వారం రోజుల్లో వరద నష్టం వివరాలు ఇవ్వండి
రాష్ట్రంలో వరద పరిస్థిని రాష్ట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం అధికారులతో సమీక్షించారు.

- అధికారులను ఆదేశించిన సీఎస్ శాంతికుమారి
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వలన జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. వర్షాలు, వరదల వలన జరిగిన నష్టం అంచనా వేయడం పైమంగళవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ ఓ డీ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, ఇప్పటికీ అనేక జిల్లాల్లో వరదలు, వానలు తగ్గుముఖం పట్టలేదని అన్నారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్ర స్థాయికి పంపి, తగిన జీపీఎస్ కోఆర్డినెట్ లతో సహా సమర్పించాలని తెలిపారు. అదేవిధంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ( SDRF ) లను ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిధులు, సిబ్బంది, పరికరాల వివరాలు వెంటనే సమర్పించాలని అన్నారు. ఈ వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.