విధాత:ముఖ్యమంత్రి జగన్ బుదవారం జరపనున్న పోలవరం పర్యటనలో నిర్వాసితుల సౌకర్యాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని, చర్చ జరపాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో పార్టీ బృందం దేవీపట్నంలోని పోలవరం ముంపు మండలాలకు చెంది, గోదావరి వరద వల్ల ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చిన గ్రామాలను మంగళవారం పరిశీలించింది. నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని గ్రామాల్లో రెండురోజుల క్రితం తరలించారని, కొందరిని 2 నెలల క్రితం పంపారని నిర్వాసితులు చెప్పారు. పదేళ్ల క్రితం నిర్మించిన ఈ కాలనీల్లో ఇల్లు సరిగా లేవని, ఆరంగుళాలు ఉండాల్సిన పైకప్పులు 4 అంగుళాలతోనే నిర్మించారని, శ్లాబులు వర్షానికి కారిపోతున్నాయని, కరెంటు, మంచినీటి సదుపాయం లేవని, వర్షం నీటితో మట్టి రోడ్లు బురదగా తయారయ్యాయని, మరుగుదొడ్లు నిర్మించలేదని, విషపురుగులతో ఆవాసం చేయాల్సి వస్తోందని వాపోయారు. రేషన్ సరుకుల కోసం తాము గతంలో ఉన్న గ్రామాలకే వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. వైద్య సదుపాయం కోసం రంపచోడవరం వెళ్లాల్సివస్తోందని చెప్పారు. కొందరు తమకు ఆర్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని, భూమి పట్టాలు ఇవ్వలేదని, ఎన్యూమరేషన్ చేయలేదని తెలిపారు. అధికారులు వచ్చినప్పుడల్లా సమస్యలు తెలుసుకుంటున్నారేగాని పరిష్కరించడం లేదని చెప్పారు. రామాలయం గ్రామంలో నిరాహారదీక్ష చేస్తున్న శిబిరాన్ని పరిశీలించారు. అక్కడ దీక్ష చేస్తూ ఆనారోగ్యంతో ఉన్న వ్యక్తికి తక్షణం వైద్యసదుపాయం అందించాలని అధికారులను కోరారు. దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు చేయించాలని, కనీసం తాత్కాలికంగా అయినా కరెంటు సదుపాయం ఇవ్వాలని, మంచినీటి కోసం చిన్న ట్యాంకును అయినా ఏర్పాటుచేయాలని, వైద్య సదుపాయం అందించాలని ఎమ్మార్వో, ఇతర అధికారులను కోరారు.
అనంతరం మీడియాతో సోమువీర్రాజు మాట్లాడుతూ, గిరిజనులు 7 ఎస్టీ నియోజకవర్గాల్లో జగన్ను ఆయన మాత్రం వారిని ఆదుకోవడం లేదని ఆరోపించారు. పునరావాసం కల్పించిన అనేక కాలనీల్లో ఏ మాత్రం సౌకర్యాలు లేవని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా జీవిస్తారని ఆవేదన చెందారు. ముంపు బాధితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వసతులు కల్పించకపోవడం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎంత పూర్తయితే నిర్వాసితులకు అంతే శాతం ప్యాకేజీ అమలుచేయాలని అన్నారు. ముఖ్యంగా గిరిజనులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలవరం కోసం సర్వస్వం త్యాగం చేసిన వారు ఇలాంటి గుడిసెల్లో ఎందుకుండాలని ప్రశ్నించారు. ఈ నెల 14న పోలవరం పర్యటనకు వచ్చే సిఎం జగన్ ప్రధానంగా నిర్వాసితుల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని, తక్షణం రూ.3 వేల కోట్లు విడుదల చేసి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తర్వాత కేంద్రం నుంచి తీసుకోవచ్చని సూచించారు. పోలవరం ముంపు మండలాలకు చెందిన గిరిజనేతరులకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే నిర్వాసితుల తరపున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. భాజపా ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ,ఎస్టీమోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, తదితరులు బృందంలో ఉన్నారు.