Handloom Museum | అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం

Handloom Museum | భారతీయ శక్తికి , సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక చేనేతలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమరావతిలో హ్యాండ్లూమ్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Handloom Museum | అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం

జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు
5శాతం జీఎస్టీ చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదే
మగ్గాలకు 200, పవర్లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు
నేతన్న భరోసాతో ఏడాదికి రూ.25 వేలు

Handloom Museum | అమరావతి : భారతీయ శక్తికి , సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక చేనేతలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమరావతిలో హ్యాండ్లూమ్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి నేతన్నలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేతల ఉత్పత్తులని కొనియాడారు. వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ అని గుర్తు చేశారు. ఎన్టీఆర్ నేత కార్మికుల ఉపాధి పలు పథకాలు తెచ్చారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం 55,500 మంది చేనేత కార్మికులకు రూ.2లక్షలు చొప్పున రూ.27కోట్లు రుణాలు ఇచ్చిందని.. 90,765 కుటుంబాలకు 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చామని తెలిపారు. ఆదరణ 3తో మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తామన్నారు. త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు.

చేనేతలకు ఎంత ఇచ్చినా తక్కువే

చేనేత కార్మికులకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందని..50 శాతం పెట్టుబడితో మరమగ్గాలకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టామని చంద్రబాబు తెలిపార. ఈనెల నుంచి చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. తొలిసారిగా 50ఏళ్లకే పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఉచిత విద్యుత్‌ వల్ల 93 వేల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని తెలిపారు. చేనేత కార్మికులు తయారు చేసే బట్టలపై జీఎస్టీ ఐదుశాతం ప్రభుత్వమే భరిస్తోందని తద్వారా రూ.15కోట్లు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేశానని ప్రకటించారు. 5,386 మందికి రూ.5 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. 92,724 మందికి పెన్షన్లు ఇస్తున్నాం.. రూ.546 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. నేతన్న భరోసా కింద అదనంగా రూ.25 వేలు ఇప్పించే బాధ్యత తమదని ఉద్ఘాటించారు. పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లాను చేనేత అడ్వైసరీ‌గా నియమించామని వెల్లడించారు. ప్రముఖ డిజైనర్లను సంప్రదించి వారితో చేనేతలకు మరింత అధునాతన పద్ధతిలో వస్త్రాలను తయారు చేయిస్తామన్నారు. ట్రైస్బలిటీ విధానంతో ప్రపంచం అంతా చేనేతకు ప్రత్యేక గుర్తింపు తెస్తామని తెలిపారు. ఏపీలో వివిధ ప్రాంతంలో క్లస్టర్‌లను ఏర్పాటు చేస్తాం అని, వెంకటగిరి, మంగళగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడల్లో 1374 మందికి పని దొరుకుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్‌, సవిత, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.