విధాత:పీలేరు మండలంలోని ప్రభుత్వ పొరంబోకు భూముల్లో జరుగుతున్న ‘రియల్’ దందా నిజమేనంటూ, దీనిపై సమగ్ర విచారణ సమగ్ర విచారణ జరిపించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. లేఖ ప్రతిని మంగళవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం అధికారులకు స్వయంగా అందజేశారు. పీలేరు మండలం ముడుపులవేముల, బోడుమల్లువారిపల్లె, ఎర్రగుంట్లపల్లె, గూడరేవుపల్లె, కాకులారంపల్లె, పంచాయతీల పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ పొరంబోకు భూములు అన్యాక్రాంతమయ్యాయని లేఖలో వెల్లడించారు. పెద్దఎత్తున జరిగిన ప్రభుత్వ భూముల కుంభకోణంలో రియల్టర్లు, అధికారులు, కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం వుందని ఆరోపించారు. ఈ ఆరు పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూములు రూ. వందల కోట్లు ఖరీదు చేసే అత్యంత విలువైనవని లేఖలో తెలిపారు.
ఈ భూముల్లో అక్రమ లే అవుట్లు వేసి విక్రయించారని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ప్రభుత్వ భూములని తెలియక కొనుగోలు చేసి మోసపోయారని వెల్లడించారు. ఈ అక్రమాలు 2009-2014 మధ్య అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనూ, 2014-19 నడుమ టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి వ్యవహరించిన కాలంలోనూ జరిగాయని ఆరోపించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2019-21 మధ్య కూడా పెద్దఎత్తున ప్రభుత్వ భూములను ప్లాట్లు వేసి అమ్ముకున్నారని టీడీపీ నాయకులు ఆరోపించిన విషయాన్ని చింతల తన లేఖలో ప్రస్తావించారు. వాటిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని సీఎంను కోరారు. పీలేరు తహసిల్దారు కార్యాలయంలో రెవిన్యూ రికార్డులను ట్యాంపర్ చేసిన అధికారులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు.స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యేనే విచారణకు కోరిన నేపధ్యంలో సీఎం కార్యాలయం ఎలా స్పందిస్తుందో, ఒకవేళ విచారణకు ఆదేశిస్తే తదుపరి పరిణామాలు ఎలా వుంటాయో వేచి చూడాల్సివుంది.