Chandrababu Reviews Cyclone Montha Situation | మొంథా తుపాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష

మొంథా తుపాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కోస్తా జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Oct 28, 2025, 1:51 pm IST
Read Time: 3 mins
Chandrababu Reviews Cyclone Montha Situation | మొంథా తుపాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: మొంథా తుఫాను ప్రభావంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ నుంచి జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వి.అనిత, పి. నారాయణ, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం తుపాను తీరానికి దగ్గరగా వస్తోందని.. కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ప్రారంభమైందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తదితర తీరప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఉందని నివేదించారు. విశాఖ, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎంకు వివరించారు.

చంద్రబాబు మాట్లాడుతూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. గతంలో వచ్చిన తుపానుల నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను తీరం దాటే కాకినాడ, ఆ పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశాలిచ్చారు. గాలులు, వర్ష తీవ్రతను ముందుగానే అంచనా వేసి అందుకు తగినట్టుగా జాగ్రత్త వహించాలని సూచించారు. సీఎష్ విజయానంద్ మాట్లాడుతూ ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, తుపాన్ ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు.