విధాత:వైకాపా రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు…నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఎక్కడ జగన్ రెడ్డి గారు?నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధంతో అణచివేయలేరు ముఖ్యమంత్రి గారూ! లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భ్రమలు కల్పించి, నేడు వందల ఉద్యోగాలు కూడా ఇవ్వలేని మీ అరాచకపాలన..అక్రమ అరెస్టులతో యువతని అడ్డుకోవాలని చూసినా అసాధ్యమైపోయింది. మీ రెండేళ్ల పాలనలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయం, యువతకి జరిగిన మోసంపై పోరాడేందుకు వివిధ విద్యార్థి, నిరుద్యోగ, యువ సంఘాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితిగా ఏర్పడి, మీ నియంత పాలనపై పోరుబాట పట్టాయి. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమంలో మీ నిర్బంధాలను, అక్రమ అరెస్టులను ఎదురొడ్డి మరీ నిరసన తెలిపిన యువత ఉద్యమస్ఫూర్తిని అభినందిస్తున్నానన్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
కొంతమంది పోలీస్ అధికారులు… అధికార పార్టీ కార్యకర్తల కంటే దిగజారి పనిచేయడం విచారకరం. ఆర్టికల్ 19 ప్రకారం తమకు జరిగిన అన్యాయంపై ప్రజలకు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించింది. దానిని కాలరాసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు?ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో తాడేపల్లి కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం నిరంకుశ పాలనలోనే జరుగుతుంది. నిరుద్యోగ యువత నిరసన తెలిపితే కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని స్వయంగా గుంటూరు ఎస్పీ బెదిరించడం రాష్ట్రంలో అరాచక పాలనకి నిదర్శనం. సీఎం నివాసం వద్ద 144 సెక్షన్ కొనసాగిస్తూ తప్పుచేస్తోన్న పోలీసు యంత్రాంగం, ప్రజలకు నిరసన తెలిపే హక్కే ప్రజలకు లేదని రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని కూడా కాలరాస్తోంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తోన్న కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకూ ..సీఎం జగన్ రెడ్డిలాగే, ఆనాటి ముఖ్యమంత్రులు ఉద్యోగభర్తీ చేయకుంటే ఈ రోజు మీకు ఈ కొలువులు వుండేవా? అని ఆలోచించాలని కోరుతున్నాను. ప్రజాధనం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ, అధికారపార్టీకి ఊడిగం చేయడం మానుకోవాలి. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎంతమందిని గృహనిర్బంధం చేసినా..సీఎం ఇల్లు యువత ముట్టడించింది. ఉద్యోగ పోరాట సమితి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మహోద్యమంగా మారుతుంది. అప్పుడు ఈ పోలీసులు మరో వందింతలు మంది వచ్చినా నిరసనల్ని ఆపలేరు. ముఖ్యమంత్రి తాను విస్మరించిన హామీలను అమలు చేయాలి. ఉద్యోగాల భర్తీకి కొత్త జాబు క్యాలెండర్ విడుదల చెయ్యాలి. అరెస్ట్ చేసిన విద్యార్థి, యువ నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను.