విధాత:రైతాంగ రక్షణే ధ్యేయంగా కిసాన్ మోర్చా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు పిలుపునిచ్చారు. కిసాన్ మోర్చా రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సమావేశం మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి అధ్వర్యంలో గాంధీనగర్ లోని హెూటల్ ఐలాపురంలో ఆదివారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సోము వీర్రాజు రాష్ట్రంలో రైతాంగం పడుతున్న కష్టాలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యసేకరణ, డబ్బు చెల్లింపులో తీవ్రజాప్యం, యంత్రీకరణ, సూక్ష్మసేద్యం అమలుచేయకపోవడం, రైతులకు సహాయ నిరాకరణ వంటి అంశాలను ప్రస్తావించారు. అన్నదాతకు నష్టపరచడం కష్టం కలిగించడం, సమస్యలు సృష్టించడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. రైతాంగ రక్షణను కిసాన్ మోర్చా బాధ్యతగా తీసుకుని పనిచేయాలని కోరారు. ఆయన ఇంకా ఇలా అన్నారు….
రూ.80 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చుచేస్తున్నామంటున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్ల రైతు బకాయిలు చెల్లించకపోవడం శోచనీయం. మిల్లర్లతో తెదేపా, వైకాపా ప్రభుత్వాలు తాబేదార్లగా వ్యవహరించి రైతులకు అన్యాయం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు, సంచుల కొనుగోలు, రవాణా ఛార్జీల చెల్లింపు వ్యవహారం అంతా బూటకం. కొత్తసంచులు ఇచ్చినట్లు రాసుకుని పాతసంచులే ఇస్తారు. రవాణా ఛార్జీలు ఇచ్చినట్లు రాయించుకుని రూ.500 కోట్ల నుంచి రూ. 600 కోట్లు దోచేసుకుంటున్నారు.
ప్రతి పంట సీజన్లో రైతులు రూ.5 వేల కోట్ల వరకు నష్టపోతున్నారు. వీరితో పాటు ప్రజలు కూడా బియ్యం కొనుగోళ్లలో వేల కోట్లు నష్టపోతున్నారు. రైతుల నుంచి రూ.1,200 లకు ధాన్యాన్ని కొని మార్కెట్లో కిలో రూ.52 లకు అమ్ముతున్నారు. ఇలా ప్రజలు, రైతాంగం నష్టపోతూనే ఉన్నారు. వ్యవసాయశాఖ, పౌరసరఫరా శాఖల అధికారులు, మిల్లర్లతో కుమ్మకై రైతులను దోచేస్తున్నారు. ఒక అధికారి ఒక మంత్రికి రూ.3 కోట్లతో ఇల్లుకట్టిచ్చారు. పప్పుధాన్యాలపై కేంద్రం మద్దతు ధరను పెంచింది. రూ.80 నుంచి రూ.90 అమ్మాల్సిన కందిపప్పును మార్కెట్లో రూ.150కి అమ్ముతున్నారు.
కొన్ని రాష్ట్రాల్లోని రైతులు ఆన్లైన్ మార్కెటింగ్ను ఉపయోగించుకుని తమ పంటను ఎగుమతులు చేసి మంచి లాభాలు చూస్తున్నారు. రైతాంగానికి ఉపయోగపడేలా భూసారపరీక్షలు చేస్తున్నారు. లిక్విడ్ అమ్మోనియా ఇస్తున్నారు. పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలుచేయడం లేదు. రైతుల ఆదాయం పెంచేందుకు వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే దానిపై అసత్యప్రచారం చేస్తున్నారు. రైతులకు రెండేళ్లుగా యంత్రపపరికరాలు ఇవ్వడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ను పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తుంది. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వని బరోసా కేంద్రాలు ఎందుకు ? రైతులను దోచుకోడానికే వీటిని నిర్మించారా? సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా కిసాన్మోర్చా రైతుల్లో అవగాహన కలిగించాలి.
రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు, మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం విప్లవాత్మక మార్పులు తెస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ. 20 వేల కోట్లు ఉన్న వ్యవసాయ బడ్జెట్ను భాజపా ప్రభుత్వం రూ.1.22 లక్షల కోట్లకు పెంచిందన్నారు. కాంగ్రెస్ హయాంలో 2013-14లో రూ.3,70,000 లక్షల కోట్ల విలువైన ధాన్యం సేకరిస్తే మోదీ ప్రభుత్వం రూ.8 లక్షలకు పెంచిందన్నారు. పప్పులు, నూనె గింజల సేకరణకు రూ.1.50 లక్షల టన్నులు కొంటే భాజపా ప్రభుత్వం 70 రెట్లు పెంచిందన్నారు. ఎరువుల కొరత సమస్యను పరిష్కరించిందన్నారు.
రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, మోసపూరిత మార్కెట్ వ్యవస్థ నుంచి బయటకు లాగేలా వ్యవసాయ చట్టాలు చేస్తే ప్రతిపక్షాలు ఈ మంచినిర్ణయాన్ని స్వాగతించక రాజకీయాలు చేసి వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. మిర్చి విత్తనాలు ఎంఆర్పీ కంటే రెండున్నర రెట్లు రైతు భరోసా కేంద్రాల్లో అమ్మడం శోచనీయమన్నారు.
ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల రైతాంగం తీవ్ర అసంతృప్తి కనబరుస్తోందని, కిసాన్ మోర్చా రైతుల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ధాన్య సేకరణకు ప్రభుత్వం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారిమళ్లించి రైతులను వంచిస్తోందన్నారు. కేంద్రం సూక్ష్మవ్యవసాయానికి రూ.500 కోట్లు కేటాయిస్తే, వైకాపా ప్రభుత్వం తన వంతు నిధులు విడుదల చేయలేక రైతులను సమస్యల్లోకి నెట్టిందన్నారు. యంత్రపరికరాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తే ఆ పథకాన్ని నిలిపివేసిందన్నారు. పైగా ఈ పథకాన్ని కేంద్రం అమలుచేయడం లేదని అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర సంక్షేమ పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యతను రైతు సంక్షేమానికి ఇవ్వడం లేదన్నారు. జలవివాదం తెరమీదకు రావడంతో విభజన చట్టానికి అనుగుణంగా నదుల ప్రాజెక్టులను బోర్డు యాజమాన్యాల పరిధిలోకి తీసుకువస్తే దారిపై వివాదాలు సృష్టించడాన్ని మానుకోవాలని హితవు పలికారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చెక్ చెప్పిందన్నారు.
వేదికను కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సురేష్రెడ్డి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణరాజు, భాజపా రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకరీ అలంకరించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.