ఏపీ కేబినెట్ పొదుపు మంత్రం
దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఏపీ కేబినెట్ కీలక పొదుపు నిర్ణయాలు తీసుకుంది. ‘నాదేశం–నా బాధ్యత’ ప్రచారం, నో వెహికల్ డే, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆమోదం తెలిపింది.
పశ్చిమాసియా పరిణామాలతో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు ఇంధన పొదుపు, ఖర్చులు తగ్గించుకోవాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సైతం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. దేశం మనకెంతో ఇచ్చింది.. దానికి కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చిందంటూ కేబినెట్ భేటీ సందర్బంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలు పాటిద్దామన్నారు. కాన్వాయ్‌లు తగ్గించుకుంటే సరిపోదు.. ఇతర మార్గాలూ కూడా చూడాలన్నారు. ప్రజలు.. బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, ఎలక్ట్రిక్ వాహనాలను ముందు మనమే ప్రోత్సహిద్దాం అని, సౌరశక్తిని పెద్దఎత్తున అందిపుచ్చుకోవాలని సూచించారు. కేబినెట్ భేటీలో ఐఏఎస్ అధికారులపై తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి వివిధ శాఖల కార్యదర్శులు సకాలంలో రాకపోవడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఖర్చుల నియంత్రణ, ఇంధన పొదుపు, వాహన వినియోగం తగ్గింపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కఠినమైన పొదుపు చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేబినెట్ నిర్ణయాలు..
‘నాదేశం – నా బాధ్యత’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు చర్యలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ రోజు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఉపయోగించాలని సూచించింది. ముఖ్యంగా మంత్రులు, అధికారులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలు లేదా సైకిళ్లను వినియోగించేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. మంత్రులు కొన్ని నెలల పాటు విదేశీ పర్యటనలను సైతం రద్దు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.
జిల్లా పర్యటనల్లో కూడా ప్రజాప్రతినిధులు కఠినంగా పొదుపు చర్యలు పాటించాలని నిర్ణయించారు. ఆదర్శంగా నిలిచేందుకు ముఖ్యమంత్రి తన సొంత కాన్వాయ్‌లో ఇప్పటికే 50 శాతం వాహనాలను తగ్గించుకోగా, ఇదే విధానాన్ని అన్ని స్థాయిల్లోని నాయకులు ఆచరణలో పెట్టాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా వీలున్న శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలా ప్రోత్సహంచాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రత 24 నుంచి 27 మధ్య నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
భారత్ నౌకపై దాడి.. ఖండించిన కేంద్రం
మే 15న “ముసలోడికి దసరా పండుగ” మూవీ విడుదల!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram