AP Elections 2024 | ఏపీ ఎన్నికల్లో మెగా అల్లు ఫ్యామిలీ భిన్న పాత్రలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మెగాస్టార్‌ చిరంజీవి-అల్లు అర్జున్‌ కుటుంబాలు తలోదారి అన్నట్లుగా వ్యవహారిస్తూ విభిన్న పాత్రలతో రక్తికట్టించాయి. చిరంజీవి తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

AP Elections 2024 | ఏపీ ఎన్నికల్లో మెగా అల్లు ఫ్యామిలీ భిన్న పాత్రలు

ఒక్కోరు…ఒక్కోచోట ఒక్కో పార్టీకి మద్దతు

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మెగాస్టార్‌ చిరంజీవి అల్లు అర్జున్‌ కుటుంబాలు తలోదారి అన్నట్లుగా వ్యవహారిస్తూ విభిన్న పాత్రలతో రక్తికట్టించాయి. చిరంజీవి తమ్ముడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పవన్‌ గెలుపు కోసం చిరంజీవి ప్రచారానికి వస్తారనుకుంటే ఆయన తమ్ముడి గెలుపు కోరుతూ వీడియో ప్రచారానికే పరిమితమయ్యారు. అదే సమయంలో తెలంగాణలో తన కోడలు ఉపాసన బంధువు, చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు కోరుతూ కూడా చిరంజీవి వీడియో ప్రచారం చేశారు. ఇలా ఏపీలో జనసేనకు, తెలంగాణలో బీజేపీకి చిరంజీవి మద్ధతు పలికినట్లయ్యింది. ఇక చిరంజీవి సోదరుడు నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్‌తేజలు పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం చివరి రోజు చిరంజీవి కుమారుడు రాంచరణ్‌ సైతం తన బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోరుతూ పిఠాపురంలో జనసేన ఎన్నికల ప్రచారంతో సందడి చేశారు.

వైసీపీ తరుపున అల్లు అర్జున్‌

allu arjun in election campaign

అయితే పిఠాపురంలో ఒకవైపు రాంచరణ్‌ జనసేన అభ్యర్థి పవన్‌ కల్యాణ్‌ కోసం ప్రచారం చేస్తున్న సమయంలోనే, చరణ్‌కు బామ్మర్ధి అయ్యే అల్లు అర్జున్‌ నంద్యాలలో తన బంధువైన వైసీపీ అభ్యర్థి శిల్పారవిరెడ్డి గెలుపు కోరుతూ సతీసమేతంగా ప్రచారం నిర్వహించడం ఆసక్తికరం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మెగా-అల్లు కుటుంబాల్లో చోటుచేసుకున్న ఈ విచిత్ర పరిణామాలపై వారి అభిమానులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల పుణ్యమా అని మెగా-అల్లు ఫ్యామిలిలో చీలిక ఏర్పడిందని బావ బామ్మర్ది వీడిపోయారని, పవన్ కోసం రాంచరణ్, వైసీపీ కోసం అల్లు అర్జున్ ప్రచారం చేశారని, వారిలో ఎవరి అభ్యర్ధులు గెలుస్తారో చూడాల్సివుందంటూ అభిమానులు ఆసక్తికర చర్చల్లో మునిగిపోయారు.

వెంకటేశ్‌ అక్కడ అలా..ఇక్కడ ఇలా

సీనియర్‌ నటుడు దగ్గుబాటు వెంకటేశ్‌ సైతం ఎన్నికల ప్రచారంలో విభిన్నంగా వ్యవహారించారు. ఏపీలో బీజేపీకి ఓటేయాలని, తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేయాలని ప్రచారం చేశారు. తెలంగాణలో ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి తన వియ్యంకుడైన రామసహాయం రఘురామరెడ్డికి మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. ఏపీలో ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు.