లోకేష్ నోరు అదుపులో పెట్టుకో..

విధాత‌: మంత్రి కురసాల కన్నబాబు నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు.ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ‘ఎమ్మెల్సీ నారా లోకేష్‌ తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దానిపై ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆయన తన పర్యటనలో చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మాటలు వింటుంటే అతడి ఆరోగ్యంపై అనుమానం వేస్తోంది. సాక్షాత్తూ గౌరవ సీఎం గారిని పట్టుకుని గాలిగాడు అని మాట్లాడుతున్నాడు. అతడి మాటలు కొవ్వెక్కి మాట్లాడుతున్నట్లు ఉన్నాయి. అతడు ఒళ్లు […]

  • Publish Date - September 1, 2021 / 04:07 AM IST

విధాత‌: మంత్రి కురసాల కన్నబాబు నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు.ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ‘ఎమ్మెల్సీ నారా లోకేష్‌ తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దానిపై ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆయన తన పర్యటనలో చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ మాటలు వింటుంటే అతడి ఆరోగ్యంపై అనుమానం వేస్తోంది. సాక్షాత్తూ గౌరవ సీఎం గారిని పట్టుకుని గాలిగాడు అని మాట్లాడుతున్నాడు. అతడి మాటలు కొవ్వెక్కి మాట్లాడుతున్నట్లు ఉన్నాయి. అతడు ఒళ్లు మరిచి మాట్లాడుతున్నాడా’.
‘రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ భాషలో విచక్షణ లేకుండా ఉండొద్దు. కనీస సంస్కారం కూడా లేకుండా లోకేష్‌ మాట్లాడుతున్నాడు. ఆయన అమెరికాలో చదువుకున్నా కనీస సంస్కారం లేదు. తండ్రి, కొడుకు ఇద్దరూ పూర్తిగా ఫ్రస్టేషన్‌లో మునిగిపోయి, ఒళ్లు మర్చిపోయి మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా, చాలా హీనమైన భాషను లోకేష్‌ మాట్లాడుతున్నాడు’.
‘పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు బొడ్డు కోసి మొదలు పెట్టినట్లు లోకేష్‌ మాట్లాడుతున్నాడు. కానీ నిజానికి ఆ ప్రాజెక్టును ప్రారంభించింది రాజశేఖర్‌రెడ్డి. ఆయనే దానికి అనుమతులు తీసుకువచ్చాడు. చంద్రబాబు ఆ ప్రాజెక్టును కేవలం కాసులు కురిపించేదిగానే చూశాడు. దాన్ని ముందుకు తీసుకుపోలేదు. రాష్ట్రానికి వెన్నెముక అయిన ప్రాజెక్టును సీఎం వైయస్‌ జగన్‌ ముందుకు తీసుకెళ్తున్నారు. నిర్ణీత వ్యవధిలో దాన్ని పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు’.
‘లోకేష్‌ మీ మాటలను ప్రజలు నమ్మడం మానేసి చాలా కాలం అయింది. లేకపోతే 2019లో ఎన్నికల ఫలితాలు అలా రావు. సీఎం ని పట్టుకుని గాలిగాడు అని మాట్లాడడం. వైసీపీ నాయకులను కుక్కలు అని సంబోధించడం ఏమిటిదంతా?. లోకేష్‌ను అలా వదిలేయకుండా ఎవరికైనా చూపించాల్సిన అవసరం ఉంది. తనకు తాను ఒక పెద్ద మాస్‌ లీడర్‌గా బిల్డప్‌ ఇవ్వాలని అనుకుని, ఎవరో రాసిచ్చిన డైలాగ్‌లు చదివి వినిపిస్తున్నారు. లోకేష్‌ నీవేమైనా మీ మామ అనుకుంటున్నావా’.
‘లోకేష్‌ నీకు పోలవరం గురించి ఏ మాత్రం తెలియదు. అందుకే ఇలా పైపై మాటలు మాట్లాడి, సీఎం ని తిడితే జనం చూస్తారని అనుకుంటున్నావు. మీ పార్టీ లేనే లేదని మీ పార్టీ అధ్యక్షుడే స్వయంగా చెప్పాడు. అయినా సరే హైదరాబాద్‌లో ఉండి, అప్పుడప్పుడు వచ్చి ఇలా వచ్చి ఏదో మాట్లాడితే మీకు బాకా ఊదే పత్రికల్లో వస్తుంది’.
‘నీ మాటలకు మేము బదులివ్వాలనుకుంటే ఇంకా మాట్లాడగలం. కానీ మాకు విచక్షణ ఉంది. సంయమనం పాటిస్తున్నాం. మా నాయకుడు కూడా అదే చెబుతున్నారు. రాజకీయ విమర్శలు చేయండి. వాటికి మేము సమాధానం చెబుతాం’.
‘కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోయినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఖర్చు చేస్తోంది. ఈమధ్య కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా రూ.1900 కోట్లు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది. అందుకే పనులు వేగంగా సాగుతున్నాయి’.
‘ఇవన్నీ మీకు తెలియదు. కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. సీఎంని, మా పార్టీ వారిని తిడితే తమ సొంత ఛానళ్లు, పత్రికల్లో ఒక మహానాయకుడి మాదిరిగా చూపిస్తారు అని నీవు అనుకుంటున్నావు. నీవు మాట్లాడుతున్న భాషను ఒకసారి వీడియో వేసుకుని చూడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని లేరు. సీఎం గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీవసలు బయట తిరగలేవు. గుర్తు పెట్టుకో’.
‘ఇవాళ ప్రజల హృదయాల్లో ఉన్న ముఖ్యమంత్రి. కోట్లాది ప్రజలకు ఎప్పటికప్పుడు సాయం చేస్తున్న ముఖ్యమంత్రి. నీకు ఏమైనా సమస్యలు కనిపిస్తే, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి. అంతే తప్ప నోటికి ఏది వస్తే అదే పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు’.