విధాత:గుంటూరు..ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద క్వారీ గుంతలో ఆదివారం సాయంత్రం గల్లంతైన నలుగురు యువకులను మృత్యువు కబళించిది. అర్థరాత్రి నుంచి సోమవారం ఉదయం తొమ్మిదిన్నర వరకూ విస్తృతంగా గాలించి సిద్ధంశెట్టి వెంకటేష్, ఇగుటూరి వీర శంకర్ రెడ్డి, బిళ్లా సాయిప్రకాష్, లంబు వంశీల మృతదేహాలను ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం బయటకు తీసింది.
ఆటంకాలు ఎదురైనప్పటికీ గుంటూరు ఆర్డీవో భాస్కర్ రెడ్డి, అర్బన్ సౌత్ జోన్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, తహసీల్దార్ ఎం.పూర్ణచంద్రరావు, ఎస్‌ఐ అశోక్‌లు నేతృత్వంలో సిబ్బంది దాదాపుగా 11 గంటల పాటు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపట్టారు. తదనంతరం రుద్ర ట్రస్టు సభ్యుల సహకారంతో ప్రత్యేక వాహనాల్లో మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కు తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరణించిన వారంతా యువకులే కావడంతో వారి అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. వందలాది మంది స్నేహితులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు వారి వెంట నడిచి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు.