Extra marital affairs | వివాహేతర సంబంధాల్లో ‘మునిగి’తేలుతున్న కొందరు ఐఏఎస్‌లు!

రిటైర్మెంట్‌కు దగ్గర ఉన్నామన్న సోయి లేదు.. వయసేంటో.. హోదా ఏంటో ధ్యాస లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఐఏఎస్‌ల అక్రమ సంబంధాలు చర్చనీయాంశం అవుతున్నాయి.

Extra marital affairs | వివాహేతర సంబంధాల్లో ‘మునిగి’తేలుతున్న కొందరు ఐఏఎస్‌లు!

హైదరాబాద్, సెప్టెంబర్‌ 14 (విధాత):

Extra marital affairs | తెలుగు రాష్ట్రాలలో కొందరు ఐఏఎస్ అధికారులకు ఐదు పదుల వయస్సు దాటి మరో నాలుగైదు సంవత్సరాల్లో రిటైర్ అయ్యే సమయంలో యవ్వనపు కోరికలను ఆపుకోలేక ఉరకలేస్తున్నారు. ఎవరేమి అనుకున్నా ఫర్వాలేదనుకుంటూ కట్టుకున్న భార్యలు ఇంట్లో ఉన్నా వివాహేతర సంబంధాలు నిర్లజ్జగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఐదారుగురు ఐఏఎస్‌ల కారణంగా మిగతా అఖిల భారత సర్వీసు అధికారులు సమాజం ముందు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

సచివాలయంలో మహిళా జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం

తెలంగాణ సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి వద్ద పనిచేసే ఒక మహిళా జర్నలిస్టు.. శుక్రవారం బాత్​రూంలు శుభ్రం చేసే హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సదరు అధికారి వేధింపులు తాళలేకే ఆమె ఈ చర్యకు పాల్పడిందని చెబుతున్నారు. ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం నగరంలో ఒక మహిళను ఏపీ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి తన మాట వినడం లేదని, మరొకరితో సన్నిహితంగా ఉంటుందని గోడకేసి కొట్టి చంపిన ఘటన విన్నాం. ఈ ఘటన మరువక ముందే మరో మహిళ బలవన్మరణానికి ప్రయత్నించిన ఘటన వెలుగు చూడటంతో తెలంగాణ సచివాలయం ఉద్యోగులు షాక్ కు గురయ్యారు.

అక్రమ సంబంధాలు–అధికార దుర్వినియోగాలు: వక్రబుద్ధి పోనిచ్చుకోరా?

నైతిక విలువలకు కట్టుబడి సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతున్నా.. కొందరు ఐఏఎస్ లలో వక్రబుద్ధులు పోవడం లేదని పరిశీలకులు అంటున్నారు. మిస్ వరల్డ్–2025 పోటీలు హైదరాబాద్‌లో గత మే నెలలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టి అట్టహాసంగా నిర్వహించింది. ఈ వేడుకల సమయంలో టీవీ చానల్‌లో పనిచేసే ఒక మహిళా జర్నలిస్టుతో సీనియర్ ఐఏఎస్ అధికారికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కలిసి మెలిసి జీవించే స్థాయి వరకు వెళ్లిందని చెబుతున్నారు. వేడుకల తరువాత ఆమెను తన ఆధీనంలోని ఒక ప్రభుత్వ విభాగంలో కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించుకున్నారని తెలుస్తున్నది. నియామకం తరువాత ఆమెను సచివాలయంలోని తన విభాగంలోకి రప్పించుకుని పనిచేయిస్తున్నారని తెలిసింది. భర్త చనిపోవడంతో కుమారుడితో కలిసి ఉంటున్న ఆమెతో కొద్ది రోజులుగా ఆ సీనియర్ ఐఏఎస్​తో సహజీవనం చేస్తున్నారని సమాచారం. ఇద్దరి మధ్య ఏం గొడవలు జరిగాయో, సంబంధాలు ఎలా బెడిసికొట్టాయో తెలియదు కాని ఆమె శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలియగానే సదరు ఐఏఎస్ అధికారి హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నదని తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా ప్రభుత్వంలోని పెద్దలు దాచిపెడుతున్నట్లు సచివాలయంలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసు కేసు నమోదు కాలేదంటున్నారు. నిబంధనల ప్రకారం ఆత్మహత్యాయత్నం చేసుకుని చికిత్స కోసం వచ్చిన మహిళను చేర్పించుకున్న హాస్పిటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ ఐఏఎస్ అధికారి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తన హవా చెలాయిస్తున్నారు. ఆ ఐఏఎస్ సీఎం పేషీలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె కుమారుడి పేరు మీద ట్రస్టు ఏర్పాటు చేయగా, దానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారంటున్నారు.

హత్యకు దారితీసిన ఏపీ సీనియర్ ఐఏఎస్ వివాహేతర సంబంధం

ఈ నెల మొదటి వారంలో ఏపీ సీనియర్ ఐఏఎస్‌ ఘాతుకానికి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం, ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి హైదరాబాద్ లో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అధికారంతో పాటు లెక్కలేనంత సంపద రావడంతో లేని అవలక్షణాలు వచ్చాయి. సొంత భార్యను నిర్లక్ష్యం చేస్తూ మరో మహిళతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. ఏపీ క్యాడర్ అయినప్పటికీ సమయం చిక్కితే వెంటనే హైదరాబాద్ కు వచ్చి ఆమె వద్ద వాలిపోయేవాడని సమాచారం. ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది రోజుల పాటు బయటకు రాలేకపోయిన సదరు అధికారి, తరువాత ఆమెను కలిసిన సందర్భంగా తనలో మార్పు కన్పించడంతో అనుమానించడం మొదలుపెట్టారు. తనతో కాకుండా మరొకరితో సన్నిహితంగా ఉంటుందని ఆగ్రహం ఆపుకోలేని ఆయన ఆ మహిళను బలంగా గోడకు కొట్టారని ఉద్యోగ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. తలకు తీవ్ర గాయాలై రక్తం కారడంతో ఆమెను ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయిందనీ, వెంటనే ఆ ఐఏఎస్​ తన పరపతిని ఉపయోగించి దీనిని ప్రమాదవశాత్తు జరిగినట్టు రికార్డుల్లో మార్చేసారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదు కాకపోవడం కూడా మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది.