అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతితో కూడిన అధికారిక చిత్రపటాన్ని కేంద్రం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందింది.
అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ మార్చి 28న ప్రత్యేకంగా సమావేశం అయి తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ని సవరించి, 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తింపునిస్తూ సవరణ బిల్లులో చేర్చింది. ఈ నెల 1న లోక్ సభలో, ఆ తర్వాత 2వ తేదీన రాజ్యసభలో వైసీపీ మినహా మిగతా పార్టీలు బిల్లును ఆమోదించాయి. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఆ వెంటనే గెజిట్ విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం-2026గా దానికి చట్టరూపం ఇచ్చారు.
అమరావతి కిందికి సీఆర్‌డీఏ చట్టం కింద నోటిఫై చేసిన ప్రాంతాలన్నీ వస్తాయని చట్టంలో స్పష్టం చేశారు. ఈ అంశంపై భవిష్యత్తులో ఎలాంటి వివాదమూ తలెత్తకుండా తాజా చట్టసవరణలో వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం-2014 కింద నోటిఫై చేసిన రాజధాని ప్రాంతాలన్నీ కలిపి అమరావతి కిందికి వస్తాయని ఇందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇందులో ఏ మార్పుచేర్పులు చేయాలన్నా పార్లమెంటు మాత్రమే చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఏనుగు..వీడియో వైరల్
Road Accident | ట్రక్కు బ్రేకులు ఫెయిల్.. 11 మంది సజీవ దహనం
