ఆగస్ట్ నాటికే ఏపీ అప్పులు 91.50%.. ఏడాది అప్పులు ఆరు నెలలకే పూర్తి

ఇంకా ఆరు నెలలు గడిచేది ఎలా?
విధాత: ఏడాది పొడవునా తీసుకోవాల్సిన అప్పులను పూట గడవడం కోసం ఆంధ్ర ప్రదేశ్ సర్కారు ఆరు నెలల్లోనే పూర్తిగా తీసేసుకున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.54,587.52 కోట్ల రుణాలు తీసుకోవడానికి బడ్జెట్‌లో ప్రొవిజన్ పెట్టుకున్నారు. ఈ మేరకు బడ్జెట్ ఆమోదం కూడా జరిగింది. ఈ బడ్జెట్ రుణాన్ని నెలకు రూ.4,548.96 కోట్ల మేరకు ఏడాది పొడవునా 2024 మార్చి 31 వరకు తీసుకోవాల్సి ఉంటుంది.
కాగా జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు ఆగస్టు నాటికే రూ.53,557.00 కోట్ల రుణం అంటే.. నిర్దేశిత మొత్తంలో 91.50 శాతం తీసుకున్నది. ఈ విషయాన్ని కాగ్ ఆగస్ట్ నివేదికలో స్పష్టం చేసింది. కాగ్ విడుదల చేసిన నివేదికను పరిశీలిస్తే ఆగస్ట్ నాటికి రూ.1,23,541.20 కోట్లు ఖర్చు చేయగా వాస్తవంగా వచ్చిన రెవెన్యూ ఆదాయం రూ.70,330.55 కోట్లు మాత్రమే. దీంతో బండి నడవడం కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా రూ.53,557 కోట్ల అప్పు చేసింది.
ఏపీ బడ్జెట్‌లో ఏడాది పొడవునా రూ.22,316 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేయగా ఆగస్టు నాటికే రెవెన్యూ లోటు రూ.37,326.72 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఇప్పటికే రెవెన్యూ లోటు ఏడాది అంచనాల కంటే అధికంగా ఉండడంతో మరో ఆరు నెలల పాటు ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వహించాలా? అన్న మీమాంసలో ఆర్థిక శాఖ అధికారులు ఉన్నట్లు తెలిసింది. అసలే ఎన్నికల సంవత్సరం.. గడిచేది ఎలాగో మరి!