అన్ని నదులను అనుసంధానం చేస్తా : చంద్రబాబు నాయుడు
నదుల అనుసంధానం ద్వారానే నీటి కొరత లేకుండా ఉండి, వ్యవసాయానికి లాభం కలుగుతుందని నమ్మే వ్యక్తినన్నారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా ను అనుసంధానం చేశామని, రాష్ట్రంలో ఉన్న అన్ని నదులని అనుసంధానం చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ

- అన్ని నదులను అనుసంధానం చేస్తా
- దేశంలో తొలి రాష్ట్రం అవుతుంది
- 2027 డిసెంబర్ కు పోలవరం పూర్తి
- పోలవరం నుంచే ఉత్తరాంధ్రకు నీళ్లు
- పోలవరం, పట్టిసీమపై వైసీపీ నిర్లక్ష్యం
అమరావతి, సెప్టెంబర్ 19 (విధాత) : దేశంలో నదుల అనుసంధానం చేస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుందని చెబితే అప్పటి కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నేతృత్వంలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నదుల అనుసంధానం ద్వారానే నీటి కొరత లేకుండా ఉండి, వ్యవసాయానికి లాభం కలుగుతుందని నమ్మే వ్యక్తినన్నారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా ను అనుసంధానం చేశామని, రాష్ట్రంలో ఉన్న అన్ని నదులని అనుసంధానం చేస్తామని హామీ ఇస్తున్నానన్నారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ చేపడతారు… ఆ తర్వాత గంగా, కావేరిని అనుసంధానించే ప్రక్రియ చేపడతారు. అందుకే దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానాన్ని చేపట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన కొనియాడారు.
ఏడు మండలాలను మోడీ కలిపారు
రాష్ట్రంలో నీటి సమర్ధ నిర్వహణ అంశంపై శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,. ఏడు మండలాలు తెలంగాణాలో ఉండటంతో, పోలవరం ప్రాజెక్ట్ కట్టటం అసాధ్యం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపానన్నారు. జూన్ 2, 2014 లోపు ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వకపోతే పోలవరం కట్టలేం, నేను మా ప్రజలను మోసం చేయలేను, ఏపీలో కలిపితేనే ప్రమాణస్వీకారం చేస్తానని నాడు కోరానన్నారు. మన విజ్ఞప్తిని మన్నించి, ఏడు మండలాలు ఏపీకి ఇచ్చిన మోడీ కి ధన్యవాదాలు తెలిపారు. ఆ నిర్ణయంతోనే పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లిందన్నారు. భూసేకరణ, కాంట్రాక్టుల వివాదాలు, కుడి కాలువ లాంటి సమస్యలను దాటుకుని 2019 నాటికి 72 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశామన్నారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, గేట్లు, కాఫర్ డ్యామ్ పనులు, కుడి కాలువ పనులు వందశాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. 2019-24 మధ్య పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులు 3.84 శాతం మాత్రమేనని ఆయన దెప్పి పొడిచారు. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లిస్తామని స్పష్టం చేశారు. గతంలో రూ.400 కోట్లతో డయాఫ్రం వాల్ ను నిర్మించగా, వైసీపీ అసమర్థ పాలన వల్ల పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకు పోయిందన్నారు. 2025 డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేస్తామన్నారు. పోలవరం ఎడమ కాలువ పనుల్ని రూ. 960 కోట్లతో టెండర్లు పిలిచామని, దీన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లిస్తామన్నారు. కాంట్రాక్టర్ల ను మార్చొద్దని కేంద్ర జలసంఘం చెప్పినా గత వైసీపీ పాలకులు వినకుండా మార్చివేశారని చంద్రబాబు వివరించారు.
పులివెందుల చెరువుకు కూటమి ప్రభుత్వం నీళ్ళే
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 439 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పట్టిసీమ ఎత్తిపోతలను వినియోగించలేదు. పట్టిసీమ ప్రాజెక్ట్ దండగ అని రూపాయి ఖర్చు పెట్టటం అనవసరం అంటూ అహంకారంతో పట్టిసీమని కొన్నేళ్ళు ఆపేసాడన్నారు. కరువు రావటంతో, ప్రజలు తంతారని పట్టిసీమ ద్వారా నీళ్ళు వదిలాడని చంద్రబాబు తెలిపారు. పులివెందుల చెరువుకు కూడా నీటిని కూటమి ప్రభుత్వమే ఇస్తోందన్నారు. హంద్రీనీవాపై ఇప్పటి వరకూ రూ.13 వేల కోట్ల మేర ఖర్చు పెట్టామని, 40 టీఎంసీల మేర నీటిని తరలించుకోవచ్చన్నారు. 468 చెరువులను నింపే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు సభాముఖంగా వెల్లడించారు.
సాగు నీటి పై కూటమి చిత్తశుద్ధి
2014-19 మధ్య – రూ.68,417 కోట్లు (5 ఏళ్ళలో) ఖర్చు చేయగా, 2019-24 మధ్య – కేవలం రూ.28,376 కోట్లు (5 ఏళ్ళలో) వ్యయం చేశారన్నారు. కూటమి ప్రభుత్వ హయాం లో 2024-25 మధ్య – రూ.12,454 కోట్లు (ఏడాదిలో) వెచ్చించామని చంద్రబాబు చెప్పారు.