ఒక పామును పట్టుకుంటే..దాని నోట్లోంచి వచ్చిన ఇంకో పాము!

పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంట్లోకి వచ్చిన కింగ్ కోబ్రాను పట్టుకునే సమయంలో దాని నోటి నుంచి మరో చనిపోయిన పాము బయటపడటంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.

ఇంట్లో దూరిన కింగ్ కోబ్రా(గిరినాగు)ను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నంలో దాని నోటి నుంచి మరోపాము బయటకు రావడం స్నేక్ క్యాచర్ తో పాటు స్థానికులను షాక్ కు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా వత్తాడ గ్రామం కింగ్ కోబ్రా ఒకటి ఓ ఇంట్లో అటకపైన దూరింది. ఇంట్లోని వారు పామును గమనించి భయంతో అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు స్నేక్ క్యాచర్ ను తీసుకుని సంఘటన స్థలానికి చేరుకుని ఇంట్లోని అటకపై నుంచి పామును కిందకు రప్పించారు. సంచిలోకి బంధించే క్రమంలో ఆ కింగ్ కోబ్రా నోటి నుంచి అది అప్పటికే మింగేసిన మరో పామును బయటకు కక్కెసింది. మింగబడిన పాము అప్పటికే చనిపోయింది. ఈ తతంగాన్ని చూసిన స్నేక్ క్యాచర్, అటవీ సిబ్బంది, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. నెమ్మదిగా ఆ గిరినాగును బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు.

సాధారణంగా గిరినాగులు జనావాసానికి దూరంగా ఉంటాయని, మరో పామును వేటాడే క్రమంలో అది నివాస ప్రాంతంలోకి చొరబడినట్లుగా భావిస్తున్నారు. 18అడుగుల వరకు పెరిగే కింగ్ కోబ్రా(గిరినాగులు) ప్రకృతికి, రైతులకు నేస్తాల వంటివని, సహజంగా అవి మనుషులకు దూరంగా ఉంటాయని, వాటి జోలికి వెళితే గాని అవి మనుషులపై దాడి చేయబోవని, ఇతర పాములను, విష కీటకాలు, ఎలుకలను తింటూ ప్రకృతి సమతుల్యతకు దోహదం చేస్తుంటాయని అటవీ శాఖ సిబ్బంది వివరించారు. కింగ్ కోబ్రాలు కనిపిస్తే చంపకుండా తమకు సమాచారం అందించాలని కోరారు.

Latest News