చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పెద్దలు.. రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు

- ఏపీలో టీడీపీని చంపి బీజేపీ బతకాలనుకుంటోంది
- బీజేపీ ఒక అనకొండ లాంటిది
- జగన్ పార్టీకి భవిష్యత్‌లో ఇదే గతే పడుతుంది
విధాత ప్రతినిధి, శ్రీసత్యసాయిజిల్లా(పుట్టపర్తి): భారతీయ జనతా పార్టీ అనే అనకొండ కోరల్లో చంద్రబాబునాయుడు ఇరుక్కున్నారని, బీజేపీకి, ప్రధానికి, హోంమంత్రికి తెలియకుండా జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసి ఉంటుందని తనతో పాటు ఎవరూ అనుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తిలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఆశీస్సులతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందన్నారు. వారి ఆశీస్సులు లేకుండా ఉంటే ఇవి జరేగేవే కావని తన 40 ఏళ్ల ప్రత్యక్ష రాజకీయ అనుభవంతో చెబుతున్నానన్నారు.
ఏపీలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు తప్ప వైసీపీ, టీడీపీతో సహా అన్ని పార్టీలు బీజేపీకి జీ హూజూర్ అంటున్నాయన్నారు. అన్నిపార్టీలూ బీజేపీ ఆశీస్సుల కోసం సాగిలపడుతున్నారన్నారు. తెలుగుదేశాన్ని బలహీనపర్చడం ద్వారా, ఏపీలో దాని స్పేస్‌ను తాము తీసుకోవచ్చన్నది బీజేపీ వ్యూహమని రఘువీరా వెల్లడించారు. బీజేపీకి ఈ వ్యూహం కొత్తేమీకాదని, చాలా రాష్ట్రాలలో బీజేపీ అనకొండ మాదిరి తిమింగలాలను మింగినట్లు మింగుతున్నారన్నారు. ఒకపార్టీతో స్నేహం చేయడం, మరో పార్టీపై కేసులు పెట్టడం, దాడులు చేయడం, బ్లాక్‌మెయిల్ చేసి ఆ పార్టీలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం బీజేపీకి ఆనవాయితీగా మారిందన్నారు. తమిళనాడుకావొచ్చు, మహారాష్ట్ర కావొచ్చు అనేక రాష్ట్రాలలో అదే జరుగుతోందన్నారు.
బీజేపీ లక్ష్యం ఒకటే, ఎన్టీరామారావు పెట్టిన పార్టీని అదే ఎన్టీరామారావు కూతురును పెద్దగా పెట్టి బలహీనపరచాలనుకుంటోందని, ఈసారి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవాలని, ఓడిపోయాక ఆ పార్టీని బీజేపీ ఆక్రమించుకోవాలనుకుంటోందన్నారు. దీనికోసం వైఎస్ జగన్ భుజాలపై తుపాకీ పెట్టి చంద్రబాబును, టీడీపీని కాల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అదే తుపాకీతో ఇప్పుడున్న పాలకపక్షాన్ని, వైసీపీని కాల్చాలని చూస్తుందని, దానికి కేవలం ఆరు నెలలా, ఏడాదా అన్న సమయం తప్ప కాల్చడం పక్కా అన్నారు రఘువీరారెడ్డి. నాయకులను కాదు, ఏకంగా ప్రభుత్వాలను ప్రభుత్వాలనే కబ్జా చేస్తున్న బీజేపీ కబళించే శక్తిగా మారిందన్నారు. ఈ విధంగా భయపెట్టడం ద్వారా బీజేపీ అండ లేకుండాపోతే మీరు మనలేరు అనే భయం కలిగించి చంద్రబాబు అడిగినన్ని సీట్లు బీజేపీకి ఇచ్చే వ్యూహం కూడా ఉండొచ్చు అని చెప్పారు.
బీజేపీ వలలో చంద్రబాబుపడ్డారని, ఈరోజు టీడీపీని కాల్చడానికి జగన్ బీజేపీకి తన భుజాన్ని ఎందుకు ఇవ్వాలని రఘువీరా ప్రశ్నించారు. ఇన్నాళ్లూ బీజేపీ టిడిపి, వైసీపీని రెండు భుజాల మీద మోస్తూ వచ్చిందని, ఇప్పుడు బరువు దించుకోవడానికి ఒకవైపు ఉన్న టీడీపీని కింద పడేసిందని, నాలుగు అడుగులు నడిచాక రెండో భుజంమీద ఉన్న వైసీపీ బరువును కూడా బీజేపీ తగ్గించుకోవడం ఖాయమన్నారు. ఈ మాత్రం తెలివిలేకుండా జగన్, చంద్రబాబులు వ్యవహరించారన్నారు. ఇప్పుడు సంతోషంగా ఉన్న జగన్ పార్టీకి భవిష్యత్‌లో ఇలాంటి షాక్ తప్పదని రఘువీరా జోస్యం చెప్పారు.
చంద్రబాబునాయుడు అరెస్టుపై టీడీపీ ఎంత ఆందోళన చేసినా, ధర్నాలు తలపెట్టినా జరిగేది ఏమీ లేదన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టుల పరిధిలో ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం కోర్టుల ద్వారానే బయటపడాలని సూచించారు. ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటోందని, దానికోసం తెలుగుదేశం పార్టీని బలి తీసుకోవాలని నిర్ణయించుకుందని తెలిపారు. చంద్రబాబునాయుడు అరెస్టు వెనుక బీజేపీ నేతల ప్రమయం ఉందని ఇప్పటికే వివిధ పార్టీల నేతలు ఆరోపించారు. వామపక్ష నేతలతోపాటు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్, టిడిపి నేత అయ్యన్నపాత్రుడు సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం ఈ అరెస్ట్ తో బీజేపీకి సంబంధం లేదని ఖండించారు.