జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం

• 20వ తేదీన అన్ని జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతి పత్రాలు• ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చాలి విధాత‌:లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ చెప్పిన మాటలు నమ్మిన నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ లో చూపించిన ఖాళీలతో మోసపోయింది. గత రెండేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం, అందుకు సంబంధించిన పోటీ పరీక్షల కోసం యువతీయువకులు ఎన్నో కష్టాలను ఓర్చుకొని సిద్ధమవుతున్నారు. సుమారు 30 లక్షల మంది […]

  • Publish Date - July 16, 2021 / 11:32 AM IST

20వ తేదీన అన్ని జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతి పత్రాలు
• ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను జాబ్ క్యాలెండర్ లో చేర్చాలి

విధాత‌:లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ చెప్పిన మాటలు నమ్మిన నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ లో చూపించిన ఖాళీలతో మోసపోయింది. గత రెండేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం, అందుకు సంబంధించిన పోటీ పరీక్షల కోసం యువతీయువకులు ఎన్నో కష్టాలను ఓర్చుకొని సిద్ధమవుతున్నారు. సుమారు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చివరకు జాబ్ క్యాలెండర్లో 10వేల ఉద్యోగాలను మాత్రమే చూపడం కచ్చితంగా యువతను వంచించడమే. వీరి ఆందోళనకు జనసేన పార్టీ బాసటగా నిలుస్తుంది. ఇందులో భాగంగా తొలుత ఈ నెల 20వ తేదీన అన్ని జిల్లాల్లో జనసేన నాయకులు, శ్రేణులు నిరుద్యోగ యువతను కలుపుకొని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజిలకు వెళ్ళి కార్యాలయం అధికారులకు నిరుద్యోగుల తరఫున వినతి పత్రాలు అందిస్తారు. జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం పునఃసమీక్షించి ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలతో తాజాగా మరో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.
వెయ్యికిపైగా ఖాళీలు ఉంటే 36 ఉద్యోగాలా?
తాము ఏ విధంగా మోసపోయామో నిరుద్యోగ యువతీయువకులు ఎంతో ఆవేదన చెందుతూ తమ పరిస్థితిని నాకు వివరించారు. కన్నవారు కాయకష్టం చేసి నెలకు ఓ రూ.2 వేలు పంపిస్తే నగరాల్లో చదువుకొంటున్నామని… ఇప్పుడు మొక్కుబడిగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ వల్ల తమకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదని తమ కష్టాలను వారు ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో వివరించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 విభాగాల్లో కేవలం 36 ఖాళీలను మాత్రమే చూపించడం అంటే నిరుద్యోగులను మోసం చేయడమే అని అర్థం అవుతుంది. కొద్ది నెలల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగాల భర్తీపై సమీక్షిస్తే గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో సుమారు వెయ్యి ఖాళీలను గుర్తించారు. జాబ్ క్యాలెండర్లో 36 మాత్రమే ఇవ్వడం ఏమిటి? ఈ 36 ఉద్యోగాలకు సుమారు 20 లక్షల మంది వరకూ పోటీ పడతారని… పోటీ పరీక్ష ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం వస్తుందని… ఈ విధంగా తమ ఆశలను ప్రభుత్వం సొమ్ము చేసుకొంటుందని ఆవేదన చెందారు. అదే విధంగా ఉపాధ్యాయ పోస్టులు వేల కొద్దీ ఖాళీలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చెప్పిన మెగా డీఎస్సీ ఏమైపోయింది? పోలీసు శాఖలో 7వేలకుపైగా ఖాళీల భర్తీ గురించి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భరోసా కలిగించలేదు.
ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి లభించని పరిస్థితి నెలకొంది. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే వాతావరణం లేదు. అలాగే ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణ కూడా సాగటం లేదు. ఫలితంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను మన రాష్ట్ర యువత పొందలేకపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకొన్నవారికీ అడియాసలే మిగిలాయి. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన యువతకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది.