Kids Farming Camp | నేటి పిల్లలకు పాలు ప్యాకెట్లలో వస్తాయి.. బియ్యం సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయని మాత్రమే తెలుసు. కానీ వాటి వెనుక అన్నదాతల కష్టం ఎంత ఉంటుందో తెలియదు. అందుకే ఈ గ్యాప్‌ను తగ్గించి రైతు జీవితం ఎలా ఉంటుందో తెలియజేయడానికి తమిళనాడులో ఓ వ్యక్తి ప్రత్యేక ఫామ్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నాడు. తన 14 ఎకరాల పొలంలో పిల్లలను 24 గంటల పాటు రైతుగా మార్చి.. పొలం దున్నడం, కలుపు తీయడం నుంచి పాలు పితకడం వరకు అన్నింటినీ నేర్పిస్తున్నాడు.
పాలు ప్యాకెట్ల నుంచి వస్తాయి.!
తమిళనాడులోని విల్లుపురం జిల్లా రెట్టనై గ్రామానికి చెందిన కిరుబా శంకర్ రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు. కానీ అతని చిన్నతనంలోనే చదువులు, ఉద్యోగాలు అని చెప్పి నగరాలకు వెళ్లిపోవడంతో వ్యవసాయం మానేశారు. అప్పట్నుంచి సిటీలోనే ఉండిపోయారు. ఇక కిరుబా శంకర్ పిల్లలు పుట్టాక వారికి వ్యవసాయం మీద పూర్తిగా అవగాహనే లేకుండా పోయింది. ఒకసారి అతని కుమార్తెను పాలు ఎలా వస్తాయని అడగ్గా.. టెట్రా ప్యాక్‌లో వస్తాయని సమాధానమిచ్చింది. తన బిడ్డ చెప్పిన సమాధానం వినగానే మొదట నవ్వుకున్నప్పటికీ.. అతడిని తీవ్ర ఆలోచనలో పడేసింది.
మనం తినే ఆహారం ఎలా వస్తుందో కూడా తెలుసుకోలేని స్థితిలో పెరుగుతున్నారని బాధపడ్డాడు. ఎలాగైనా భావితరాలకు వ్యవసాయం గురించి అవగాహన ఉండాలని అనుకున్నాడు. అందుకే ముందు తనే మారాలని నిర్ణయించుకుని.. 2011లో తన గ్రామానికి తిరిగొచ్చేశాడు. 30 ఏళ్లుగా నిర్లక్ష్యంగా ఉన్న పొలంలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. వక్సానా ఫార్మ్స్ పేరుతో మొదట ఆరు ఎకరాలతో సాగు మొదలుపెట్టాడు. ఇప్పుడు 14 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడ పంటలు, చెట్లు, పశువులు, నీటి వనరులపై పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణాకేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.
వ్యవసాయ క్షేత్రం కాదు.. పిల్లలకు ప్రత్యక్ష పాఠశాల!
కిరుబా శంకర్ వ్యవసాయ క్షేత్రానికి ఒకసారి కొంతమంది పాఠశాల విద్యార్థులు సందర్శనకు వచ్చారు. పొలాల్లో జరుగుతున్న వ్యవసాయ పనులు చూసి పిల్లలు ఎంతగానో ఆశ్చర్యపోతూ.. ఎన్నెన్నో ప్రశ్నలు అడిగారు. అది చూసిన కిరుబా శంకర్‌కు కొత్త ఆలోచన వచ్చింది. దీంతో తన వ్యవసాయ క్షేత్రాన్ని ప్రత్యేక ఫామ్ క్యాంప్‌గా మార్చాలని భావించాడు. అలా 2021లో ఆలోచన వచ్చినా.. 2022 నుంచి పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేస్తున్నాడు. 24 గంటల పాటు పిల్లలను తన వ్యవసాయ క్షేత్రంలో ఉంచుకుని.. వారిని రైతుల్లా మార్చి వ్యవసాయంపై పూర్తి అవగాహన కల్పిస్తున్నాడు.
రైతు జీవితం ఎలా నేర్పిస్తారు!
ఈ ఫామ్ క్యాంప్ ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. పిల్లలు వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న తర్వాత వారికి వ్యవసాయ జీవన విధానం, భద్రతా నియమాలు, పాల్గొనే కార్యక్రమాల గురించి వివరంగా చెబుతారు. ఆ తర్వాత మొత్తం తన 14 ఎకరాల ఫామ్ చుట్టూ తిప్పుతారు. అక్కడ పంటలు, పశువులు, నీటి నిల్వ వ్యవస్థలు, సాగు పద్ధతుల గురించి వివరించారు. వ్యవసాయం అంటే కేవలం పంట సాగు మాత్రమే కాదని.. ప్రకృతి మొత్తంతో అనుబంధం ఏర్పరచుకోవడమని అర్థమయ్యేలా చూపిస్తారు.
వ్యవసాయ క్షేత్రం చుట్టూ తిరగడం అయ్యాక పిల్లలను నేరుగా పొలంలోని దించుతారు. అక్కడ భూమి దున్నడం, విత్తనాలు వేయడం, కలుపు తీయడం వంటి పనులు చేయిస్తారు. ట్రాక్టర్ ఎక్కించుకుని పొలం దున్నడంతో పాటు, ఎద్దులతో సంప్రదాయ పద్ధతిలో దున్నే విధానాన్ని కూడా వారికి చూపిస్తారు. దీనివల్ల ఎద్దులతో పొలం దున్నడానికి రైతులు ఎంత కష్టపడాల్సి వస్తుందో వారు ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటారు. మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి ఇస్తారు. ఆ సమయంలో ఫామ్‌లో వండిన కూరగాయలతోనే పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తారు. వ్యవసాయంలో విశ్రాంతి కూడా భాగమే అని.. పని మాత్రమే కాదు, ప్రకృతితో సమతుల్యం కూడా పిల్లలు నేర్చుకోవాలని కిరుబా శంకర్ చెబుతుంటారు.
ఇక సాయంత్రం పూట పిల్లలు ఫామ్‌లోని జంతువులతో గడుపుతారు. ఆ ఫామ్‌లో ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాలు, ఒంటెలు వంటి 14 రకాల జంతువులు ఉన్నాయి. వాటికి ఆహారం పెట్టడం, వాటిని సంరక్షించడం వంటివి నేర్పిస్తారు. ఇలా జంతువులకు ఆహారం పెట్టినప్పుడు పిల్లల్లో బాధ్యత పెరుగుతుందని శంకర్ అంటారు.
వ్యవసాయమే కాదు.. ఆటలు కూడా!
ఈ క్యాంప్‌లో కేవలం వ్యవసాయం మాత్రమే కాదు.. పిల్లలకు పాత గ్రామీణ ఆటలను కూడా పరిచయం చేస్తారు. వారితో పాతకాలం ఆటలు ఆడిస్తారు. పూలతో రంగులు తయారు చేయించడం, సహజపదార్థాలతోనే చిత్రాలు వేయించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక సాయంత్రం సమయంలో పిల్లలతో చెరువులో స్విమ్మింగ్ చేయిస్తారు. పంప్‌సెట్ కింద స్నానాలు చేయిస్తారు. ఈ సమయంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొంటారు.
ఇక రాత్రి భోజనానికి కావాల్సిన కూరగాయలను పిల్లలతోనే కట్ చేయిస్తారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి వంట చేస్తారు. తాము కోసిన కూరగాయలతో వంట చేసినప్పుడు పిల్లలకు ఆహారం విలువ అర్థమవుతుందని కిరుబా శంకర్ చెబుతుంటారు. డిన్నర్ తర్వాత పొలంలోనే బహిరంగ ప్రదేశంలో పడుకుంటారు. ఆ సమయంలో పిల్లలకు రకరకాల కథలు చెబుతారు. కుటుంబసభ్యులు తమ అనుభవాలను కూడా ఈ సందర్భంగా పంచుకుంటారు. రెండో రోజు ఉదయం 4.30 గంటలకే పిల్లలను నిద్ర లేపుతారు. రైతుల్లా పశువులకు ఆహారం పెట్టడం, పొలంలో చిన్న చిన్న పనులు చేయిస్తారు.
ఫీజు ఎంతంటే..!
ప్రతి క్యాంప్‌లో గరిష్టంగా 10 మంది పిల్లలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ప్రతి బృందానికి 11 మంది సిబ్బంది సహకారం అందిస్తున్నారు. ఈ 24 గంటల ఫామ్ క్యాంప్‌నకు ఒక్కో పిల్లాడికి రూ.6వేల వరకు చార్జ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పాల్గొనాలంటే ఒక్కొక్కరికి అదనంగా రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, ఈ ఫామ్ క్యాంప్ కేవలం వినోదం కోసం కాదని.. పిల్లలకు ప్రకృతి, ఆహారం, రైతు కష్టం బాధ్యత వంటి విలువలను నేర్పించడమే ప్రధాన లక్ష్యమని కిరుబా శంకర్ చెబుతుంటారు. నేటి పిల్లలే రేపటి తల్లిదండ్రులు. వారు ఆహారం విలువ ఇప్పుడు నేర్చుకుంటనే భవిష్యత్తులో ప్రకృతిని మరింత గౌరవిస్తారని పేర్కొన్నారు.
Read More:
కరువు నేలలో ఆపిల్ సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన మహారాష్ట్ర రైతు!
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి దేశీ ఆవుల పెంపకం.. ఏటా 10 కోట్ల టర్నోవర్ చేస్తున్న టెకీ!
