిన పర్వతాలు, జలపాతాల మధ్య ఉండే కుగ్రామం. ఇక్కడ నిత్యం భారీ వర్షాలు పడుతూ ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశపు చిరపుంజి అని పిలుస్తారు. అంతేకాదు.. ఇక్కడి అద్భుతమైన జీవ వైవిధ్యం, సుందరమైన జలపాతాలు, అరుణవర్ణపు సూర్యాస్తమయాలతో ఖ్యాతి పొందిన ఈ ప్రాంతం.. యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ గుర్తింపు కూడా పొందింది. అందంతా సరే.. మరి ఈ ప్రాంతం ‘కోబ్రా క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఎందుకు పేరు తెచ్చుకుంది? ఎందుకంటే మరే ప్రాంతంలోనూ లేని విధంగా ఇక్కడ వేల సంఖ్యలో కోబ్రాలు తిరుగుతుంటాయి. ఉండటానికి కొన్ని చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ప్రాంతమే అయినా.. ఎంతో జీవ వైవిధ్యం ఉన్నది. అనేక అరుదైన చెట్లు, మొక్కలు, సరీసృపాలు, కప్పలు, ప్రత్యేకించి కోబ్రాలు ఈ ప్రాంతం స్పెషల్‌.

2005లో ప్రముఖ హర్పటాలజిస్ట్‌ (పాముల శాస్త్రవేత్త) రోములస్‌ విటాకర్‌ కర్ణాటకలోని షిమోగా జిల్లాలోని అగుంబే గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ‘అగుంబే రెయిన్‌ఫారెస్ట్‌ రిసెర్చ్‌ స్టేషన్‌’ (Agumbe Rainforest Research Station (ARRS)) ఏర్పాటు చేశారు.  భారతదేశంలో కింగ్‌ కోబ్రాల కదలికలు, జీవన విధానాన్ని సహజవాతావరణంలోనే ట్రాక్‌ చేసేందుకు ఉద్దేశించిన దేశంలోనే తొలి రేడియో టెలిమెట్రీ ప్రాజెక్ట్‌ కావడం విశేషం. అంగుబేలో కింగ్‌ కోబ్రా అంటే.. శాస్త్రీయ పరిశోధనకు మించి.. పవిత్రమైన ప్రాణిగా గుర్తిస్తారు. వారిలో ఆ భక్తిభావమే పాముల సంరక్షణకు దోహదపడుతున్నది. కోబ్రాల రక్షణలో ARRSతో స్థానికులు, అటవీశాఖ, వాలంటీర్లు కలిసి పనిచేస్తున్నారు. ఇళ్లలోకి వచ్చే పాములను సురక్షితంగా పట్టుకుని, అడవిలో విడిచిపెడుతుంటారు. ప్రజలకు, పాములకు మధ్య ఘర్షణను తగ్గించేందుక గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు.