చిక్కు ల్లో బుద్ధ.. బుచ్చయ్య ! జడ్జీలను దూషించిన కేసులో నోటీసులు

చంద్రబాబు అరెస్ట్.. రిమాండ్ విధింపు పరిణామాలు ఆయనతోబాటు మరికొందరు పార్టీ సానుభూతిపరులను సైతం చిక్కుల్లో పడేస్తోంది. ఆయన్ను స్కిల్ కుంభకోణంలో సీఐడీ అరెస్ట్ చేయగా ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. తెలుగుదేశం అభిమానులు కలలో కూడా ఊహించని పరిణామం జరగడంతో వారంతా షాక్ కే గురయ్యారు.
ఇదిలా ఉండగా ఆ కేసును కొట్టేయాలంటూ హై కోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ను కూడా హైకోర్టు కొట్టేసింది. దీంతో చంద్రబాబు జైల్లో ఉండక తప్పని పరిస్థితి కావడంతో ఈ పరిణామాలు తట్టుకోలేని టిడిపి కార్యకర్తలు.. సోషల్ మీడియా సానుభూతిపరులు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు, ఒక ఏసీబీ న్యాయమూర్తి మీద సోషల్ మీడియాలో విచక్షణా రహితంగా పోస్టులు పెట్టారు. వారి వ్యక్తిత్వాలను కించపరుస్తూ .. బూతులు తిడుతూ పోస్టులు పెట్టడంతో వారు వేదనకు గురయ్యారు.
ఇదే అంశం మీద అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మహ్యం ఏకంగా హైకోర్టుకు ఫిర్యాదు చేసారు. మరోవైపు ఒక న్యాయవాది రాష్ట్రపతికి సైతం లేఖరాసి ఈ విషయాన్నీ వివరించారు. దీంతో అటు రాష్ట్రపతిభవన్ నుంచి ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ వచ్చింది. అలా పోస్టులు పెట్టినవారిమీద చర్యలు తీసుకోవాలని , ఆ వివరాలను మళ్ళీ తమకు వివరించాలని రాష్ట్రపతి భవన్ ఆ లేఖలో చెప్పింది. ఇక ఇటు ఏపీ హైకోర్టు సైతం అలా పోస్టులు పెట్టినవారిమీద చర్యలు తీసుకోవాలని డిజిపిని ఆదేశించింది.
దీంతో ఆ పోస్టులు పెట్టినవారిలో ఇప్పటికే 26 మందిని గుర్తించిన పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. ఆశ్చర్యంగా ఈ లిస్టులో టిడిపి నాయకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న , ఇంకా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. దీంతో వారికి సైతం నోటీసులు ఇస్తున్నారు.
న్యాయవ్యవస్థను కించపరచడం పధ్ధతి కాదన్న విషయాన్ని విస్మరించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ విషయంలో తీవ్రంగా స్పందించి జడ్జీల మీద పోస్టులు పెట్టారు.. ఇప్పుడు ఆ పోస్టులు వారిని చిక్కుల్లో పడేశాయి. వాళ్ళు ఇప్పుడు కేసులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి అవుతుంది.