Mohanbabu | Soundarya: అస‌లు నిజ‌మిదే! మోహన్ బాబుకు.. సౌందర్య భర్త మద్ధతు!

  • By: sr    actress    Mar 12, 2025 7:19 PM IST
Mohanbabu | Soundarya: అస‌లు నిజ‌మిదే! మోహన్ బాబుకు.. సౌందర్య భర్త మద్ధతు!

Mohanbabu | Soundarya:

విధాత : సినీ నటి సౌందర్య మరణం ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. ఆమె జల్ పల్లి ఎస్టేట్ కోసం నటుడు మోహన్ బాబు పక్కాగా ప్లాన్ చేసి చంపేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఎదురుగట్ల చిట్టిమళ్లు అనే వ్యక్తి చేసిన పోలీస్ ఫిర్యాదు సంచలనం రేపింది. ఈ వివాదంపై సౌందర్య భర్త రఘు స్పందించారు. హైదరాబాద్ లోని జల్ పల్లిలోని సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. మోహన్ బాబుకు మద్దతుగా సౌందర్య భర్త రఘు బహిరంగ లేఖ విడుదల చేశారు.

మోహన్ బాబుతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదన్నారు. సౌందర్య ఆస్తికి సంబంధించి కొన్నిరోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. ఈ వివాదంలో మోహన్ బాబు పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని రఘు చెప్పారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. తన భార్య సౌందర్య ఆస్తులను మోహన్ బాబు చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకోలేదని తేల్చి చెప్పారు. మోహన్ బాబుకు, తమకు మధ్య ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు.

మోహన్ బాబుతో సౌందర్య కుటుంబానికి 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని..తన భార్య, అత్త, బావమరిది మోహన్ బాబు మంచిగా ఉండేవారని తెలిపారు. సౌందర్య మరణించిన తర్వాత కూడా… ఆయనతో తమకు మంచి స్నేహం ఉందని చెప్పారు. మోహన్ బాబును నేను గౌరవిస్తానని.. మేమంతా ఒకే కుటుంబంగా ఉంటామన్నారు. మోహన్ బాబుపై అసత్య వార్తలు వస్తున్న నేపథ్యంలోనే తాను అసలు విషయాలు ఏమిటో చెప్పాలనుకున్నానని తెలిపారు. ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచురించవద్దని కోరారు.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న రఘును 2003లో సౌందర్య పెళ్లి చేసుకున్నారు. 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున సౌందర్య ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుంచి కరీంనగర్ కు బయల్దేరిన వెంటనే హెలికాప్టర్ క్రాష్ అయిన ప్రమాదంలో సౌందర్య, ఆమె సోదరుడు అమర్ దీప్ లు సజీవదహనం అయ్యారు.