కృష్ణా ప్రాజెక్టులపై బీఆరెస్ అబద్ధాల ప్రచారం: భట్టి విక్రమార్క
కృష్ణా నది ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడానికి మా ప్రభుత్వం అంగీకరించిందంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న భట్టి విక్రమార్క

- హరీశ్‌రావు ఆరోపణల్లో నిజం లేదు
- కేఆర్‌ఎంబీ ప్రతిపాదనలు చర్చల్లోనే ఉన్నాయి
- ప్రాజెక్టుల పేరుతో బీఆరెస్ భారీగా ప్రజాధనం దుర్వినియోగం
- డిప్యూటీ సీఎం భట్టి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ నిప్పులు
విధాత, హైదరాబాద్ : కృష్ణా నది ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడానికి మా ప్రభుత్వం అంగీకరించిందంటూ బీఆరెస్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని, దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణల్లో నిజం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసమని, ప్రాజెక్టుల పేరుతో బీఆరెస్ ప్రభుత్వం చేసిన ప్రజాధనం దుర్వినియోగం చేసి కడుపు తరుక్కు పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావులతో కలిసి వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేఆర్‌ఎంబీకి ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగించడానికి మా ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం చర్చలు జరిపిందని, కేంద్ర ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నాయని, వాటిపై మేము సమాధానం చెప్పలేదన్నారు. కేఆర్‌ఎంబీకి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత సమస్యపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
పదేళ్ల బీఆరెస్ పాలనలో నీటి కేటాయింపుల్లో ఒక్క చుక్క తెలంగాణకు తీసుకురాలేదన్నారు. పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టుకు సైతం సరైన ఫార్మాట్ లో జాతీయ హోదా కోసం అప్లై చెయ్యలేదన్నారు. జాతీయ హోదా స్టేటస్ అనేది దేశంలో ఎక్కడా ఇవ్వలేదని గజేంద్ర సింగ్ షెకావత్ మాతో చెప్పారన్నారు. నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ చేయడం లేదని గత ప్రభుత్వానికి కూడా చెప్పామని షెకావత్ చెప్పడం జరిగిందన్నారు. కృష్ణా వాటర్ గురించి బీఆరెస్ వాళ్లకు మాట్లాడే హక్కు లేదన్నారు. కృష్ణా వాటర్ వాట తగ్గించే పని బీఆరెస్ హయంలోనే జరిగిందన్నారు. రాష్ట్రం అమూల్యమైన సంపద బీఆరెస్ పాలనలో వృధా అయ్యిందన్నారు. కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత సమస్యపై సీఎం రేవంత్ రెడ్డితో తాను ఫోన్‌లో చర్చించానన్నారు. గతంలో బీఆరెస్ ప్రభుత్వం, కేఆర్‌ఎంబీకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు బయటపెట్టాలని సీఎం సూచించారని, గత ప్రభుత్వం చేసిన సంప్రదింపులపై సమీక్ష చేశామన్నారు.
పైసలే కోసమే తప్ప నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదు
రాష్ట్రంలోని ఒక్కో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తుండగా ఏ ప్రాజెక్టు చూసినా పైసల కోసమే తప్ప నీళ్ళ కోసం కాదని తేలిపోతుందన్నారు. . అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగినట్లుగానే ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టులోనూ భారీ అవినీతి జరిగిందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ స్కామ్‌గా సీతారామ ప్రాజెక్టును చెప్పవచ్చన్నారు. ఈ ప్రాజెక్టు గతంలో రాజీవ్ దుమ్ముగూడ, ఇందిరాసాగర్… అని రెండు వేర్వేరుగా ఉండేవన్నారు. ఆ రెండింటినీ మాజీ సీఎం కేసీఆర్ ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారో తెలియడం లేదన్నారు. 1552కోట్లు ఖర్చు చేసే పూర్తయ్యే ప్రాజెక్టులను డిజైన్ మార్చి సీతారామ ప్రాజెక్టు పేరుతో 22వేల 900 కోట్లకు పెంచి భారీ దోపిడికి పాల్పడ్డారన్నారు. గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్ సైతం సీతారామ ప్రాజెక్టుపై అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు.
2014లో బీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి మరో రూ.1400 కోట్ల నుంచి రూ.1500 కోట్లు ఖర్చే చేసి ఉంటే దుమ్ముగూడ, ఇందిరాసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు ఏడాదిలో పూర్తయ్యి 3,32,000 ఎకరాలకు నీరు వచ్చేదన్నారు. కేసీఆర్ చేసిన మార్పుతో పదేళ్లు దాటినా పనులు పూర్తి కాలేదని, మరో రూ.9000 కోట్లు ఖర్చు చేశారని, ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టు వ్యయం పెంచి రూ. 22,900 కోట్లకు పెంచారని, వాటి ఇంట్రెస్ట్ లు, 9వేల కోట్లు పెండింగ్ బిల్స్ ఇరిగేషన్ శాఖపై భారంగా పెట్టారన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులైనా, అధికారులైనా అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తప్పవన్నారు. కేబినెట్ లో చర్చించి వీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటించని అధికారుల పై చర్యలు తీసుకుంటామన్నారు. రెండు మూడు రోజుల్లో తమ మంత్రుల బృందం సీతారామ సాగర్ సందర్శిస్తుందన్నారు.